Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు హోంమంత్రి మహమూద్ అలీని సాక్షులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశమే లేదని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే హైకోర్టు ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు  బృందాన్ని (సిట్)ను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విషయంపై తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. ఈరోజు సాయంత్రం రామగుండం ఎన్టీపీసీ జ్యోతినగర్ లోని మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి నివాసంలో బండి సంజయ్ మీడియాతో ముచ్చటించారు. పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…

• రామగుండం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోంది.

•టీఆర్ఎస్ కలిసి రాకపోవడానికి కారణమేంది? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే స్వాగతం పలకాలనే సంస్కారం కూడా లేని మనిషి కేసీఆర్. గతంలోనూ ఇంతే.. ఒకసారి కోవిడ్ అంటడు. ఇంకోసారి జ్వరం అంటడు.. మరోసారి ఢిల్లీ అంటడు… ఇట్లా సాకులు చెబుతూ ప్రోటోకాల్ పాటించని మూర్ఖుడు కేసీఆర్.

• తెలంగాణకు అన్యాయం జరిగింది…. కేంద్రం నిధులివ్వడం లేదని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్… అదే నిజమైతే ప్రధానమంత్రే స్వయగా రాష్ట్రానికి వస్తున్నారు కదా… ఆయనను నేరుగా కలిసి ఎందుకు అడగటం లేదు? రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడానికైనా ప్రధాని పర్యటనను వేదికగా చేసుకోవచ్చు కదా.

• గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ అద్బుతాలు స్రుష్టిస్తానని… రైతులందరికీ యూరియా ఫ్రీగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? రైతులకు ఫ్రీ యూరియా ఎందుకు అందించడం లేదు? సమాధానం చెప్పాలి.

• అసలు ప్రధాని పర్యటనను ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారో కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి. ఇకపై దేశంలో యూరియా కొరత లేకుండా చేసేందుకు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క టన్ను యూరియాకు 40 వేలు ఖర్చవుతుంటే ఏకంగా 35 వేల సబ్సిడీ ఇస్తూ రైతులకు రూ. 5 వేలకే అందిస్తున్నారు. అందుకోసం ప్రధాని పర్యటనను అడ్డుకోవాలనుకుంటున్నారా?

• వేల కోట్ల నిధులతో రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్నారు? ఆ పని చేయొద్దని అడ్డుకోవాలనుకుంటున్నారా?.. దేనికోసం అడ్డుకోవాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.

• సీఎంను ఆహ్వానించకుండా అవమానించారంటూ టీఆర్ఎస్ ద్రుష్ప్రచారం చేస్తోంది. ముందు నాకు ఆహ్వానమే లేదని సీఎం అన్నడు… కేంద్ర మంత్రి మన్సూక్ మాండవీయ ఆహ్వాన లేఖను విడుదల చేస్తే… ఇప్పుడు ప్రోటోకాల్ పాటించలేదంటాడు… ఆ ప్రోటోకాల్ వివరాలను కూడా వెల్లడిస్తాం… అప్పుడేమంటాడో మరి.

• సీఎం మోచేతి నీళ్లు తాగుతున్న కమ్యూనిస్టులు ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని చూడటం సిగ్గు చేటు. కమ్యూనిస్టులకు సిగ్గుండాలే… కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారా? నిజాం షుగర్ మిల్లు, అజాంజాహి మిల్లు తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేశారా? బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారా? జీతాలు, పెన్షన్లు సక్రమంగా ఇస్తున్నారా? దేనికోసం సీఎం మోచేతి నీళ్లు తాగుతున్నారో కమ్యూనిస్టులు సమాధానం చెప్పాలి.

• ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను సాక్షిగా చేర్చాలి. ఎందుకంటే ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్న సమయంలోనే సీఎం ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశంపై వీడియో, ఆడియోలు వెల్లడించారు. పైగా నాకే ఫోన్ చేశారు. వెంటనే హోం మంత్రి ద్వారా ఫిర్యాదు చేశామని చెప్పారు. కాబట్టి తప్పకుండా ఇద్దరిని సాక్షులుగా చేర్చాలి.

• సిట్ ఏర్పాటు పై…. ఈ కేసులో బీజేపీ పాత్ర ఉందని కేసీఆరే చెప్పారు. అట్లాంటప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో సిట్ అందుకు భిన్నంగా విచారణ చేస్తుందా? … అందుకే హైకోర్టు పర్యవేక్షణలో సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో సిట్ విచారణ జరగాలన్నదే బీజేపీ ఉద్దేశం. అందుకే హైకోర్టును ఆశ్రయించాం.

• పోలీస్ ఆధ్వర్యంలో జరిగే సిట్ విచారణ సీఎం ఆదేశాలకు భిన్నంగా జరిపి నివేదిక ఇచ్చే అవకాశమే లేదు. అందుకే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు రావడం లేదు? మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు ఎందుకు వెల్లడించడం లేదు? ప్రగతి భవన్ లోనే ఎందుకు ఉంచినట్లు వివరణ ఇవ్వాలి.

• గతంలో కేసీఆర్ నయీం కేసు, ఇంటర్మీడియట్ పేపర్ లీక్, మియూపూర్ భూములు, డ్రగ్స్ కేసు వంటి అంశాలన్నింటిపైనా సిట్ వేశారు. కానీ ఆ విచారణలు ఏమయ్యాయి? కేవలం సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం తప్ప చేసిందేమిటి? ఎవరికి న్యాయం జరిగింది? నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

• సీఎం అవినీతి, అక్రమాలపై ఆధారాలు సేకరిస్తున్నాం. తప్పకుండా విచారణలు జరుగుతాయి. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయి. కాళేశ్వరం అవినీతిపై…. జరిగిందో లేదో… మీకు తెలియదా? అవినీతి జరిగిందనేది వాస్తవం.. తప్పకుండా విచారణ జరుగుతుంది. వాస్తవాలు బయటకు వస్తాయి. సింగరేణి ఓపెన్ కాస్టులను బంద్ చేస్తామని చెప్పిందెవరు? ఎందుకు ఆ పని చేయలేదు? సుప్రీంకోర్టు ఆధేశాల ప్రకారమే కోల్ బ్లాకుల కేటాయింపు జరుగుతోంది. ఓపెన్ టెండర్ ద్వారా సింగరేణి సంస్థ సైతం కోల్ బ్లాక్ లను తీసుకున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నాసిరకంగా జరిగాయనే అంశంపై.. ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటుంది.

Also Read: అన్ని రాష్ట్రాల అభివృద్దే మోదీ లక్ష్యం బండి సంజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com