Legend of Literature: సాహిత్యంలో ప్రతిపదార్థం, వ్యాఖ్యానం, సమీక్ష, విమర్శ, అభిప్రాయం, ముందుమాట, పరిచయం వేరు వేరు అంశాలు. ఇవి కాక విశేషార్థం, పిండితార్థం, పండితార్థం, అంతరార్థం లాంటివి ఇంకా ఉన్నాయి. వీటిమధ్య ఉన్న సన్నని విభజన రేఖను గుర్తించేవారు కరువైపోయారు.
వ్యాఖ్యాన గ్రంథాలు లేకపోతే వందల, వేల ఏళ్లనాటి కావ్యాలేవీ మనకు అర్థం కావు. కవి రాసిన కాలంలోకి, సందర్భంలోకి, ఆ ‘కవిసమయం’లోకి వెళ్లకుండా ఇప్పటి మన దృష్టితో అప్పటి రచనను తూకం వేయడం వల్ల ఆ కవికి, మనకు ఇద్దరికీ అన్యాయం జరుగుతుంది.
పూర్వ కవుల హృదయం గ్రహించి తెలుగులో అనేక వ్యాఖ్యానాలు రాసిన బేతవోలు రామబ్రహ్మం గారికి 2021 సంవత్సరపు భాషా సమ్మాన్ అవార్డును కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించింది. గతంలో ఆయనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. భాషా సమ్మాన్ పురస్కారానికి ఆయన అన్ని విధాలా అర్హుడు. ఆయన సంస్కృతాంధ్రాల్లో పండితుడు. పద్యకవి. అష్టావధాని. కథకుడు. నాటక రచయిత. అనువాదకుడు. లోతయిన సాహితీ విమర్శకుడు. చక్కటి వ్యాఖ్యాత. అన్నిటికీ మించి గొప్ప అధ్యాపకుడు.
1995 ప్రాంతాల్లో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో మాడుగుల నాగఫణి శర్మగారి మహా సహస్రావధానం వార్తలు రాయడానికి విలేఖరిగా రోజూ వెళ్ళేవాడిని. అప్పుడు ఆ అవధానానికి బేతవోలు రామబ్రహ్మం గారు సమన్వయకర్త. ఆ అవధానం హంపీ భువనవిజయంలో సాహితీ ఉత్సవంలా జరగడానికి బేతవోలు గారి సారథ్యం కారణం. ఆయన తెలుగు పంచెకట్టు వేషం; భాష; అవధానికి- పృచ్ఛకులకు మధ్య వారధిగా సమన్వయం; దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు పెద్దా చిన్నా వీ ఐ పీ లు వచ్చినప్పుడు సభా నిర్వహణ; పృచ్ఛకుడు మంచి ప్రశ్న అడిగినా...అవధాని మంచి పద్యం చెప్పినా…పదే పదే ప్రస్తావిస్తూ ప్రోత్సహించిన తీరు…ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతోంది. అవధాని పద్యాలు కొన్ని మాత్రమే గుర్తున్నా...బేతవోలు గారి వ్యాఖ్యానం ప్రతి మాటా గుర్తుండిపోయింది. ఆరోజునుండి ఆయన మాటలు వింటూనే ఉన్నాను.
ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. చిన్నవారితో కూడా ఆత్మీయంగా ఉంటారు. చిన్నపిల్లవాడు మంచి పద్యం రాసినా అభినందించి…ప్రోత్సహిస్తారు. సాహిత్యంలో ఎక్కడ గుణమున్నా పట్టుకుంటారు. తెలుగు పద్యం ఇలా చదవాలి…ఇలా అర్థవంతంగా పాడాలి అన్నంత అందంగా పద్యం పాడతారు. ఆయన పద్య పఠనానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్ టీ ఆర్ అంతటివాడు మురిసి…తరువాత ప్రభుత్వం స్థాపించిన తెలుగు యూనివర్సిటీలో ఆయనకు తగిన స్థానం కల్పించారు.
అనేక సంస్కృత గ్రంథాలకు తెలుగులో చక్కటి వ్యాఖ్యానాలు రాశారు. “తెలుగు వ్యాకరణంపై సంస్కృత, ప్రాకృత వ్యాకరణాల ప్రభావం” అన్నది ఆయన పి హెచ్ డి అంశం. అనేక మంది పి హెచ్ డి విద్యార్థులకు గైడ్ గా వ్యవహరించారు.
బేతవోలు గారికి భాషా సమ్మాన్ అవార్డు వచ్చిన సందర్భంగా నాలుగు మాటలు రాయాలి…ఏవయినా పాయింట్లు చెప్పండి సార్ అని ప్రఖ్యాత శతావధాని, నా శ్రేయోభిలాషి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారిని అడిగాను. ఆయన చెప్పిన మాట- “సంస్కృత కావ్యాల గురించి తెలుగులో సామాన్యులకు అర్థమయ్యేలా బేతవోలు గారు రాసిన వ్యాఖ్యానాల్లో నిండయిన తెలుగుతనం ఉంటుంది. అవధాన సమన్వయకర్తగా ఆయన కూర్చుంటే ఆ అందమే అందం. అవధానులకు కొండంత అండ. ఆయన వల్ల అవధానులుగా పేరు ప్రతిష్ఠలు పొందినవారు ఎందరో?”
బేతవోలుకు భాషా సమ్మాన్ పురస్కారం వచ్చిన సందర్భంగా ఆయన రచనల్లో పండిన తెలుగును, సాహిత్య విలువలను, వ్యాఖ్యాన మాధుర్యాన్ని పట్టుకుంటే… భాషాభిమానులుగా ఆయన్ను మనం మరింతగా గౌరవించినవాళ్లమవుతాం. లేకపోతే ఆయనకొచ్చిన నష్టమేమీ లేదు. సాహితీ పిపాసులకు మాత్రం లాభం రాదు.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]