Tuesday, September 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంజాషువా 'గిజిగాడు' పద్యాలు

జాషువా ‘గిజిగాడు’ పద్యాలు

Structural Construction:

పద్యం:-
“జిలుగుం బంగరు రంగులం గులుకు మేల్చిన్నారి పూగుత్తి సొ
మ్ములు గీలించిన తుమ్మగొమ్మలకు, నీవు న్నీ సతీరత్న మూ
యెల గీమున్ దగిలించి రేఁబవలు హాయిందూఁగరా; గాడ్పు బి
డ్డలు మీ కూడిగ మాచరింప, గిజిగాఁడా! నీకు దీర్ఘాయువౌ!”
అర్థం :-
నిగనిగలాడే బంగారు ఆభరణాలతో, మెత్తటి పూల గుత్తులతో అలరారే తుమ్మ కొమ్మలకు తగిలించిన గూడులో పిల్లగాలులు ఊయయలూపుతూడగా నువ్వు-నీ భార్య హాయిగా ఉంటారు కదా ఓ పక్షి రాజా! మీరు చల్లగా ఉండండి.

పద్యం:-
“తేలిక గడ్డి పోచఁలను దెచ్చి, రచించెద వీవు తూఁగుటు
య్యేల గృహంబు, మానవుల కేరికి సాధ్యముగాదు, దానిలో
జాలరు, లందులో జిలుఁగు శయ్యలు నంతిపురంబు లొప్పగా
మేలు భళీ! పులుంగుటెకిమీడవురా గిజిగాఁడ! నీడజా!”
అర్థం:-
తేలికపాటి గడ్డిపోచలను తెచ్చి తూగుటుయ్యాల ఇల్లు(గూడు)కట్టుకుంటావు. అందులో ఎన్నెన్ని గదులు? ఎంత మెత్తదనం? ఎంత అందం? ఎంత నిర్మాణ కౌశలం? మనుషులకెవరికయినా ఇలా సాధ్యమవుతుందా?

పద్యం:-
“కులుకు పసిండినిగ్గుల దుకూలములన్ ధరియించి ముద్దు బి
డ్డలును, బడంతి నీ పొదిగిట న్ని దురింపఁగ, గన్నెగాడ్పు లూ
యెల సదనంబు నూచ, భయమింత యెరుంగక కన్నుమూయు, నీ
యలఘు సుఖంబు మాకుఁ గలదా! గిజిగా! యొక ఱేని కున్నదా?”
అర్థం:-
నీ భార్య, నీ పిల్లలు నీవు అల్లుకున్న గూట్లో నీ ఒళ్ళో నిర్భయంగా, హాయిగా పడుకుంటే పకృతి జోల పాడుతూ ఉంటుంది. ఇంత గొప్ప సుఖం మనుషులకు దక్కుతుందా? అన్ని సంపదలు, అంతులేని అధికారం ఉన్న ఒక రాజుకయినా దక్కుతుందా?

పద్యం:-
“అందమున నీకు నీడగు నందగాడు
గృహవినిర్మాణమున నిన్ను గెలుచువాడు
వైభవంబునఁ బోలు దేవతల ఱేఁడు
లేఁడురా గిజిగా! మొనగాఁడ వోయి!”
అర్థం:-
అందంలో నీకు సాటి రాగలవారు; ఇల్లు కట్టుకోవడంలో నీతో పోటీపడగలవారు; వైభవంలో నీతో సమానంగా తూగగల ఇంద్రుడు లేరు.

పద్యం:-
“నీ గిజిగాని నామకము, నీ తెలివిం బ్రకటించు గూడు, నీ
మైఁగల సోయగం బవని మానవకోటికి ముద్దుసేయు నో
యీ! గిజిగాడ! భీతిలకు! నీవు ధరాతలి నున్న బిట్టుగా
వాగెడు నాస్తికు ల్తలలు వంతు రనంతుని చెంత ఖిన్నులై”
అర్థం:-
గిజిగాడు అన్న పేరులోనే నీ తెలివిని తెలిపే గూడు దాగి ఉంది. నీ రెక్కల ఈకల అందానికి మానవకోటి మైమరచిపోతూ ఉంటుంది. నీ ప్రతిభను చూసిన తరువాత దేవుడి సృష్టి ఇంత గొప్పదా? అని నాస్తికులు కూడా తలవంచుకుని…పొగుడుతారు!

బహుశా సమస్త తెలుగు సాహిత్యంలో పక్షి గూడు మీద జాషువా చెప్పినంత అందంగా, అద్భుతంగా, తాత్వికంగా, కవితాత్మకంగా ఇంకెవరూ చెప్పి ఉండకపోవచ్చు. ఒకవేళ చెప్పినా అవన్నీ జాషువా తరువాతే కావచ్చు.

గాలిలో ఊగే చిటారు కొమ్మకు పక్షి గడ్డి పోచలతో గూడు కట్టడం దానికదిగా ఒక అద్భుతం. అందం. ఆశ్చర్యం. లోపలికి వెళ్లి రావడానికి సరిపోయేంత సందు ఉంచి తన చుట్టూ తానే గాలిలో గూడు కట్టుకునే పక్షిని చూస్తే నిజంగానే సృష్టిలో ఎన్నెన్ని అద్భుతాలు అందాలుగా మన కళ్ల ముందు పరచుకుంటున్నాయో అని ఆశ్చర్యపోవాలి. ఒక్కొక్క గడ్డిపోచను ముక్కున పట్టుకొని వచ్చి, జారిపోకుండా ఒక మగ్గం మీద పడుగు పేకల్లా నేతగాడు వస్త్రం నేసినట్లు పక్షి గూటి గోడలు కట్టే నైపుణ్యాన్ని చూడని కళ్లు కళ్లే కాదు. ఆ నైపుణ్యాన్ని మెచ్చుకోని మనసు మనసే కాదు.

కాంక్రీట్ కొమ్మలకు ప్లాస్టిక్ బొమ్మలే తప్ప ప్రాణమున్న పక్షులు రావు. చెట్లను నరికి సెల్ టవర్ల భారీ రేడియేషన్ మహా వృక్షాలను మొలిపించిన మన అభివృద్ధిలో ఒక్క పిచ్చుక కూడా రాదు. కనీసం జాషువా కళ్లతో అయినా పక్షి గూళ్లను చూద్దాం. జాషువాతో పాటు మనం కూడా పక్షి గూట్లోకి వెళ్లి హాయిగా ఊయలలూగుదాం.

నిర్మల్ జిల్లా సరస్వతి కెనాల్ వంతెన కింద పక్షులు గడ్డితో కాకుండా బురదతో తలకిందులుగా చిన్న గురిగి(కుండీల్లాంటి) గూళ్ళు నిర్మించుకున్నాయి. స్ట్రీక్ త్రోటెడ్ స్వాలో అనే జాతి పక్షులు ఇలా బురదతో గూళ్ళు కట్టుకుంటాయట.

ప్రకృతికి మించిన పాఠం లేదు-
కళ్లు తెరిచి చూస్తే…
మనసు పెట్టి వింటే…

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్