Sunday, January 19, 2025
Homeతెలంగాణదళితులపై ప్రేమ ఎందుకో: ఈటెల

దళితులపై ప్రేమ ఎందుకో: ఈటెల

గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ వర్గాల ప్రజలపై సీఎం కేసీయార్ కు కొత్తగా ప్రేమ పుట్టుకు వస్తోందని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలని గతంలో తాను కోరితే, నాలాంటి వారికి పేరు వస్తుందని పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. తానూ బైటకు వచ్చిన తరువాత ఇప్పుడు వైద్యశాఖపై సిఎం ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. జమ్మికుంటలో మీడియాతో ఈటెల రాజేందర్ మాట్లాడారు.

తెలంగాణా రాష్ట్రంలో దళితుడే మొదటి ముఖ్యమంత్రి అన్న కేసిఆర్ ముఖ్యమంత్రి మాట పక్కకు పెడితే దళితుడికి ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా లాక్కున్నారని ఈటెల ఆరోపించారు. దళితులు పాలించేందుకు అర్హులు కాదని అవమానిచారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎంవోలో ఒక్క దళిత ఐఏఎస్ అధికారులకు అవకాశం ఉందా? అని మరోసారి ప్రశ్నిచారు.

భూపాలపల్లి కలెక్టర్ గా పనిచేసిన దళితుడు మురళిని అవమానించి పంపించారని ఈటెల గుర్తు చేశారు. అనేక మంది దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సరైన పోస్టింగ్స్ ఇవ్వకుండా వేధించారని ఈటెల వివరించారు.

దళితులకు ఈ ఏడు సంవత్సరాల్లో కనీసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారా అని నిలదీశారు. దళితులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిచాల్సింది పోయి కొంతమంది నేతలు సీఎం కు వంత పాడుతున్నారని ఈటెల అన్నారు. దళితులకు ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ కింద ఎంత మందికి సాయం చేశారని, ఏమి చేయకుండా ఇప్పుడు ఏదో చేస్తామని దళిత జాతిని మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు.

ముఖ్యమంత్రికి ఆయన చెప్పిందే వేదమని, మరొకరి మాట గౌరవించే పరిస్థితి లేదని ఈటెల వ్యాఖ్యానించారు. మీకు పదవులిచ్చిన, బతుకు ఇచ్చిన జాతికి అన్యాయం జరుగుతుంటే పట్టించుకోకపోవడం హేయమైన చర్య అని టిఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్