బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలు మిగిల్చారు. రామమందిర నిర్మాణం బిజెపికి మేలు చేకూర్చలేదు. ఈ మూడు రాష్ట్రాల్లో నిరుద్యోగంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. అగ్నివీర్, నిత్యావసరాల ధరల అసంతృప్తి ప్రజల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది. కనీస మద్దతు ధర కోసం రైతుల పోరాటం, బిజెపి నేతలు రాజ్ పుత్ లను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయటం బిజెపికి నష్టం చేకుర్చాయని అంచనా.
ఉత్తరప్రదేశ్‌లో పదేండ్ల తర్వాత మొదటిసారి బీజేపీ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల పొత్తు ఇండియా కూటమికి సత్ఫలితాలను ఇచ్చింది. 2014లో కేవలం 5 స్థానాలు, 2019లో 5 స్థానాలకే పరిమితమైన సమాజ్‌వాదీ పార్టీ ఈసారి 62 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 37 స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఉనికి కోల్పోయే స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఆరు స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయిన అమేథీలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్.. స్మృతి ఇరానీని ఓడించారు.
దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన యుపిలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం 80 నియోజకవర్గాలకు గానూ బీజేపీ 2014లో 71 స్థానాలను, 2019లో 62 స్థానాలను గెలుచుకున్నది. ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ 74 స్థానాల్లో పోటీ చేసి 33 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు ఇక్కడ బీజేపీ సీట్లకు భారీగా గండి కొట్టింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ అనూహ్యంగా పుంజుకున్నది. ఆ పార్టీ గొప్పగా చెప్పుకున్న యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పాలసీ బెడిసికొట్టినా గెలిచిన సీట్లలో మోడీ కన్నా యోగి పాలన పట్ల నమ్మకంతోనే ఓట్లు పడ్డాయని విశ్లేషణ ఉంది. రాష్ట్రం నుంచే పోటీ చేసినప్పటికీ మోడీ మ్యాజిక్ ఈసారి పని చేయలేదు. అప్నాదల్(సోనేవాల్), ఆర్‌ఎల్‌డీ, సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, నిషాద్ పార్టీలతో పొత్తు కుదుర్చుకొని, సామాజిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకునేందుకు కమలం పార్టీ చేసిన ప్రయత్నాలు కూడా అంతగా ఫలించలేదు.
హర్యానాలో గతంలో రెండు సార్లు మొత్తం పది సీట్లు గెలుచుకున్న బిజెపి ఈసారి అయిదింటితో సరిపెట్టుకుంది. నిరుద్యోగంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసినా పేపర్ లీకేజీలు జరగటం, వాయిదా పడటం సాధారణం అయింది. అగ్నివీర్ పేరుతో సైన్యాన్ని నిర్వీర్యం చేశారని యువత అసంతృప్తిగా ఉంది. రైతుల పోరాటాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసిందని అన్ని వర్గాల ప్రజలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజస్థాన్ లో రాజ్ పుత్ నేత సుఖ్ దేవ్ సింగ్ గోగ మేడి హత్య బిజెపికి నష్టం చేకూర్చింది. రాజ్ పుత్ రాజులు తమ రాజ్యాలను కాపాడుకునేందుకు వారి కుమార్తెలను మొఘల్ రాజులకు ఇచ్చి వివాహం చేసి సంబంధాలు కుదుర్చుకున్నారని కేంద్రమంత్రి పురుషోత్తం రుపాలా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యలు గుజరాత్ లో కూడా కమలాన్ని దెబ్బతీశాయి.
బిజెపి హిందువుల పార్టీ అని జోరుగా ప్రచారం జరిగినా ఏం మేలు జరిగిందని మధ్యతరగతి ప్రజలు ప్రశ్నించటం మొదలుపెట్టారు. నిరుద్యోగం, నిత్యావసరాల ధరల కట్టడికి కేంద్రం చొరవ తీసుకోలేదని విమర్శలు మొదలయ్యాయి. దేశభక్తి పేరుతో రాజకీయం చేయటం తప్పితే సామాన్యుడికి ఒరిగింది ఏమి లేదనే అసంతృప్తి ప్రజల్లో నెలకొంది.
-దేశవేని భాస్కర్