Thursday, January 23, 2025
HomeTrending NewsCyclone: బిపర్‌జాయ్‌ ఉగ్ర రూపం...అంధకారంలో గుజరాత్ తీరం

Cyclone: బిపర్‌జాయ్‌ ఉగ్ర రూపం…అంధకారంలో గుజరాత్ తీరం

తీవ్ర తుఫాను బిపర్‌జాయ్‌ గుజరాత్‌ తీరాన్ని తాకింది. గురువారం రాత్రి కచ్‌ ప్రాంతంలోని లఖ్‌పత్‌ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్‌ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బిపర్‌జాయ్‌ తుఫాను కేంద్రం దాదాపు 50 కిలోమీటర్ల వ్యాసంతో ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో పది రోజులకుపైగా కొనసాగిన తొలి తుఫానుగా ఇది నిలిచిపోతుందన్నారు.

కాగా, గుజరాత్‌లోని తీరప్రాంతాల్లో బిపర్‌జాయ్‌ తుఫాను బీభత్సం సృష్టిస్తన్నది. బలమైన ఈదురుగాలుల ధాటికి వందల సంఖ్యలో చెట్లు నేలకొరుగుతున్నాయి. ఇండ్లు కూలిపోతున్నాయి. సౌరాష్ట్ర, కచ్‌ తీరాలతోపాటు ద్వారకలోని గోమతి ఘాట్‌, దమణ్‌ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భీకర గాలులతో కచ్‌ జిల్లాలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది.

మోర్బీ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతోపాటు 115 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో చెట్లు కూలిపోగా, 300 విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయని అధికారులు తెలిపారు. సుమారు 45 గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయన్నారు. తుఫాను కారణంగా ఇద్దరు మరణించగా, 22 మంది గాయపడ్డారు.

తుఫాను తీరందాటిన ప్రాంత పరిసరాల్లో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. ద్వారకలోని ప్రాచీన ఆలయం సహా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను, గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలోని సోమ్‌నాథ్‌ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. 18 ఎన్డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్టీఆర్‌ఎఫ్‌ బృందాలతోపాటు రోడ్లు,భవనాల శాఖకు చెందిన 115 బృంధాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో 99 రైళ్లను రైల్వే శాఖ రద్దుచేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్