Sunday, November 24, 2024
HomeTrending NewsBRS : మహారాష్ట్ర ప్రతి గ్రామంలో గులాబీ కమిటీలు

BRS : మహారాష్ట్ర ప్రతి గ్రామంలో గులాబీ కమిటీలు

జలదృశ్యం నుంచి జనప్రభంజనం దాకా ఇది గులాబీ జైత్రయాత్ర. 14 ఏండ్లు పోరాడి స్వరాష్ట్రం సాధించిన పార్టీ.. కేసీఆర్‌ నాయకత్వ అసమాన వ్యూహచతురత, పార్టీ సైద్ధాంతిక భావజాల పునాది బీఆర్‌ఎస్‌ను అజేయశక్తిగా నిలిపింది. తెలంగాణ మాడల్‌ను చర్చకు పెట్టి దేశ పరివర్తన బాధ్యతను భుజానికెత్తుకున్నది భారత రాష్ట్ర సమితి. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ తమ వైఫల్యాలను దేశంపై మోపుతున్న తరుణంలో.. దగా పడిన జనం తరఫున బీఆర్‌ఎస్‌ కొత్త యుద్ధానికి సిద్ధమైంది. మతాలుగా విడిపోయిన మనుషులను ఏకం చేయడంలో నిమగ్నమైంది.

‘రైతులు ఐక్యంగా నిలబడి పోరాడాలి. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయి. రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు. దానిని ఈసారి బీఆర్‌ఎస్‌ డబ్బాలో వేయండి. ప్రధాని కాన్నుంచి అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు. బీఆర్‌ఎస్‌ భారత పరివర్తన మిషన్‌గా పనిచేస్తుంది. ప్రతి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలుంటారు. ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తాం. 12 లక్షల మందితో భారీ ర్యాలీ తీస్తాం. జడ్పీ ఎన్నికలతో మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం మొదలవుతుంది’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వారిని ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే..

దేశం మారాలా వద్దా?
నీటి గణాంకాలు నేను చెప్పేవి కావు. సీడబ్ల్యూసీ చెప్పినవే. దేశంలో ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వవచ్చు. గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలుకాలో మన కండ్లముందుగా అతిపెద్ద గోదావరి నది సముద్రంలోకి వెళ్తుంది. మన నాయకులు, ప్రధానమంత్రి చూస్తూ కూర్చుకుంటారు. 75 ఏండ్ల నుంచి ఇదే మజాక్‌ చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగాలా? నీళ్లు మన పొలాలకు రావాలా? తాగునీరు రావాలా? వద్దా? ఇదే నా ప్రశ్న. ఈ నాటకాలను బంద్‌ చేసేందుకే బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. అతి తక్కువ సమయంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడం, రైతులకు అండగా నిలవడమే బీఆర్‌ఎస్‌ లక్ష్యం. తెలంగాణలో మిషన్‌ భగీరథ పేరుతో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం. అమెరికాలో కూడా ఇలా లేదు. మాడ్రన్‌ టెక్నాలజీతో ఇస్తున్నాం. హైదరాబాద్‌లోని ధనవంతులు నివాసముండే జూబ్లీహిల్స్‌లో ఏ నీరు అందిస్తున్నామో.. ఆదిలాబాద్‌ జిల్లాలోని గోండులకు కూడా అవే శుద్ధమైన తాగునీళ్లను ఇస్తున్నాం. మహారాష్ట్రలో ఏమైంది? ఎన్నో నదుల జన్మస్థానం. వెన్‌గంగా, వార్ధ, గోదావరి, మూల, ప్రవర, కృష్ణ, పంచగంగా, మంజీరా, భీమా.. చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉన్నది. మరెందుకు నీళ్ల కోసం ప్రజలు తండ్లాడుతున్నారు? ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి నల్లానీరు ఇస్తున్నారు. అకోలాలో కూడా ఇవే కష్టాలు. అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఎందుకు?

రైతు ప్రభుత్వమంటే తెలంగాణ
ఎనిమిది తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ పరిస్థితి కూడా ఇదే. తాగునీళ్లు లేవు. అర్ధరాత్రి కరెంటు ఇస్తారు. పాములు, కీటకాలు కరిచి, విద్యుత్తు షాక్‌లకు గురై ఎం తో మంది మృత్యువాత పడ్డారు. చేనేత కార్మికులు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేవుడి దయ వల్ల తెలంగాణ కోసం పోరాడాం. సాధించుకున్నాం. ఆ తర్వాత అవన్నీ మారిపోయాయి. ఆత్మహత్యలు ఆగిపోయాయి. ఎంతో ప్రగతి సా ధించాం. పంటల సాగు పెట్టుబడి కోసం రైతులకు ఎకరాకు రూ.10 వేల సా యం అందిస్తున్నాం. అందులో ఎలాంటి బేధా లు లేవు. చిన్న సన్నకారు రైతులకు రాష్ట్రం లో 5 ఎకరాలకు ఒక క్లస్టర్‌ చొప్పున మొత్తం 2,601 వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేశాం. ఒక్కో క్లస్టర్‌కు ఒక వ్యవసాయాధికారిని నియమించాం. ఆ క్లస్టర్‌లోని రైతుల వివరాలు, ఆధార్‌, ఫోన్‌ అ న్ని వివరాలు ఉంటాయి. రైతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. రూ.5 లక్షల భీమా కల్పిం చాం. ఆ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుం ది. రైతులు ఏ కారణంతో చనిపోయినా 8 రోజుల్లోనే చెక్కు అందిస్తున్నాం.

ఇప్పటికే లక్ష మందికి అందించాం. ఎకరా, అరెఎకరా ఉన్న రైతులకు కూడా ఇస్తున్నాం. ఇదే తరహాలో దేశంలోని రైతులకు అం దించాలి. తెలంగాణలో రైతుల పంట మొ త్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. ఇప్పుడు కూడా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. 7100కుపైగా కొనుగోలు సెంటర్లను ప్రారంభించాం. ఐదు రోజుల్లోనే కొనుగోలు డబ్బులను కూడా బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాం. పెట్టుబడి కోసం రైతులు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. దరఖాస్తులు పెట్టుకోవాల్సింది లేదు. దళారులు లేరు. హైదరాబాద్‌లో వేస్తే నేరుగా రైతుల ఖాతాల్లోకే వెళ్తాయి. ఇదీ రైతుల ప్రభుత్వమంటే. మాటలు చెప్పడం కాదు. రైతులు ఇక్కడ ఇంట్లో నుంచే పథకాలను పొందుతున్నారు. ఇక భూమి రికార్డు వ్యవస్థ ఎలా ఉందో తెలుసు. మహారాష్ట్రలో నా మిత్రులు చెప్తున్నారు… రెవెన్యూ అధికారులను బ్రహ్మదేవుడంటారట. ఎందుకంటే ఎవరి భూమి ఎవరి పేరున రాస్తారో తెలియదు. తెలంగాణలో అలాంటి రెవెన్యూ వ్యవస్థ లేదు. ఇక్కడ 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. తరువాత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. సమయం రాగానే వెళ్లాలి. పని పూర్తి చేసుకుని 15 నిమిషాల్లో వెళ్లాలి. ఆ వెంటనే పాస్‌ బుక్‌ కూడా ఇంటికే వస్తుంది.

షాక్‌ ట్రీట్‌మెంట్‌తోనే ఫలితం
మహారాష్ట్రలో ఇప్పుడు అసెంబ్లీ నడుస్తున్నది కదా.. అక్కడ ఇప్పుడే పూర్తిగా తెలంగాణ మాడల్‌ను అమలు చేస్తామని ప్రకటించండి. చట్టం చేయండి.. మేం మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్తాం. తెలంగాణలో ఈ పథకాలన్నీ అమలవుతున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు కావు? ఎప్పటివరకు అవి అమలు కావో.. అప్పటివరకు మహారాష్ట్రకు వస్తూనే ఉంటాం. ఒక్కసారి కేసీఆర్‌ నాందేడ్‌ వస్తేనే రైతులకు రూ.6 వేలు వచ్చాయి. రైతులు పట్టణాల్లో ఉండరు. గ్రామాల్లోనే ఉంటారు. రాబోయే జడ్పీ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేయాలి. ఇది రైతుల చేతుల్లోనే ఉన్నది. రాజ్యాంగం ఆ అధికారమిచ్చింది. ఓటు అనే ఆయుధం ఇచ్చింది. నా మాట విని మొదటిసారి మహారాష్ట్రలోని అన్ని జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగిరేయండి.. అప్పుడు ప్రధాని, ముఖ్యమంత్రి అందరూ దిగి వస్తారు. మేము కూడా ఇస్తామంటారు. షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వకపోతే మనం ఏం సాధించలేం. జిల్లా పరిషత్‌లో అలా ఒక్కసారి చేయండి మీకే తెలుస్తుంది.

12 లక్షల మందితో కిసాన్‌ ర్యాలీ
కార్మికులు, కూలీల మాదిరిగానే రైతులు కూడా ఐక్యంగా నిలబడి గెలవాలి. ప్రతి ఒక్కరూ ఒక్కో కేసీఆర్‌ కావాలి. రైతు ఆత్మహత్యలు లేని మహారాష్ట్రగా తీర్చిదిద్దుకుం దాం. పరివర్తన లేనిదే భారత్‌ అభివృద్ధి చెందదు. ఏండ్లుగా చూస్తునే ఉన్నాం. భారత్‌ పరివర్తన చెందడం చాలా అవసరం. బీఆర్‌ఎస్‌ భారత్‌ పరివర్తన్‌ మిషన్‌గా పనిచేస్తుం ది. దేశంలో మార్పు వచ్చేవరకూ ఈ పోరాటం ఆగదు. నాసిక్‌ నుంచి ముంబై వరకు ర్యాలీ తీయడం వల్ల రైతులకు ఏం ఒరిగింది? ఎంతో మంది రైతులు రక్తం కార్చారు.. ప్రాణాలను వదిలారు. కానీ ఎవరూ చావాల్సిన పనిలేదు. వేరే ఏదీ చేయాల్సిన పని లేదు. ఓట్లను బీఆర్‌ఎస్‌ డబ్బాలో వేయండి చాలు. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఇక్కడ విన్న విషయాలను గ్రామాల్లోకి వెళ్లి చర్చ పెట్టండి. నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. మహారాష్ట్రలోని ప్రతి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలుంటారు. అన్ని కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తాం. జడ్పీ ఎన్నికలతో బీఆర్‌ఎస్‌ రంగంలోకి దూకుతున్నది. ప్రతి గడపనూ తట్టండి. ప్రతి మనిషినీ పలకరించండి. మే 7 నుంచి జూన్‌ 7 వరకు మహారాష్ట్రలో ప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్‌ కమిటీ వేస్తాం. 10 నుంచి 12 లక్షల మందితో మహారాష్ట్రలో భారీ కిసాన్‌ ర్యాలీ నిర్వహిస్తాం. బీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగుతుంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్