Thursday, September 19, 2024

గీతాసారం

ఆధ్యాతిక ప్రస్తావనల్లో భగవద్గీత అంటే భగవద్గీతే. నిజానికి ఇంకా చాలా గీతలున్నాయి. ఉద్ధవ గీత, గణేశ గీత, శివ గీత, అష్టావక్ర గీత, వసిష్ఠ గీత, హంస గీత…ఇలా ఎన్నెన్నో గీతలు. ఇవన్నీ కూడా భగవంతుడు చెప్పినవి; భగవంతుడికే చెప్పినవి. లేదా భగవంతుడి గురించి రుషులు చెప్పినవి.

18 అధ్యాయాల భగవద్గీత దానికదిగా విడిగా పురాణమూ కాదు; కావ్యమూ కాదు. మహాభారత కావ్యంలో అంతర్భాగం. గీత ప్రారంభమే “ధర్మ క్షేత్రే కురు క్షేత్రే”. ఈ మాటలను అటు ఇటు జరిపి “క్షేత్రే క్షేత్రే ధర్మం కురు” “ప్రతి చోటా ధర్మాన్నే పాటించు” అన్న అర్థం తీసుకోవాలని పురాణ ప్రవచనకారుల భాష్యం.

అటు ఇటు కురు పాండవులు కత్తులు దూసుకోవడానికి సమరశంఖం పూరించిన వేళ…కదనసీమ కురుక్షేత్రం మధ్యలో విల్లమ్ములు పారేసి వైరాగ్యంతో నీరుగారి…యుద్ధం చేయను…అన్న అర్జునుడికి కృష్ణుడు చెప్పినది ఈ భగవద్గీత.

మనమేమీ సంసార యుద్ధసీమలో అర్జునుడిలా భయపడి విల్లమ్ములు పారేసి…పలాయనం చిత్తగించలేదే? మరి మనకెందుకు ఈ గీత?

ఎందుకంటే?
కృష్ణుడు అర్జునుడి ద్వారా లోకానికే చెప్పాడు కనుక. ఒక్క అర్జునుడికి మాత్రమే ఇలాంటి వ్యామోహాలు, వైరాగ్యాలు, నిట్టూర్పులు, నిస్సత్తువ, పలాయనవాదాలు లేవు...లోకంలో అందరూ ఇదే జబ్బుతో బాధపడుతున్నారని కృష్ణుడికి తెలుసు కనుక. ఆ రోజుల్లో వాట్సాప్ లు, ఫేస్ బుక్ లైవ్ లు, శాటిలైట్ లైవ్ లు లేవు కాబట్టి కోట్ల మంది పోగయిన ఒకేచోట అందరికీ వినిపించేలా ఒకేసారి చెప్పేశాడు. అర్జునుడు ఒక్కడికే అయితే గుడారంలోకి పిలిచి చెవిలో చెప్పేవాడు. మనకు వినపడి ఉండేది కాదు.

మన మెదళ్లలో బూజు దులిపి, మన మనసుల్లో అలముకున్న నైరాశ్యాన్ని పారద్రోలి, వంగిన మన వెన్నెముకలను నిటారుగా నిలబెట్టి, మన జీవన కార్య క్షేత్రంలో యుద్ధానికి కావాల్సిన భౌతిక, బౌద్ధిక బలాన్ని ఇచ్చే భగవద్గీతను ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి మెడల్ సంపాదించి పెట్టిన మను భాకర్ ఎంత అద్భుతంగా అన్వయించుకుందో చెబుతుంటే…విన్నవారికి కడుపు నిండిపోతుంది.

మను వయసు ఇప్పుడు ఇరవై రెండేళ్లు. టోక్యో ఒలింపిక్స్ లో సాంకేతిక, ఇతరేతర కారణాల వల్ల పతకం చేజారినప్పటికి ఆ అమ్మాయి వయసు పట్టుమని పద్దెనిమిదేళ్లు. ఆ నిరాశ, నిస్పృహ, నైరాశ్యం, తలెత్తుకోలేని అవమానం నుండి బయటపడడానికి భగవద్గీత ఉపయోగపడింది- కర్తవ్యం గుర్తు చేసింది- ఫలితంతో సంబంధం లేకుండా పని మీద దృష్టి పెట్టడానికి ఉపయోగపడింది– అని పారిస్ లో ఓలింపిక్ మెడల్ సాధించాక కళ్లల్లో కాంతితో మను చెబుతున్న మాటలు విని తీరాలి.

యుద్ధసీమ నడిమధ్యలో ఆయుధం పట్టను- అని అస్త్రసన్యాసం చేసిన అర్జునుడికి “ఆయుధమే పట్టను- కేవలం రథం తోలుతాను” అన్న కృష్ణుడు చెప్పిన మాటల్లో మర్మం తెలిసి…మళ్లీ ఆయుధం పట్టాడు.

అర్జునుడు గీత విన్నాడు.
యుద్ధం చేశాడు.
యుద్ధం గెలిచాడు.

మను గీత విన్నది.
ప్రాక్టీస్ లో ప్రాక్టికల్ గా పాటించింది.
ఒలింపిక్స్ లో పతకం గెలిచింది.

మరి మనం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్