బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాద మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సహాయక బృందాలు ఇవాళ మరో 26 మృతదేహాలను వెలికితీయడంతో మొత్తం మృతుల సంఖ్య 51కి చేరింది. పంచగడ్ జిల్లాలోని ప్రఖ్యాత బోదేశ్వరి ఆలయంలో మహాలయ అమావాస్య మొక్కులు తీర్చుకునేందుకు ఆదివారం వెళ్తుండగా కరొటోవా నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాదం సమయంలో పడవలో వంద మంది వరకు ఉంటారని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. వారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నట్లు చెప్పారు. చనిపోయినవారు అందరు హిందువులేనని పంచగడ్ డిప్యూటీ కమిషనర్ దీపాంకర్ రాయ్ వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ బృందాలు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టాయి. ఈ గాలింపుల్లో ఆదివారం 25 మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం సాయంత్రానికి మరో26 మృతదేహాలు లభ్యం కావడంతో మొత్తం మృతుల సంఖ్య 51కి పెరిగింది. ఈ ప్రమాదం నుంచి కేవలం 10 మంది మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేరారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవటంతో బంగ్లాదేశ్ లో పడవ ప్రమాదాలు సాధారణంగా మారాయి. నిబధనలకు విరుద్దంగా పడవల్లో మోతాదుకు మించి ప్రయాణికులను తీసుకెళ్లటం మరో కారణంగా చెపుతున్నారు. బంగ్లాదేశ్ లో గంగ, బ్రహ్మపుత్ర నదులకు తోడు సుమారు 230 నదులు ఉన్నాయి. దేశంలో ఎటు నుంచి ఎటు పోవాలన్నా ఏదో ఒక సందర్భంలో నది దాటడం తప్పనిసరి. అయినా సరే ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టకపోవటం దురదృష్టకరం. బంగ్లాదేశ్‌లో గతంలో కూడా రెండు భారీ పడవ ప్రమాదాలు జరిగాయి. 2015లో సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక.. మరో కార్గో నౌకను ఢీకొని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. 2020లో ఢాకాలో ఒక పడవను మరో పడవ ఢీకొనడంతో మొత్తం 32 మంది మరణించారు.