Tuesday, January 21, 2025
HomeTrending Newsదిద్దుబాటు దిశగా బీఆర్ఎస్

దిద్దుబాటు దిశగా బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికలు సంకటంగా మారాయి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి, పురపాలక సంఘాల్లో వరుసగా అవిశ్వాస తీర్మానాలు కలవరపెడుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే పార్టీ శ్రేణులను కాపాడుకోవటం కష్టతరం అవుతుంది. పార్టీకి పూర్వవైభవం, కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు పార్టీ నాయకత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. లోక్ సభ ఎన్నికల్లో గెలుపునకు అవకాశం లేని అభ్యర్థులను మార్చటం…కొత్త వారిని ఎంపిక చేసే పనికి సిద్దమయింది.

ఎన్నికల్లో ఓటమిని ఉహించని గులాబీ నాయకత్వం…పరాజయానికి కారణాలను నేతలు వివరిస్తుంటే నిర్ఘాంతపోతోంది. లోక్ సభ నియోజకవర్గాల వారిగా జరుగుతున్న సమీక్షల్లో నాయకత్వం లోపాలను నిర్మొహమాటంగా ఎత్తిచుపుతున్నారు. అగ్ర నాయకత్వం శ్రేణులకు అందుబాటులో లేకపోవటం వల్లే ఓటమి అంచుకు చేరుకున్నామని తెగేసి చెపుతున్నారు.

నిజాం పాలనలో జమిందార్లకు అప్పచెప్పినట్టు నియోజకవర్గాలను ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టారని…70 శాతం మంది ఎమ్మెల్యేలపైన భుకబ్జాల ఆరోపణలను నేతలు ఏకరువు పెట్టారు. కొన్ని చోట్ల గెలిచేందుకు అవకాశం ఉన్నా ఎమ్మెల్యేల తీరుతో కార్యకర్తలు నిర్లిప్తంగా వ్యవహరించినట్టు అధిష్టానం దృష్టికి వచ్చింది.

దీనంతటికి నాయకత్వమే బాధ్యత వహిస్తుందన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. శ్రేణుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని చల్లార్చకపోతే పార్టీ భవిష్యత్తు తిరోగమనంలో పడుతుందని సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. వీటన్నింటికి పరిష్కారం చూపేలా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అగ్రనేతలు, ప్రజాభిమానం కలిగిన నేతలు పోటీ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

మెదక్ నుంచి కెసిఆర్, కరీంనగర్ లేదా మల్కాజ్ గిరి నుంచి కేటిఆర్, జహిరాబాద్ నుంచి హరీష్ రావు, నాగర్ కర్నూల్ నుంచి గోరేటి వెంకన్న, ఆదిలాబాద్ నుంచి కొమురం భీమ్ కుటుంబ సభ్యులను తీసుకురావాలని యోచిస్తున్నారు. ఖమ్మం నామ నాగేశ్వర్ రావు, చేవెళ్ళ -రంజిత్ రెడ్డి, మహబూబాబాద్ కు సత్యవతి రాథోడ్ పేరు పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ లేదా కరీంనగర్ నుంచి పోటీ చేయించేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్తతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిసింది.

అగ్రనేతలు అందరు గెలిచి ఢిల్లీ వెళ్ళిపోతే అసెంబ్లీలో పార్టీ నాయకుడిగా కడియం శ్రీహరికి బాధ్యతలు అప్పగించాలని, కడియంకు తోడు జగదీష్ రెడ్డి ఉంటారని విశ్లేషణ జరుగుతోంది. జగదీష్ రెడ్డికి ఇవ్వాలని చర్చ జరిగినా మిన్నకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోదరులు- జగదీష్ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది. జగదీష్ రెడ్డి ఆవేశానికి లోనవుతారని, కడియం అయితే హుందాగా వ్యవహరిస్తారనే అభిప్రాయం వ్యక్తం అయింది.

కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎంపి సీట్లు తక్కువగా వస్తే పూచిక పుల్ల మాదిరిగా చూస్తారని..దీంతో పార్టీ మనుగడ ప్రమాదంలో పడుతుందనే ఆందోళన పట్టుకుంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే మెజారిటీ అభ్యర్థులపై సంక్రాంతి తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాలకు ఎంపిక కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్