Saturday, October 19, 2024

న్యాయదృష్టి

జస్టిస్ చౌదరి సినిమాలో పెద్ద ఎన్ టీ ఆర్ కోటు వేసుకుని, సిగార్ పైపు నోట్లో పెట్టుకుని “చట్టానికి- న్యాయానికి జరిగిన ఈ సమరంలో…” అని వేటూరి రాతకు, బాలసుబ్రహ్మణ్యం పాటకు అభినయించినట్లు న్యాయదేవత మూగగా ఇక పాడుకోవాల్సిన పని లేదు. దశాబ్దాలుగా న్యాయదేవత కళ్లకు కట్టిన గుడ్డను తొలగించారు. ఆమె కళ్లు తెరవడానికి కొన్ని తరాల సమయం పడితే పట్టింది కానీ…ఇప్పటికైనా కళ్లు తెరిచినందుకు లేదా కంటిముందు అడ్డు గోడ తొలగినందుకు సంతోషించాలి. ఎడమ చేతిలో రాజ్యాంగ ప్రతితో, కుడి చేతిలో త్రాసుతో ఇక న్యాయదేవత న్యాయాన్యాయాలను కళ్లు తెరిచి చూస్తూ ఆచి తూచి తీర్పులిస్తుంది. మంచిదే.

కఠినమయినది ధర్మం.. కన్ను లేనిది న్యాయం;
మనసు లేనిది చట్టం.. మనిషి జన్మకిది ఖర్మం..
న్యాయమూర్తిగా నేనున్నప్పుడు.. న్యాయస్థానమే నాదయినప్పుడు
నాకు మీరు లేరూ..
ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు…
తప్పా! తప్పా! తప్పా! నో!

సత్యం కోసం.. హరిశ్చంద్రుడు సతీసుతులనెడబాసినదీ..
గర్భవతిని సీతమ్మను రాముడు.. కారడవికి పంపించినదీ..
కన్న తల్లినే కాదని కర్ణుడు.. రాజత్యాగము చేసినదీ…
కన్న కొడుకునే కాదని నేనీ కన్నీటిని దిగమింగుతున్నది..
ఎందుకోసం? ఆ.. ఎందుకోసం?
దహించినా అది ధర్మం కనుకా.. సహించాలి అది సత్యం కనుకా..
కృశించినా.. నే నశించినా..
అది న్యాయం కనుక..
ఆ న్యాయమే.. నా ధైవం కనుకా”

విశ్వ శ్రేయస్సును కోరుకునేది కావ్యం అని కావ్య లక్షణ శాస్త్రంలో ఒక ప్రమాణం. కొంచెం విస్తృతార్థంలో తీసుకుంటే పాటకైనా ఆ ప్రమాణమే వర్తిస్తుంది. సినిమా సందర్భాన్ని దాటి విశ్వజనీనమైన సత్యాలను ఆవిష్కరించిన గీతాలు కావ్యాలై వెలుగుతున్నాయి. అలాంటి పాట ఇది.

న్యాయాన్యాలను సమీక్షించిన మీదట, ధర్మాధర్మాలను బేరీజు వేసిన మీదట, ఇరు పక్షాల వాదనలను సావధానంగా విన్న మీదట పాటల పూదోటల సర్వోన్నత న్యాయస్థానంలో ‘గీతా’చార్యుడిగా కూర్చుని వేటూరి ఇచ్చిన తీర్పు ఈ పాట.

ఆకాశవాణి మీరు కోరిన పాటల్లో వేటూరి “కన్ను లేనిది న్యాయం” అన్న పాటను ప్రజలు కోరని రోజు వస్తే అంతకంటే కావాల్సిందేముంటుంది?

“ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకానీ…గెలిచేదంతా న్యాయం కాకపోవచ్చు” అన్న నానుడి లోకంలో ఎందుకు స్థిరపడిందో కూడా కనులు తెరిచిన న్యాయదేవత తెలుసుకుంటే అప్పుడు గెలిచేదంతా న్యాయమే కావచ్చు!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్