Friday, November 22, 2024
HomeTrending NewsMumbai Taxi: కాలీ- పీలీ టాక్సీ సేవలు నిలిపివేత

Mumbai Taxi: కాలీ- పీలీ టాక్సీ సేవలు నిలిపివేత

బొంబాయి పేరు ముంబైగా మారినపుడు అనేకమంది హర్షం వ్యక్తం చేశారు.  కొన్ని నిరసన ధ్వనులు కూడా వినిపించాయి. పారిశ్రామిక, సినీ వర్గాలు ముంబై పేరుకు అలవాటు పడేందుకు చాలా సమయం పట్టింది.

ఆ తర్వాత ముంబైలో పర్యాటకుల్ని ఎంతో ఆకర్షించే డబుల్ డెక్కర్ బస్సు వంతు వచ్చింది.ఈ నెల (అక్టోబర్) 2023 నెల ప్రారంభంలో, ప్రసిద్ధ డబుల్ డెక్కర్ బస్సు నీలాంబరి సేవ నిలిపివేశారు. పర్యాటకులను నిరంతరం ఆకర్షిస్తున్న ముంబై (నీలాంబరి) ఎయిర్ కండిషన్ లేని ఓపెన్ డబుల్ డెక్కర్ బస్సు చివరిసారిగా నడిచింది గురువారం (అక్టోబర్ 5) 2023.

ముంబైలో పాత డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ రిటైర్మెంట్ తర్వాత… ఇప్పుడు మహానగరానికి చిహ్నంగా ఉన్న నలుపు – పసుపు ట్యాక్సీలు(ప్రీమియర్ పద్మిని) కూడా ముంబై వీధుల్లో నుండి అదృశ్యం కానున్నాయి. రేపటి నుంచి (అక్టోబర్ 30 – సోమవారం) నుండి ముంబై రోడ్లపై నలుపు- పసుపు ట్యాక్సీలు కనిపించవు. కాలీ- పీలీ టాక్సీ ఐదు దశాబ్దాలకు పైగా ముంబై వీధుల్లో తిరుగుతోంది.

చివరి ‘ప్రీమియర్ పద్మిని’ అక్టోబర్ 29, 2003న టార్డియో RTO వద్ద నలుపు-పసుపు ట్యాక్సీగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ టాక్సీ రకం సేవలు 1964లో ప్రారంభం కాగా ముంబైకి గర్వకారణంగా నిలిచింది. దీని తయారీ 2001 సంవత్సరంలో నిలిపివేశారు. సిని రంగానికి చెందిన రజనీకాంత్, మమ్ముట్టి, అమీర్ ఖాన్‌లతో సహా ఆ కాలంలోని చాలా మంది ప్రముఖులు ప్రీమియర్ పద్మిని కలిగి ఉండటం గౌరవంగా భావించేవారు.

టాక్సీలలో కొత్త మోడల్స్, ఆన్‌లైన్ క్యాబ్ సేవల కారణంగా, కాలీ పీలీ టాక్సీని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముంబై వీధుల్లో కొత్త మోడల్ బ్లాక్ అండ్ యెల్లో ట్యాక్సీలు పరుగులు తీస్తున్నాయి. కనీసం ఒక కాళీ-పీలీ కారును మ్యూజియంలో భద్రపరచాలని నగరంలోని అతిపెద్ద టాక్సీ డ్రైవర్ యూనియన్‌లలో ఒకటైన ముంబై టాక్సీమెన్స్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అది అమలులోకి రాలేదు.

ప్రీమియర్ పద్మిని క్యాబ్‌లు కేవలం రోజువారీ ప్రయాణం కోసమే కాకుండా ముంబై మహానగర సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగం అయింది. ‘టాక్సీ నెం. 9211,’ ‘ఖాలీ-పీలీ, ఆ అబ్ లౌట్ చలే వంటి అనేక హిందీ చిత్రాలలో కనిపించాయి. 2019లో ప్రీమియర్ పద్మిని పేరుతో ఏకంగా సినిమా కూడా వచ్చింది.

ఫియట్ కంపనీకి చెందిన ప్రీమియర్ పద్మిని ముంబై నగరానికి అలంకారంగా ఉండేది. 1980, 1990ల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నిరుద్యోగ యువత ఉపాధి కోసం వచ్చి డ్రైవర్ గా ప్రీమియర్ పద్మినితో జీవితం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి అధికంగా వచ్చేవారు. వారిని భయ్యేగాళ్ళు అని పిలిచేవారు.

కలకత్తాలో అంబాసిడర్ కారు టాక్సీలు అంతరించినా కొన్ని రోడ్లపై కనిపిస్తాయి. ప్రభుత్వం అధికారికంగా నిషేదించలేదు. కాలానుగుణంగా మార్పు తప్పదు. కాలం చెల్లిన ఈ వాహనాల ద్వారా కాలుష్యం అధికం అవుతోంది. దీంతో ప్రభుత్వాలు కుడా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్