Saturday, November 23, 2024
HomeTrending Newsపంజాబ్ సిఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం

పంజాబ్ సిఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం

ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం (మార్చి 16) ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ కలన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆప్ శ్రేణులంతా పసుపు రంగు తల పాగాలు ధరించి హాజరయ్యారు. భగవంత్ మాన్ ఇచ్చిన పిలుపు మేరకు పసుపు రంగు తలపాగాలు ధరించి వచ్చారు. మాన్‌ ప్రమాణ స్వీకారానికి ప్రజలు భారీగా తరలి రావడంతో భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆప్ నేత ప్రమాణ స్వీకారానికి ప్రముఖ పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్, ఆప్ నేత రాఘవ చద్ద తదితర ఆప్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ప్రమాణస్వీకారం సందర్భంగా భగవంత్ మాన్ మాట్లాడుతూ.. భగత్ సింగ్‌, ఇతర స్వాతంత్య్ర సమరయోధుల తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ దేశ ప్రజల స్వేచ్చ కోసం పోరాడుతుందని భగవంత్ మాన్ పేర్కొన్నారు. భగత్ సింగ్ కేవలం ఈ దేశ ప్రజల స్వేచ్చ స్వాతంత్య్రాల కోసమే కాదు.. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం ఎవరి చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన చెందాడన్నారు. ఎవరైతే మన నుంచి స్వాతంత్య్రాన్ని లాగేసుకున్నారో.. ఇప్పుడు మనం వారి వద్దకే వెళ్తున్నామని అన్నారు. మెరుగైన సమాజం కోసం, దేశ ప్రగతి కోసం తాము దేశంలోనే ఉండి కృషి చేస్తామన్నారు. నిరుద్యోగం నుంచి వ్యవసాయం వరకు, వ్యాపారం నుంచి స్కూళ్ల వరకు ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఒక్క రోజు కూడా వృథా చేయదని.. ఇవాళ్టి నుంచే పని మొదలుపెడుతామని భగవంత్ మాన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఢిల్లీలోని స్కూళ్లు, మొహల్లా క్లినిక్‌లను సందర్శించేందుకు జనం ఎలాగైతే వెళ్తున్నారో… మున్ముందు పంజాబ్‌కు కూడా జనం అలా వస్తారని అన్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అభినందనలు తెలిపారు. తనను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. చరణ్‌జిత్ సింగ్ చన్నీ తన పార్టీ (కాంగ్రెస్) ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన ప్రమాణ స్వీకారం చేసినపుడు తనను ఆహ్వానించకపోవడం విచిత్రమని మనీష్ తివారీ ట్వీట్ చేశారు.

Also Read : పంజాబ్ లో కాంగ్రెస్ ను ఉడ్చేసిన ఆప్

RELATED ARTICLES

Most Popular

న్యూస్