Friday, July 5, 2024
HomeTrending Newsలోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా భారత్ న్యాయ్ యాత్ర

లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా భారత్ న్యాయ్ యాత్ర

భారత్ జోడో యాత్ర రెండో దశకు ముహూర్తం ఖరారైంది. మణిపూర్ నుంచి ప్రారంభం అయ్యే రెండో దశకు భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేశారు. కార్యక్రమ వివరాలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ బుదవారం(డిసెంబర్-27) వెల్లడించారు. జనవరి 14న ప్రారంభమై మార్చి 20వ తేది వరకు 14 రాష్ట్రాలు, 85 జిల్లాల మీదుగా… మణిపూర్ నుండి ముంబై వరకు సాగుతుందని వివరించారు.

భారత్‌ జోడో యాత్ర మొదటి దశలోని విశేష అనుభవంతో రాహుల్‌ గాంధీ యాత్ర చేస్తున్నారు. యువత, మహిళలు, బడుగు బలహీన వర్గాల ప్రజలతో ఈ యాత్ర 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యుపి, ఎంపి, రాజస్థాన్, గుజరాత్ చివరకు మహారాష్ట్రతో పూర్తి అవుతుంది.

భారత్ జోడో యాత్ర 2:0ను భారత్ న్యాయ యాత్ర అని పిలుస్తారు. మణిపూర్ హింస..ప్రధానమంత్రి మౌనాన్ని ప్రశ్నించటమే ఈ యాత్ర లక్ష్యం. మొదటి దశలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధి ఈ యాత్ర బస్సు ద్వారా కొనసాగించనున్నారు. జనవరి 14వ తేదిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇంపాల్ లో ప్రారంభిస్తారు.

లోక్ సభ ఎన్నికలు దగ్గరలోనే ఉండటంతో రెండో దశ బస్సుతో కొనసాగించేందుకు రాహుల్ సిద్దమయ్యారని పార్టీ నేతలు వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలకు పార్టీ నేతలను సన్నద్ధం చేయటం, ఇండియా కూటమితో సీట్ల సర్దుబాటు తదితర అంశాల దృష్ట్యా పాదయాత్ర చేయలేకపోతున్నట్టు తెలిసింది. జనవరి 22వ తేదిన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుగుతుండగా అదే నెల 14వ తేదిన రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేపట్టడం యాదృచ్చికం.

భారత్ న్యాయ్ యాత్ర (BNY) ద్వారా లోక్ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేయటం లక్ష్యంగా కనిపిస్తోంది. ఎంపి ఎన్నికలతో పాటే ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్టోబర్ లో హర్యానా, మహారాష్ట్రలో, ఏడాది చివరలో జార్ఖండ్ శాసనసభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళటం పార్టీకి కలిసివస్తుందని హస్తం నేతల అంచనా.

రెండో దశ కొనసాగే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాత్ర కొనసాగే రాష్ట్రాలైన మహారాష్ట్ర, అస్సాం మినహా మిగతా ప్రాంతాల్లో పార్టీ బలహీనంగా ఉంది. బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కాంగ్రెస్ జీవచ్చవంలా మారింది. రెండు రాష్ట్రాల్లో TMC, బిజు జనతాదళ్ కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయగా బిజెపి ప్రత్యాన్మాయంగా ఎదిగింది. జార్ఖండ్, బీహార్ లో పొత్తులతో నెట్టుకొస్తోంది.

ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఓటమి చెందినా లోక్ సభ ఎన్నికల కోసం సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. గుజరాత్, మహారాష్ట్రలో పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నా నాయకుల మధ్య సమన్వయం, మిత్ర పక్షాలతో కలిసి ప్రజల్లో ఉండేలా రాహుల్ యాత్ర తోడ్పడుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్