ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుమారు 13 లక్షల మంది భారత విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఉన్నత విద్యాబ్యాసం కోసం గమ్యస్థానంగా అమెరికా అగ్ర స్థానంలో ఉంది. మొత్తం విద్యార్థుల్లో 69 శాతం ఈ దేశంలోనే చదవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు తమ దేశంలో కల్పిస్తున్న సౌకర్యాలను అమెరికా పబ్లిక్ డిప్లొమసీ శాఖ మంత్రి సలహాదారు గ్లోరియా బెర్బెనా ఒక ఆంగ్ల మీడియాకు వివరాలు వెల్లడించారు. అమెరికా వచ్చే భారత విద్యార్థుల సంఖ్య ఏడాదిలోనే 30 శాతం పెరిగినట్టు ఆమె చెప్పారు.
గత ఏడాది తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతే నెంబర్ వన్ అని వెల్లడించారు. అమెరికా రావాలనుకునే విద్యార్థులు కొంతమంది బ్రోకర్లు, కన్సల్టెన్సీల చేతిలో మోసపోకుండా నేరుగా తామే విద్యార్థులతో సంబంధాలు పెట్టుకునేందుకు ఎడ్యుకేషన్ ఫెయిర్‌లను నిర్వహిస్తున్నామని చెప్పారు.
అందులో భాగంగా 125 అమెరికా యూనివర్సిటీల ఆధ్వర్యంలో ఈ ఆదివారం ఢిల్లీలో ఒక ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ కోర్సులు, దరఖాస్తు విధానం, వీసా నిబంధనలు, ఖర్చెంత, ప్రవేశార్హత వివరాలన్నీ పొందవచ్చు.
యూకే యూనివర్సిటీలకు దరఖాస్తు చేసే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. వలస విధాన ఆంక్షలు, వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, జాత్యాహంకారం కారణాలతో ఆ దేశం వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని తాజా గణాంకాలలో తేలింది.
గత ఏడాది నుంచి ఈ ఏడాది జూన్ వరకు యూకేకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 23 శాతం తగ్గింది. గ్రాడ్యుయేషన్ తర్వాత రెండేండ్లు ఉండేందుకు అనుమతించే గ్రాడ్యుయేట్ రూట్ వీసా ఇస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తగ్గడం గమనార్హం.
స్టూడెంట్ వీసా ఉన్నవారు తమతో పాటు తమపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులను బ్రిటన్‌కు తెచ్చుకునేందుకు గతంలో అనుమతి ఉండేది. దానిపై ఆంక్షలు విధిస్తూ తెచ్చిన కొత్త నిబంధనలు తగ్గుదలకు ప్రధాన కారణం. 2019-2023లో యూకేకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో ఎక్కువగా భారతీయులు, నైజీరియన్లు ఉండేవారు. తాజా గణాంకాలు చూస్తే వరుసగా వీరిలో 23 శాతం, 46 శాతం తగ్గుదల నమోదైంది. అయితే ఇప్పటికీ యుకె వీసాలు పొందుతున్న విదేశీయులలో భారతీయులదే అగ్రస్థానం.
మరోవైపు ఆసియా దేశాల పౌరులపై ఆంక్షలు విధించేందుకు బ్రెజిల్ సిద్దమైంది. అమెరికా, కెనడాలకు వలస వెళ్లేందుకు తమ దేశాన్ని లాంచింగ్ పాయింట్‌గా వాడుకోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రెజిల్ ప్రకటించింది.
విమానాశ్రయంలో ఆశ్రయం కోసం 70 శాతానికి పైగా భారత్, నేపాల్, వియత్నాం జాతీయుల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని తెలిపింది. ఈ నెల 26 నుంచి ఆసియా దేశాల నుంచి వచ్చేవారు బ్రెజిల్‌లో వలసదారులుగా ఉండాలంటే వీసా ఉండాలి. ఇప్పటికే వీసా మినహాయింపు పొందిన ఆసియన్లకు ఈ నిబంధన వర్తించదు.
-దేశవేని భాస్కర్