Sunday, November 3, 2024
HomeTrending Newsఒడిశా సిఎం రేసులో సురేష్ పూజారి!

ఒడిశా సిఎం రేసులో సురేష్ పూజారి!

ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవ‌ర‌నే విష‌యంలో అనేక ఉహాగానాలు వినిపిస్తున్నా.. మంగ‌ళ‌వారం స్ప‌ష్ట‌త రానుంది.  సిఎం అభ్యర్థి కొలిక్కి రాకపోవటంతోనే ఈ రోజు జరగాల్సిన ప్రమాణ స్వీకర కార్యక్రమాన్ని ఎల్లుండికి వాయిదా వేశారు. భువ‌నేశ్వ‌ర్‌లో రేపు జ‌రిగే పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌, భూపేంద్ర యాద‌వ్ పార్టీ ప‌రిశీల‌కులుగా వస్తున్నారు. ఎమ్మెల్యేల ఏకాభిప్రాయంతో ఒడిశా కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత సురేష్ పూజారి తెలిపారు. ఎల్లుండి(జూన్ 12) సీఎం ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌న్నారు.

ఇక సీఎం రేసులో సురేష్ పూజారి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. బ్రజరాజ్‌నగర్ నుండి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సురేష్ పూజారి న్యూఢిల్లీకి వెళ్ళటంతో సిఎం పదవికి కీలక పోటీదారుగా ఉండవచ్చనే చర్చలకు ఆజ్యం పోసింది. బిజెపి రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షిడిగా చేసిన పూజారి 2019లో బార్‌గఢ్ నుంఛి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈసారి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా అధిష్టానం ఆదేశించింది.

పూజారితో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్, మోహన్ మాఝీ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. మరో ఇద్దరు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కేవీ సింగ్ దేవ్, సురమా పాధి కూడా పోటీలో ఉన్నారు. గుజరాత్ కేడర్ మాజీ ఐఏఎస్ అధికారి గిరీష్ చంద్ర ముర్ము, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ 24 ఏళ్ల పాలనకు ముగింపు పలికి, 147 మంది సభ్యుల అసెంబ్లీలో 78 సీట్లను గెలుచుకుని, రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ మెజారిటీ సాధించింది. రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాలకు గానూ 20 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకు జూన్ 12న ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. రాజధానిలోని జయదేవ్ విహార్ నుంచి జనతా మైదాన్ వేదిక వరకు ప్రధాని రోడ్‌షో నిర్వహించనున్నారు.

ప్రమాణ స్వీకార సమయం రాత్రి 8.35 గంటలకు నిర్ణయించారు. ఒడిశా కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పాల్గొనేందుకు భువనేశ్వర్‌కు వచ్చే ముందు అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో జరిగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మోడీ హాజరవుతారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్