వైఎస్సార్సీపీ మతతత్వ వైఖరితో ఉండే పార్టీ అని… ఆ పార్టీతో తమకు ఎప్పుడూ సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. బిజెపి కేంద్ర, రాష్ట్ర శాఖలు మొదటి నుంచీ సిఎం జగన్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని, దీనిలో రెండో ఆలోచనకు తావులేదని.. ఏనాడూ జగన్ ను తాము సమర్ధించలేదని తేల్చి చెప్పారు. విజయవాడ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోము మీడియాతో మాట్లాడారు. గతంలోనే యువమోర్చా నిర్వహించిన బహిరంగ సభలో సిఎంను లిక్కర్ కింగ్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అభివర్ణించారని, జేపీ నడ్డా, ప్రకాష్ జవ్ దేకర్ లాంటి వారు కూడా జగన్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారని గుర్తు చేశారు.
అసలు బిజెపి మీతో ఎప్పుడు ఉందో చెప్పాలని సోము డిమాండ్ చేశారు. జగన్ కు సపోర్ట్ చేసేందుకు ఇక్కడ రాజకీయ పార్టీలు పెడతారా అని ప్రశ్నించారు. పవన్ పై జగన్ వ్యాఖ్యలు సరికాదని, జనసేన తమ మిత్ర పక్షం కాబట్టి దీనిపై తాను స్పందిస్తున్నానని చెప్పారు. ఏపీలో మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనబడకుండా చేయడం కోసం, గతంలో తాము ఆరోపణలు చేసినప్పుడు వాటిపై స్పందించకుండా… ఇప్పుడు తమను పలచన చేయడం కోసం జగన్ వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఓ వైపు మోడీ ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుంటూ, తమ పథకాలకు ఆయన స్టిక్కర్లు వేసుకుంటూ ఇప్పుడేమో వేరే రకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారన్నారు. తాము ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడల్లా విభజన హామీలపై మాట్లాడుతుంటారని, అంటే తాము ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినప్పుడే ఇవి మీకు గుర్తుకొస్తాయా అంటూ వీర్రాజు నిలదీశారు. కేంద్రం నిధులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.