విభజన జరిగినా రెండు తెలుగు రాష్ట్రాలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే సమన్యాయం చేయాలని నాడు డిమాండ్ చేశామని, రెండు కళ్ళ సిద్దాంతంతో ముందుకెళ్లామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అంబానీ సోదరులు విడిపోతే ఒకరు ప్రపంచంలోనే పదిమంది ధనవంతుల్లో ఉంటే, మరొకరు మొత్తం పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అలాగే ఇప్పుడు తెలుగు రాష్టాలు ఇలా ఉన్నాయంటూ పరోక్షంగా ప్రస్తావించారు. ఎంతో దూరదృష్టితో నాడు హైదరాబాద్ అభివృద్ధికి తాను శ్రీకారం చుట్టానని, ఆ తరువాత వచ్చిన డా. వైఎస్సార్ కూడా ఆ పనులు కొనసాగించారని, విభజన తరువాత కెసిఆర్ ప్రభుత్వం కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తోందని బాబు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు జాతి సంక్షేమం కోసం పనిచేయడమే తమ ధ్యేయమని బాబు పేర్కొన్నారు. హైదరాబాద్ నాపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. పార్టీ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు.

తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశ వ్యాప్తంగా.. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని, మొత్తం వంద చోట్ల సభలు నిర్వహిస్తామని, తొలి సభ ఇక్కడ చేస్తున్నామని, చివరి సభ మహానాడు సందర్భంగా రాజమండ్రిలో చేస్తామని వెల్లడించారు.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన గౌరవార్ధం వంద రూపాయల నాణేన్ని అయన ఫొటోతో తయారు చేయడం సంతోషంగా ఉందని, దీనికి గాను కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలో చేపట్టిన ఆర్ధిక సంస్కరణల వల్లే నేడు ప్రపంచంలో మనం ఓ బలమైన దేశంగా ఉన్నామని చెబుతూ నాడు ఆర్ధిక సంస్కరణలు అమలు చేసిన మాజీ ప్రధాని పివి నరసింహా రావు కు కూడా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

ఏడేళ్ళ క్రితం ఇదే రోజున, పార్టీ ఆవిర్భావం రోజున పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించామని.. దానివల్లే కృష్ణా డెల్టా తో పాటు రాయలసీమ కు కూడా సాగు నీరు అందుతోందని వివరించారు. కృష్ణా, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోగలిగితే రెండు రాష్ట్రాలూ సస్యశ్యామలంగా ఉంటాయన్నారు.

విభజన కంటే ఎక్కువ నష్టం వైఎస్ జగన్ తోనే జరిగిందని, రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి రాష్ట్ర పునర్నిర్మాణానికి నడుం బిగిస్తామని బాబు ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో పూర్వ వైభవం తీసుకు రావాలని… అదే విషంగా తెలంగాణలో పార్టీని మళ్ళీ దశల వారీగా పటిష్టం చేస్తామని వెల్లడించారు. సంక్షేమం కొనసాగిస్తూనే, అభివృద్ధి చేసి సంపద సృష్టించి … దాన్ని మళ్ళీ ప్రజలకే ఖర్చు చేస్తామన్నారు. చరిత్ర ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని, దీనిలో ఎలాంటి సందేహం అవసరం లేదని చంద్రబాబు విశ్వాసం వెలిబుచ్చారు.

త్రిసూత్ర విధానంతో ముందుకు వెళ్లాలని బాబు పార్టీ శ్రేణులకు సూచించారు. మొదటిది…. 2047 నాటికి దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలోనే ఉంటుందని, దానిలో తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలని

రెండవది… ఆర్ధిక అసమానతలు తొలగి పోవాలని, అభివృద్ధి ఫలాలు పేదవారికి చేరి వారు కూడా ఆర్ధికంగా ఎదగాలని, ఆర్ధికంగా బలంగా ఉన్నవారు పేదలను దత్తత తీసుకోవాలని…

మూడోది… అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకూ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని.. దీనికోసం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని బాబు పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *