తెలంగాణ ఎన్నికల్లో బిజెపి వ్యూహం భిన్నంగా ఉంది. అగ్రవర్ణాల పార్టీగా పేరున్న బిజెపి ఒక్కసారిగా బలహీన వర్గాల వారికి అధికంగా సీట్లు ఇవ్వటం, తమ పార్టీ అధికారంలోకి వస్తే బిసి నేత ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించటం సాహసమనే చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో సుస్థిరం అయ్యేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోందని అగ్ర నేతల వైఖరి చూస్తే స్పష్టం అవుతోంది.
తెలంగాణలో ఈ పార్టీని మొదటి నుంచి సంపన్న వర్గాలు, అగ్రకులాల వారే ఆదరించారు. హిందుత్వ వాదమే అజెండాగా ఆవిర్భవించిన కమలం పార్టీని పీపుల్స్ వార్ టార్గెట్ చేసింది. బిజెపి నేతలను అనేకమందిని నక్సల్స్ హతమార్చారు. గ్రామాల్లో భూస్వాములు రాజకీయ అండ కోసం బిజెపిలో చేరేవారు. ఆ విధంగా తెలంగాణలో కొందరి పార్టీగానే కొనసాగింది. కాలక్రమంలో నక్సల్స్ ఉనికి కోల్పోవటం, కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావటం.. బిసి నేత ప్రధానమంత్రి కావటంతో జనబాహుల్యంలోకి వేగంగా చేరుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పాగా వేసేందుకు శతథా కృషి చేస్తోంది. 2014,2018తో పోల్చితే ఈ దఫా తెలంగాణ ఎన్నికల్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. తెలంగాణలో బలపడేందుకు ఉత్తరప్రదేశ్ ఫార్ములా అమలు చేస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పోల్చితే అత్యధికంగా బిసిలు, మహిళలకు టికెట్లు ఇచ్చిన పార్టీగా బిజెపి నిలిచింది. దీనికి తోడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
SC వర్గీకరణకు మద్దతు ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..నవంబర్ 11న మాదిగ విశ్వరూప సభలో పాల్గొనటం…దానికి కొనసాగింపుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా… మాదిగ నేతలు, మేధావులతో నవంబర్ 18న ప్రత్యేకంగా సమావేశం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. వర్గీకరణపై మందకృష్ణకు స్పష్టమైన హామీ లభించినా…మాదిగ మేధావుల్లో విశ్వాసం కల్పించేందుకు అమిత్ షా వివరణ ఇచ్చారని .. ఆ దిశగా సఫలం అయ్యారని సమాచారం. అమిత్ షాతో సమావేశం తర్వాత మాదిగ మేధావులు కూడా ఉత్సాహంగా కనిపించారు.
వర్గీకరణకు బిజెపి మద్దతు ఇస్తోందనే అంశంపై క్షేత్రస్థాయిలో మాదిగలు విశ్వసించటం లేదు. అన్ని పార్టీలు ఈ విధంగానే ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేస్తున్నాయని వాపోతున్నారు. ఉష మెహ్రా కమిషన్ తో సహా ఇప్పటివరకు వేసిన అన్ని కమీషన్లు మాదిగలకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయని…ఇప్పుడు మరో కొత్త కమిషన్ ఎందుకని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
మాదిగల అనుమానాలు పోగొట్టేందుకే కేంద్రహోం మంత్రి అమిత్ షా శనివారం మాదిగ మేధావుల భేటీలో స్పష్టత ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉండటంతో పూర్తి వివరాలు బయటకు రాకపోయినా…తెలంగాణ ఎన్నికల తర్వాత వర్గీకరణ దస్త్రం వేగం పుంజుకుంటుందని ఢిల్లీ వర్గాలు చెపుతున్నాయి. లోకసభ ఎన్నికల నాటికి వర్గీకరణ పూర్తి అవుతుందని వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలో బిజెపిని అందరి పార్టీగా తీర్చిదిద్దేందుకు 2018 ఎన్నికల తర్వాత నుంచే తెరవెనుక కసరత్తు జరుగుతోంది. మాదిగల సమస్యలపై బిజెపి, ఆర్.ఎస్.ఎస్ మేధావులు చర్చలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్, బుద్ధవనం ప్రాజెక్టు ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్యతో పలుమార్లు సమావేశం అయినట్టు సమాచారం ఉంది. బిజెపిలో చేరితే తగిన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినా..వివిధ కారణాల వల్ల మల్లేపల్లి లక్ష్మయ్య వెనుకంజ వేశారని తెలిసింది. తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో మాదిగ మేధావులు, ఆచార్యులు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు అధికార వర్గాల్లో ఉన్న ఈ వర్గం వారి నుంచి వివరాలు సేకరించారని సమాచారం. ఇదంతా నాగపూర్ స్వయం సేవకుల పర్యవేక్షణలోనే జరిగిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
సార్వత్రిక ఎన్నికల్లో బిసి, SCల అండతో తెలంగాణలో మెజారిటీ సీట్లు కొల్లగొట్టాలని బిజెపి వ్యూహంగా కనిపిస్తోంది. నల్లమల నుంచి దండకారణ్యం వరకు మారుమూల పల్లెలకు కమలం గుర్తు చేరుకుంది. క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకత్వం బలపడుతోంది. దక్షిణాదిలో ఎక్కువ స్థానాలు సాధిస్తేనే మూడో దఫా కేంద్రంలో అధికారంలోకి రావటానికి అవకాశం ఉంటుంది. కర్ణాటకలో జరిగిన నష్టాన్ని తెలంగాణలో భర్తీ చేయాలని బిజెపి కార్యాచరణ రూపొందించింది. కర్ణాటక తర్వాత తెలంగాణలో మాత్రమే పార్టీ బలోపేతానికి అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వర్గీకరణ చేపడితే పార్టీపై విశ్వాసం పెరుగుతుందని కమలనాథుల అంచనా. శాసనసభ ఎన్నికల్లో ప్రయోగించిన బిసి కార్డు, SC వర్గీకరణ ద్వారా లబ్ది పొందాలని…లోకసభ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నారని పార్టీ నేతల ద్వారా తెలిసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బిజెపి గెలిచే అవకాశాలు ఉన్న స్థానాల్లో ఎక్కువగా బిసి స్థానాలు ఉండటం గమనార్హం.
-దేశవేని భాస్కర్