Beijing Olympics : బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో చైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. టిబెట్, జింజియంగ్ ప్రావిన్సులతో పాటు హాంకాంగ్, తైవాన్ నుంచి రాకపోకలపై నిఘా తీవ్రతరం చేసింది. ముఖ్యంగా టిబెటన్లకు అంతర్జాతీయంగా సానుభూతి ఉంది. ఒలింపిక్స్ వేదికగా టిబెటన్లు నిరసనలు తెలిపే అవకాశం ఉందని రాజధాని లాసా, సిగాసే, రెబోకొంగ్ తదితర నగరాలకు పెద్ద సంఖ్యలో బలగాలను పంపుతోంది. టిబెటన్ల రాకపోకలపై నిబంధనలు కఠినతరం చేశారు. అటు జింజియాంగ్ ప్రావిన్సులో వుయ్గ్ఘుర్ ముస్లింలు చైనా మెయిన్ ల్యాండ్ కాకుండా కట్టడి చేస్తున్నారు. జింజియాంగ్ రాజధాని ఉరున్కిలో ఆంక్షలు తీవ్రతరం చేశారు.
హాంకాంగ్ నుంచి ప్రజాస్వామ్యవాదులు వచ్చి బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం మెండుగా ఉంది. తైవాన్ సరిహద్దుల్లో ప్రస్తుత తరుణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం చైనా-తైవాన్ ల మధ్య రగులుతోంది. చైనా కవ్వింపు చర్యలను ఎదుర్కునేందుకు తైవాన్ కు దన్నుగా అమెరికా, జపాన్ దేశాలు నావికా బలగాలను ఆ ప్రాంతంలో మొహరించాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేది నుంచి 20వ తేది వరకు అంతర్జాతీయ క్రీడా సంరంబం జరగనుంది. ప్రపంచ దేశాల నుంచి క్రీడాకారులు, మీడియా క్రీడా నగరంలో ఉండటం, చీమ చిటుక్కు మన్నా అంతర్జాతీయంగా ప్రాచుర్యం వచ్చే అవకాం ఉంటుంది. చైనా దమనకాండకు నిరసనగా టిబెటన్లు, వుయ్ఘుర్లు, హాంకాంగ్ వాసులు, వారి మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహించటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో అమెరికాకు దీటుగా పెత్తనం చేయాలని భావిస్తున్న కమ్యునిస్టు పాలకులు ఒలింపిక్స్ లో అపశ్రుతులు తలెత్తకుండా చైనా వ్యతిరేకుల్ని అడ్డకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. అయితే చైనా దాష్టికాలను ప్రపంచానికి తెలియచేసేందుకు వివిధ స్వచ్చంద సంస్థలు బీజింగ్ చేరుకున్నట్టు సమాచారం. దీంతో బీజింగ్ ఒలింపిక్స్ చైనాకు అగ్ని పరీక్షగా మారాయి.
Also Read : చైనాకు బాసటగా రష్యా