ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఈ రోజు మధ్యాహ్నం తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో గుజరాత్ అభివృద్ధి మరింతగా జరగాలనే రాజీనామా చేసినట్టు విజయ్ రూపాని తన రాజీనామా కారణాలను వివరించారు. గుజరాత్ ఎన్నికలకు మరో ఏడాదికి పైనే ఉన్నా ఇప్పుడే రాజీనామా చేయటం చర్చనీయంశంగా మారింది.
2016లో ఆనందిబెన్ పటేల్ తో రాజీనామా చేయించి విజయ్ రూపానికి పట్టం కట్టారు. రాజ్ కోట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రూపాని రాజీనామా ఆకస్మికం కాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే రాబోయే ఎన్నికలకు కొత్త ముఖాన్ని తీసుకు రావటం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత తగ్గించి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలనే కమలనాథులు ప్రణాలికలు సిద్దం చేసినట్టు సమాచారం.
అసెంబ్లీలో బిజెపి, కాంగ్రెస్ ల బలాలు జానెడు దూరంలో ఆన్నట్టుగా ఉన్నాయి. బిజెపి 99 సీట్లు కాంగ్రెస్ 77 సీట్లు కలిగి ఉన్నాయి. ఈ దఫా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది జాతీయ స్థాయి ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే మోడీ-షా ద్వయం గుజరాత్లో కొత్త మంత్రాంగానికి తెర లేపినట్టు వార్తలు వస్తున్నాయి.