భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో ప్రతిసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఏ అభ్యర్థి రెండోసారి గెలవలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంపై హైదరాబాద్ ప్రభావం అధికంగా ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన ఎంపి స్థానం పరిధిలో భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, మునుగోడు, ఇబ్రహింపట్నం,జనగాం నియోజకవర్గాలు ఉన్నాయి. శాసనసభ ఎన్నికల్లో జనగాంలో బీఆర్ఎస్ గెలవగా మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది.
2024 లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ తరపున క్యామ మల్లేశం, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బిజెపి నుంచి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్, సిపిఎం నుంచి జహంగీర్ బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
భువనగిరిలో జెండా ఎగుర వేసేందుకు అన్ని పార్టీలు కదనోత్సాహం ప్రదర్శిస్తున్నాయి. గతంలో ఎర్రజెండా ప్రభావం ఉన్న ప్రాంతాలు కావటంతో సిపిఎం కూడా ఈ దఫా పోటీకి దిగింది. 2009, 2014 ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు రావటంతో దీన్ని కైవసం చేసుకోవాలని సిపిఎం చెమటోడుస్తోంది. నియోజకవర్గంలో లెఫ్ట్ క్యాడర్ బలంగా ఉంది. సిపిఐ, సిపిఎం పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల వారిగా ప్రచారంలో నిమగ్నం అయ్యారు.
తెలంగాణ వచ్చాక 2014లో బీఆర్ఎస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత ఈ ప్రాంత వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. క్రమంగా గ్రామ స్థాయి వరకు కారు గుర్తు చేరుకుంది. ఇంత జరిగినా 2019లో బీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఓటమితో గులాబీ నేతలు పోలో మంటూ కాంగ్రెస్, బిజెపిలోకి వెళుతున్నారు. ఈ దశలో బీఆర్ఎస్ ఉనికి చాటుకోవటమే పార్టీ నేతలకు ప్రథమ కర్తవ్యంగా మారింది.
భువనగిరిలో రెండు సార్లు కాంగ్రెస్ గెలవగా ఒకసారి 2009లో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. వీరి కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునేందుకు చివరి వరకు యత్నించారు. ఎట్టకేలకు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది. రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరున్న చామల గెలుపు కోసం కోమటిరెడ్డి సోదరులు పార్టీ నేతలను సమన్వయము చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించిన బిజెపి నాయకత్వం అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తోంది. కేంద్రంలో బిజెపి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కమలం శ్రేణులు ఓటర్లకు వివరిస్తూ పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
నియోజకవర్గంలో అందరికి సుపరిచితుడైన మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ బిజెపి నుంచి పోటీలో ఉన్నారు. గతంలో ఎంపిగా చేసిన బూర 2019లో ఓడిపోయారు. ఈ దఫా సానుభూతి కలిసి వస్తుందని… ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాతో తమదే గెలుపని బిజెపి నాయకత్వం ఉంది.
ప్రధాన పోటీ కాంగ్రెస్, బిజెపిల మధ్య ఉంటుందని విశ్లేషణ జరుగుతోంది. బీఆర్ఎస్ పోటీలో ఉన్నా నామమాత్రమే అని చర్చ జరుగుతోంది. సిపిఎం పోటీ ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు నష్టం జరిగి తమదే గెలుపు అని బిజెపి నేతలు ధీమాతో ఉన్నారు.
-దేశవేని భాస్కర్