Thursday, April 18, 2024

పునరపి మరణం

It’s our Right: కాంగ్రెస్ అంటే కలగూరగంప. కులం, మతం, ప్రాంతం, లింగ, వచన భేదాలకతీతంగా ఉన్నాననుకుంటూ- అందులోనే మునిగి ఉండడం దాని ప్రత్యేకత.

కాంగ్రెస్ కల్చర్ అని ఒక రాజకీయ సంస్కృతి ఉంది. ఈ కల్చర్ స్వరూప, స్వభావాలు, గుణ గణాలు చెబితే అర్థమయ్యేవి కావు. రాయబోతే మాటలకు దొరికేవి కావు. అది అనుభవైకవేద్యం.

తనకే తెలియనంత చరిత్ర కాంగ్రెస్ ది. నిజానికి కాంగ్రెస్ ను స్థాపించింది హ్యూమ్. ఓం ప్రథమంలో విదేశీ బీజంతోనే కాంగ్రెస్ పురుడు పోసుకుంది. అప్పటి నుండి దానికి విదేశీ బొడ్డు తాడు ఊడకుండా ఉండిపోయింది.

దేశం, కాలం సాపేక్షకం. మన అందరిళ్లల్లో ఇటాలియన్ మార్బుల్ తప్పనిసరి. అదొక హోదా. అందం. అలాగే కాంగ్రెస్ ఆఫీసులో కూడా ఇటాలియన్ మార్బుల్స్ చక్కగా కుదిరినట్లు ఉన్నాయి. ఇంటీరియర్ కు ప్రపంచంలో ఇటలీ పెట్టింది పేరు. అలా కాంగ్రెస్ కు ఇటలీ ఇంటీరియర్ చక్కగా అమరినట్లుంది.

ఒక దుర్ముహూర్తాన ఇటాలియన్ మార్బుల్ ను, ఇటలీ ఇంటీరియర్ ను గుజరాత్ మార్బుల్స్ ఆక్రమిస్తాయి. ఇక అప్పటినుండి కాంగ్రెస్ కు కష్టాలు చెప్పే వస్తాయి. డెబ్బయ్, ఎనభై ఏళ్లు నిండినవారి మీద పందెం కాస్తూ అంతులేని రాజ శోకాన్ని, మధ్యలో నాథుడు లేని ప్రదేశాన్ని ఏలుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతూ ఉంటుంది.

తన జ్యోతి చేతిలో వెలగదని గ్రహించిన యువ ఆదిత్యులు కమలంలో వెలుగులు వెతుక్కుని ఆరోగ్యంగా తోచిన కాషాయ కషాయం తాగుతుంటారు. అయినా చేతికి ఇంకా వేళ్లు మిగిలి ఉన్నట్లు-చేతికి ఎముక లేనట్లు వృద్ధ జంబూకాలకే కాంగ్రెస్ వంత పాడుతూ ఉంటుంది. ఈలోపు విమానాన్ని నడపను పొమ్మని పైలట్లు అలిగి వెళ్ళిపోతుంటారు. పైలట్లు లేకుండా ఎన్నో రాష్ట్రాల్లో విమానాలను నడిపిన అనుభవం కాంగ్రెస్ ది. అలిగిన పైలట్లకు వాట్సాప్లో ఊస్టింగ్ ఆర్డర్లు పంపి- ఆటో పైలట్ మోడ్లో విమానాలను నడుపుతున్న ధైర్యం కాంగ్రెస్ ది. ఆ విమానాలు ఎక్కడ ల్యాండ్ అవుతాయో? ఎలా ల్యాండ్ అవుతాయో? ఎవరికీ అంతుపట్టదు. అందులో ప్యాసింజర్ల మీద కాంగ్రస్ కు కోపంకానీ, ద్వేషం కానీ ఉండవు. అలాగని అనురాగమూ ఉండదు.

కాంగ్రెస్ కు అన్నీ తెలుసు. అన్ని విద్యలూ వచ్చు. కానీ అధికారంలో ఉంటేనే దాని విద్యలు పనిచేస్తాయని పురుడు పోసినప్పుడు హ్యూమ్ పెట్టిన వరం లాంటి శాపం. శాపం లాంటి వరం. కాంగ్రెస్ పార్టీ లీడర్లు అత్యంత సంపన్నులై ఉంటారు. పార్టీ మాత్రం కటిక దరిద్రం అనుభవిస్తూ ఉంటుంది.

Rajasthan Congress

రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ ది దేశ దృక్పథం. దేశం విషయంలో కాంగ్రెస్ ది అంతర్జాతీయ దృక్పథం. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష దృక్పథం. దాంతో ఏ స్థాయిలోను పునాదితో సంబంధం లేకుండా నేల విడిచి సాము చేయడం కాంగ్రెస్ స్వభావం.

సకల రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ మాతృక. ఎదిగే తన పిల్లల పార్టీలు చూసి కాంగ్రెస్ అసూయ పడ్డం తప్ప ఏమీ చేయలేదు. కీలకమయిన విశ్వాస పరీక్షలు, బల నిరూపణలు, రిసార్టు రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ ఒంటికి బొత్తిగా పడ్డం లేదు. రిసార్టుల బిల్లులు కూడా కట్టలేని పేదరికంలో కాంగ్రెస్ బలం నిరూపణ కాకముందే విరూపం కావడం సహజం.
ఎన్నో ఆటుపోట్లను చుసిన కాంగ్రెస్ కు ఒక పైలట్ పొతే వందల పైలట్లు దొరుకుతారు. ఈ రోజుల్లో పైలట్ ట్రయినింగ్ పూర్తీ చేసినవారే విమానం నడపాల్సిన అవసరం లేదు. యూ ట్యూబులో చూసి ఎవరయినా నడపవచ్చు. కొంచెం అవగాహన ఉంటే యూ ట్యూబులో చూడకుండా కూడా విమానం నడపవచ్చు.

కాంగ్రెస్ కు “పెద్దాపరేషన్” చేయాలని సీనియర్ నేతలు సూచిస్తూ ఉంటారు. ఈలోపు వారికి జరగాల్సిన చిన్న పెద్ద ఆపరేషన్లతో పార్టీ పెద్దాపరేషన్ సంగతే మరచిపోతుంటారు.

పాతికేళ్ల కిందటివరకు పెద్దాపరేషన్, పెద్దాసుపత్రి మాటలు వాడుకలో ఉండేవి. పెద్దాసుపత్రికి వెళ్లారంటే పెద్ద రోగమేదో వచ్చినట్లు. సహజంగా పెద్దాసుపత్రిలో జరిగేది పెద్దాపరేషనే అవుతుంది. పెద్ద అచ్చ తెలుగు మాట. ఆపరేషన్ ఇంగ్లీషు. రెండు వేరు వేరు భాషల మాటలయినా హాయిగా సువర్ణ దీర్ఘ సంధి కుదిరింది. ఆసుపత్రి ఐ సి యూ ల్లో ఏ భాష వ్యాకరణమయినా ప్రాణవాయువు గొట్టాలు ఎక్కించుకుని నోరు మూసుకుని పడుకోవాలే కానీ- మాట్లాడకూడదు.

రోగం, రోగలక్షణాలు, రోగ నిర్ధారణకు పరీక్ష, రోగం నయం కావడానికి వైద్యం- వేరు వేరు అంశాలు. రోగం రాకుండా జాగ్రత్తపడడం సర్వోత్తమం. జబ్బు చేయకుండా జాగ్రత్తపడడం కాంగ్రెస్ కు చేత కాదు. రోగ లక్షణాలు కనిపించినా కాంగ్రెస్ వైద్యుడిని సంప్రదించదు. రోగ పరీక్షలకు వెళ్ళదు. వెళ్లినా రోగాన్ని అంగీకరించదు. అంగీకరించినా మందులు వాడదు. వాడినా మందులు పనిచేయవు అనే నైరాశ్యం, నిస్పృహలు అణువణువునా ఉంటాయి కాబట్టి- పొరపాటున మందులు వాడినా అవి నిజంగానే పని చేయవు. కాంగ్రెస్ కు పెద్దాపరేషన్ చేయగలిగే పెద్దాసుపత్రి ఎక్కడుందో? ఉంటే ఆ పెద్దాపరేషన్ చేయగలిగే పెద్ద డాక్టర్ ఎవరో? కూడా సీనియర్లకు అంతు పట్టడం లేదు.

దశాబ్దాల పాటు కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ఎముకలు కొరికే ఢిల్లీ చలిలో ఎ ఐ సి సి ఆఫీస్ లో వచ్చినవారికి ఒక కప్పు వేడి చాయ్ ఇచ్చేందుకు కూడా దాని దగ్గర డబ్బులుండవు.

ఆసేతు హిమాచలం రాష్ట్రాల్లో కాంగ్రెస్ తనతో తానే విభేదిస్తూ, తనతో తానే గొడవ పడుతూ, తన తల తనే గోడకేసి కొట్టుకుంటూ బిజీగా ఉంటుంది.

A large formal meeting is called Congress- అన్నది నిఘంటువు అర్థం. ఆ కోణంలో ప్రస్తుత కాంగ్రెస్ ది సార్థక నామధేయమే. అది ఎంత లార్జో దానికే తెలియదు. అధికారంలో ఉంటే అది అధికార కాంగ్రెస్. అధికారంలో లేకుంటే అది అనధికార కాంగ్రెస్. అధికారంలో ఉన్నా- లేకున్నా అది ధిక్కార కాంగ్రెస్. ఇంతకంటే ఇంకా కాంగ్రెస్ స్వరూప, స్వభావ, గుణ గణాల మీద లోతుగా వివరాలు తెలుసుకోదలిచినవారు పంజాబ్ కు వెళ్లి సిద్ధూను సంప్రదించగలరు. రాజస్థాన్ కు వెళ్లి పైలట్ తో మాట్లాడగలరు. అదీ కుదరకపోతే మీకు దగ్గర్లోని ఏదయినా పి సి సి లేదా డి సి సి ఆఫీసుకు వెళ్లగలరు.

(ఇక్కడిదాకా ఉన్న భాగం పంజాబ్ ఎన్నికల వేళ పి సి సి అధ్యక్షుడికి- కాంగ్రెస్ ముఖమంత్రికి గొడవలు జరుగుతున్న వేళ idhatri.com ప్రచురించిన వ్యాసం)

ఇప్పుడు ప్రస్తుతంలోకి వద్దాం. కాంగ్రెస్ కు గాంధీల కుటుంబం బయటి వ్యక్తి అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పాలన ముద్రను చెరిపేసుకోవడం, రాహుల్ పూర్తి స్థాయి పాద యాత్ర మీద దృష్టిని కేంద్రీకరించడం ఇందులో ప్రధాన ఉద్దేశం.

గాంధీ కుటుంబమే కాంగ్రెస్ బలం. అదే బలహీనత కూడా. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను ఏ ఐ సి సి అధ్యక్షుడిని చేయాలని సోనియా, రాహుల్ , ప్రియాంక ప్రయత్నిస్తున్నారు. ఆయనేమో అంత సుముఖంగా ఉన్నట్లు లేరు. మరీ ప్రాధేయపడితే కాదనకపోవచ్చు.

బయటి వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచన వచ్చినందుకు సోనియా, రాహుల్, ప్రియంకలను అభినందించాలి. అశోక్ గెహ్లాట్ పూర్వాశ్రమంలో మెజీషియన్.

మామూలు రాజకీయ విద్యలు ఇప్పుడు కాంగ్రెస్ ను గట్టెక్కించలేవు. ఇంద్రజాల, మహేంద్రజాల, గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమార విద్యలే కావాలి. ఆ కోణంలో అశోకుడు ఏ విద్యలు ప్రదర్శించి…కాంగ్రెస్ శోకాన్ని పోగొడతారో వేచి చూడాలి.

(ఇక్కడిదాకా ఉన్న భాగం అశోక్ గెహ్లాట్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అనుకున్నప్పుడు idhatri.com రాసినది)

రాజస్థాన్ లో కాంగ్రెస్ అధిష్ఠానం సొంత ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోగలుగుతుందా?
సొంత పార్టీ ఎమ్మెల్యేలే బెత్తం పట్టుకుని కాంగ్రెస్ అధిష్ఠానం వీపు వాయగొడుతున్నారా?
అన్నది కనుక్కోవడానికి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం ఉండాల్సిన పనిలేదు. పాలు తాగే పసిపిల్లలకు కూడా తెలుసు. ఒక్క కాంగ్రెస్ అధిష్ఠానానికే తెలియదు. తెలిసేలోపు షరా మామూలుగా మరో రాష్ట్రంలో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా మట్టికొట్టుకుపోయి ఉంటుంది.

ఇప్పుడిక ఏమీ రాయాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పెద్దలు తీరిగ్గా ఇళ్లల్లో కూర్చుని రాసుకోవాల్సింది జుట్టుకు రంగు మాత్రమే!

కుక్క తోకను ఆడిస్తే స్వభావం. సహజం.
తోకే కుక్కను ఆడిస్తే వికారం. అసహజం. చూడలేము.

ఇలాంటి శునకోపమానంతో ముగించినందుకు విశ్వాసానికి మారుపేరైన కుక్కలు నన్ను మన్నిస్తాయని భావిస్తూ…

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

సామాన్యుడి గోచీ విలువెంత?

Also Read :

‘శీల పరీక్ష ‘లో పాసైన ఆప్…. ఎమ్మెల్యేలు ఇక సచ్ఛీలురేనా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్