Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయిండ్రు. ప్రజలు అవకాశమిస్తే బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం జోగిపేట సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ, మాజీమంత్రులు ఈటల రాజేందర్, బాబూ మోహన్, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ,  పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జె.సంగప్ప, లంకల దీపక్ రెడ్డి మహిళా మోర్చా కర్నాటక ఇంచార్జ్ ఆకుల విజయ, బీసీ, యువ మోర్చాల రాష్ట్ర అధ్యక్షలు ఆలె భాస్కర్, భాను ప్రకాశ్ తోపాటు జిల్లా నాయకులు విజయపాల్ రెడ్డి, రామక్రిష్ణ, ఉదయ బాబూమోహన్, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

టీఆర్ఎసోళ్లు ఇఫ్పుడే కరెంట్ కట్ చేసిండ్రట. ఈసారి వాళ్ల పవర్ కట్ చేస్తం. చిల్లర రాజకీయాలకు భయపడతమా? పళ్లు పటపట కొరికితే ఉంటరా? ఢిల్లీకి పోయి వంగి వంగి దండాలు పెట్టి వచ్చిన కేసీఆర్ పోయి ఫాంహౌజ్ ల పడుకున్నడు. కేసీఆర్ ఢిల్లీలోకానీ, ఇక్కడ కానీ పీకేదేమీ లేదు. జోగిపేట తెలంగాణ అడ్డా. నిజాం నిరంకుశ పాలనపై యుద్దం చేసిన గడ్డ. పవిత్రమైన జోగినాథ్ ఆలయం కొలువైన స్థలం. ఆ స్వామి ఆశీస్సులతో టీఆర్ఎస్ ను ఓడిద్దాం.

తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఎక్కడికి పోయినయ్. ఇంటర్ విద్యార్థులు చనిపోయినా, ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయినా కనీసం పరామర్శించని వ్యక్తి కేసీఆర్. ముఖ్యమైన నేతలు ప్రతిరోజు తమ కార్యక్రమాలపై షెడ్యూల్ విడుదల చేస్తారు. కానీ ఈ సీఎం కేసీఆర్ మాత్రం షెడ్యూల్ ఉండదు. ఫాంహౌజ్, ప్రగతిభవన్ కే పరిమితమైండు. ఇంట్ల టీవీలు పగిలితే ఫాంహౌజ్ కు పోతడు. కొడుకుకు ముఖ్యమంత్రి పదవి విషయంలో వాళ్లింట్లో టీవీలు పగులుతున్నయ్. టీవీ షోరూంలకు మస్త్ డిమాండ్ వచ్చిందట.

అధికారంలోకి వచ్చేది బీజేపీనే

ఈ రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించే పార్టీ బీజేపీ మాత్రమే. కేసీఆర్ గడీలను బద్దలు కొట్టే పార్టీ. కేసీఆర్ అహంకారాన్ని, అవినీతి పాలనను చరమగీతం పాడే పార్టీ బీజేపీ. టీఆర్ఎస్-బీజేపీ ఎన్నటికీ ఒక్కటి కావు. కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తుండు. ఎఫ్పుడైనా బీజేపీ టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసిందా? కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు. కేసీఆర్ సీఎం కాబట్టి ఏ సీఎం వెళ్లినా మోదీగారు కలుస్తారు. మోదీ రోజుకు 18 గంటలు పనిచేస్తరు. కానీ కేసీఆర్ మాత్రం 18 గంటలు పడుకునే వ్యక్తి. ఎన్నికలొస్తున్నయనగానే ఢిల్లీ పోతడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే కేసీఆర్ ఢిల్లీవెళ్లి మేయర్ పదవి ఇస్తామని ఆఫర్ చేసిండు. తిరస్కరించిన అమిత్ షా 2023లో అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీ తప్ప తూట్ పాలిష్ పదవులకు మాకు అవసరం లేదని కరాఖండిగా చెప్పిన వ్యక్తి అమిత్ షా. టీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధమేలేదు. టీఆర్ఎస్ ను ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో అధికారం ఏర్పాటు చేసే పార్టీ బీజేపీ.

దళిత హామీలన్నీ ఏమైనయ్ కేసీఆర్

ఇది ఎస్సీ నియోజకవర్గం.  బాబాసాహెబ్ అంబేద్కర్ ను కనీసం గౌరవించని సీఎం కేసీఆర్. అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు రాని సీఎం. దళితులకు 3 ఎకరాలిస్తానని మోసం చేసిన వ్యక్తి. అవినీతి పేరుతో దళితులను కేబినెట్ నుండి పక్కనపెట్టిన వ్యక్తి. అంబేద్కర్ పుట్టిన స్థలాన్ని, స్వర్గస్తులైన స్థలాలను, చదువుకున్న స్థలాలను గుర్తించి బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ స్పూర్తి కేంద్రాలను నిర్మించిన ఘనత నరేంద్రమోదీదే. రైతు రుణమాఫీ, సబ్సిడీ విత్తనాలు, నిరుద్యోగ భ్రుతి, ఇంటికో ఉద్యోగంవంటి హామీలేఏమీ ఇవ్వలేదు. రోడ్ల కోసం, ఫ్యాక్టరీలు, ప్రాజెక్టుల కోసం తమ భూమినిస్తే తగిన న్యాయం చేయకుండా కేసీఆర్ మోసం చేసిండని జనం బాధపడుతున్నరు. రాష్ట్రంలో ఎస్సీలకు ఏం చేసిండో సీఎం స్పష్టం చేయాలి. ఎస్సీలను వంచించే పార్టీ టీఆర్ఎస్. ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు అన్యాయమైపోతుండ్రు. చేనేత రంగాన్ని నాశనం చేసిండ్రు. కనీసం ఆ కుటుంబాలను ఆదుకోలేదు. కమ్మరి సంఘం కష్టాల్లో ఉన్నరు. కోవిడ్ తో పేదలు అల్లాడుతున్నరు. ఆసుపత్రిలో కనీసం సౌకర్యాల్లేవు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు.

విదేశాల్లో డబ్బు దాచుకుంటున్న కేసీఆర్

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలుస్తారనే భయంతో ‘దళిత బంధు’ పేరుతో దళిత సమాజాన్ని మోసం చేస్తున్నరు కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇప్పటికీ జీతాలు రాలేదు. రోజుకో జిల్లాకు వాయిదాల పద్దతిన జీతాలిస్తుండు. అలాంటి వ్యక్తి దళిత బంధు ఎట్లా ఇస్తడో అర్ధం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలపై ఒక్కొక్కరి తలమీద రూ.లక్షకుపైగా అప్పు ఉంది. ధనిక రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్లు అప్పు చేసిండు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు. ప్రజా సంగ్రామ యాత్ర స్పందన చూశాక విదేశాలకు పోయి డబ్బు దాచుకుంటున్నడు. తెలంగాణ అమరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకుంటే కేసీఆర్ కుటుంబం ఒక్కటే పాలన చేస్తోంది. శ్రీకాంత చారి, సుమన్, పోలీస్ కిష్టయ్యసహా అనేక మంది తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తే వారి త్యాగాలు వ్రుథా పోతున్నయ్. ఆ కుటుంబాలు ప్రశ్నిస్తున్నయ్. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నయ్. తెలంగాణ తల్లి రోదిస్తోంది. రండి…బీజేపీ కార్యకర్తల్లారా…ఈ మూర్ఖుడి చేతిలో బందీ అయిన నన్ను బంధ విముక్తి చేయాలని తెలంగాణ తల్లి రోదిస్తోంది. కేసీఆర్ గడీలను బద్దలు కొట్టి కేసీఆర్ కుటుంబానికి పొలిమేర దాటించేలా తరమికొట్టాలని అడుగుతోంది.

దేశంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకునే పార్టీ బీజేపీ. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు అవకాశమిచ్చారు. ఒక్కసారి బీజేపీకి అధికారమివ్వండి. తెలంగాణ ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నం. లాఠీదెబ్బలు తింటున్నం. జైళ్లకు పోతున్నం. మా లక్ష్యం ఒక్కటే. 2023లో గొల్లకొండపై కాషాయ జెండాను రెపరెపలాడించడమే మా ధ్యేయం.

జోగిపేటను అభివ్రుద్ది చేసింది నేనే : మాజీమంత్రి బాబూ మోహన్

మాజీ మంత్రి బాబూ మోహన్ : స్థానిక ఎమ్మెల్యే పనులు చేయకుండా దోచుకుంటున్నాడు. తాగు, సాగు నీటి కోసం సింగూరు నీటిని తీసుకొచ్చేందుకు నేను ప్రయత్నిస్తే ఇఫ్పుడున్న ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు. సింగూరు బ్యాక్ వాటర్ ను తీసుకొచ్చింది నేనే. రెండు పాలిటెక్నిక్, పీజీ కాలేజీలను తీసుకొచ్చాను. ప్రజల అవసరాలను తీర్చాలని ప్రయత్నించాను. కాంగ్రెస్, టీఆర్ఎస్ దురాగతాలను ఎండగట్టేందుకే పాదయాత్ర చేస్తున్నారు. కేంద్రం నుండి రూపాయి రాలేదని టీఆర్ఎస్ నేతలు అబద్దాలాడుతున్నరు.

టీఆర్ఎస్ అవినీతి పాలనను అంతం చేసేందుకే పాదయాత్ర :  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గీయ

కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేయడానికే బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలంతా బీజేపీకి అండగా ఉన్నారు. కేసీఆర్ పాలనను చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ వచ్చాకా యువతకు ఉద్యోగాలు వచ్చాయా? నిరుద్యోగ భ్రుతి వచ్చిందా? దేశంలో పేదల ఇళ్ల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మిస్తున్నారు. కానీ కేసీఆర్ ఇవ్వడం లేదు. నరేంద్రమోదీ ఉచిత బియ్యం ఇస్తున్నారు. ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తున్నరు. కానీ కేసీఆర్ ఫొటోలు పెట్టుకున్నారు. తెలంగాణలో మార్పు కన్పిస్తోంది. యువత, మహిళలుసహా ప్రతి ఒక్కరూ బండి సంజయ్ కు మద్దతిస్తున్నారు. తెలంగాణలో ప్రజా స్వామ్యం లేదు. తానీషా పాలన కొనసాగుతోంది. అవినీతి పాలన సాగుతోంది. వీటికి చరమగీతం పాడేందుకే సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com