ఇండోనేషియాలోని గనుల్లో ప్రమాదాలు…కార్మికులు చనిపోవటం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేటు రంగంలోని గనుల్లో కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఉపాధి కోసం వెళ్ళే కార్మికులు తిరిగి వచ్చే వరకు నమ్మకం లేదు. తవ్వకాల తర్వాత గనుల వద్ద రక్షణ చర్యలు చేపట్టకపోవటంతో సాధారణ ప్రజలు మృత్యువాత పడుతున్నారు. బహుళజాతి సంస్థలు.. ప్రభుత్వం మధ్య ఉన్న అనధికార సంబంధాలతో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదే కోవలో ఇండోనేషియాని ప్రైవేట్ కంపెనీకి చెందిన ఒక బొగ్గుగనిలో శుక్రవారం భారీ ఫేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు చనిపోయారు. నలుగురిని రెస్క్యూ టీమ్ కాపాడింది. పశ్చిమ సుమత్రా రాష్ట్రంలోని సవహ్లుంటో జిల్లాలో ఉన్న బొగ్గుగనిలో విషవాయువుల కారణంగా పేలుడు జరిగినట్టు అధికారులు తెలిపారు. మీథేన్ వంటి ప్రాణాంతక వాయువుల వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో విషవాయువులను బయటకు పంపేందుకు బ్లోయర్స్, ఎక్స్‌టెన్షన్ ఫ్యాన్లు ఉపయోగించారు. ఈ ప్రమాదంలో నాలుగో వ్యక్తిని 240 మీటర్ల దూరంలో కనిపెట్టారు. ప్రాణాలతో బయటపడ్డ వాళ్లందరికీ కాలిన గాయాలు అయ్యాయి. అంతేకాదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. దాంతో వాళ్లకు రెస్క్యూ బృందాలు వెంటనే ఆక్సిజన్ అందించాయి. ఆ తర్వాత వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.