Saturday, January 18, 2025
HomeTrending Newsఅసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా కెసిఆర్

అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా కెసిఆర్

ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా శాసనసభకు హాజరయ్యారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వటమే గొప్ప అన్నట్టుగా మీడియా ఫోకస్ కనిపించింది. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన హాజరవుతారా? లేదా? అనే టెన్షన్ నెలకొనగా.. ఉహాగానాలకు తెరదించుతూ కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు.

2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజు కేసీఆర్ కాలు జారి కిందపడ్డారు. ఆసుపత్రిలో చేరటంతో సమావేశాలకు హాజరు కాలేదు. ఆపరేషన్ తర్వాత రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించటంతో… ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఆ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు.

కెసిఆర్ గైర్హాజరుపై అనేకమైన పుకార్లు షికారు చేశాయి. రెండుసార్లు సమావేశాలకు ఎగ్గొట్టినా మూడోసారి బడ్జెట్ సెషన్స్ కు హాజరయ్యారు.  కెసిఆర్ హాజరుపై నాలుగైదు రోజులుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ సభకు హాజరు కావాలని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సిఎంకు బదులిచ్చిన కేటీఆర్.. కేసీఆర్ రావాల్సిన పని లేదని మీకు సమాధానం చెప్పడానికి మేం చాలన్నారు. దీంతో కేసీఆర్ ఈసారి కూడా సమావేశాలకు దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు భావించాయి. అనూహ్యంగా ఆయన నేడు(గురువారం) సభకు హాజరయ్యారు.

బడ్జెట్ అంశాలపై చర్చ కన్నా కెసిఆర్ అసెంబ్లీకి రావటం ముఖ్యమైన అంశంగా సంతరించుకుంది. శాసనసభ ప్రాంగణంలో కెసిఆర్ రాకను ఆసక్తిగా గమనించారు. కెసిఆర్ మీడియా పాయింట్ వద్దకు రాగానే అన్ని చానెళ్ళలో ఈ వార్తకే ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత‌ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. బ‌డ్జెట్‌ను చూస్తుంటే ఇది రైతు శ‌త్రువు ప్ర‌భుత్వం అని తేలిపోయింద‌న్నారు. అన్ని వ‌ర్గాల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెన్నుపోటు పొడిచింద‌ని మండిపడ్డారు.

ఎవరెన్ని రకాలుగా వ్యాఖ్యానాలు చేసినా కెసిఆర్ వ్యవహార శైలి విభిన్నమే. చాలా రోజుల తర్వాత శాసనసభ ప్రాంగణంలో గులాబీ ఎమ్మెల్యేల్లో జోష్ కనిపించింది. అధినేత రాగానే అసెంబ్లీ కార్యదర్శితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అధికార పక్షం వివిధ అంశాలపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు…కేటిఆర్, హరీష్ రావులు తిప్పికొడుతున్నా ప్రజల్లోకి వెళ్ళటం లేదు.

కెసిఆర్ తనదైన శైలిలో అధికార పక్షం విమర్శలను నిలువరించగలరని పార్టీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఇక రాబోయే అసెంబ్లీ సమావేశాలు మహా రంజుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్