రాబోయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఒంటరిగానే పోటి చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మరోసారి ప్రకటించింది. ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ తో కలిసి పోటి చేస్తున్నామని, యుపి, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటుతామని బిఎస్పి ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్ర చెప్పారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి సొంతంగా బిఎస్పి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని లక్నోలో వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ.ఐ.ఎం.ఐ.ఎం.( అల్ ఇండియా మజ్లీస్ ఎ ఎత్తేహదుల్ ముస్లిమీన్ ) తో కలిసి బరిలోకి దిగుతుందనే వార్తల్లో నిజం లేదని బిఎస్పి అధినేత్రి మాయావతి తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ఎం.ఐ.ఎం తో పొత్తు వార్తల్ని మరోసారి తోసిపుచ్చారు. బిఎస్పి గెలుపు అవకాశాల్ని దెబ్బతీసి, ప్రజల్లో పలుచన చేసేందుకే ఇలాంటి తప్పుడు కథనాల్ని కొందరు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దళిత, బహుజనులు, మైనారిటీల మద్దతుతో బిఎస్పి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని మాయావతి ప్రకటించారు.