Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపాక్ ఆక్రమిత కాశ్మీర్ - చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ – చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్

వారం రోజులుగా భారత సరిహద్దు ప్రాంతం లడాఖ్ లో తిరుగుతుంటే విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చిన్నప్పుడు బళ్లో మ్యాప్ పాయింటింగ్ మొదలు పెట్టినప్పటినుండి మనం చూస్తున్న భారతదేశ పటం; గీస్తున్న దేశ పటం; మదిలో నాటుకుపోయిన దేశ పటం అందరికీ తెలిసిందే.

లేహ్ నుండి బయలుదేరి పాకిస్థాన్ సరిహద్దులో భారతదేశ చివరి గ్రామం థంగ్ ఒక చూడదగ్గ ప్రదేశంగా ఇక్కడికి వచ్చినవారందరూ పొలోమని వెళుతుంటే మేమూ వెళ్లాము. 1971లో మన భారత సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్థాన్ ను తరిమేసేదాకా ఈ గ్రామం మనదే అయినా మనది కాకుండా ఉండింది. అనంతరం భారత దేశానికి మళ్లీ దక్కిన గ్రామం అయి…ఒక చూడదగ్గ ఊరయ్యింది. ఈ ఊరి పక్కనే రెండు దేశాలను విభజిస్తున్న సరిహద్దు గోడ అదిగో అని స్థానికులు బైనాక్యులర్లలో చూపుతున్నారు.

(థంగ్ ఊరి సరిహద్దు గోడ పక్కన ఉన్నది పాక్ ఆక్రమిత కాశ్మీరే కానీ పాకిస్థాన్ కాదు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం రాజు భారత్ లో కలవకుండా మొండికేసినట్లు...అప్పటి కాశ్మీర్ సంస్థానాధీశుడు సింగ్ కపటనాటకం, పాక్ దుర్బుద్ధి వల్ల ఈ భూభాగం మనది కాకుండా పోయింది. అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కూడా ఏదో ఒకనాడు భారత్ లో అంతర్భాగం చేస్తాం అని దేశభక్త రాజకీయ పార్టీ ఎన్నికల రుతువుల్లో అంటూ ఉంటుంది. ఆ చర్చ ఇక్కడ అనవసరం)

మరో వైపు చైనా సరిహద్దు ప్యాంగ్యాంగ్ లేక్ అద్భుత ప్రదేశం. ఇక్కడే త్రీ ఇడియట్స్ చివరి సన్నివేశాలు తీశారు. ఇక్కడినుండి కూతవేటు దూరంలో చైనా సరిహద్దులో భారతీయ చివరి గ్రామం అని గైడ్లు చెబుతున్నారు. మరి కొద్దిదూరంలోనే గాల్వన్ లోయ ఉంటుంది. అక్కడే చైనా సైనికులకు ఎదురొడ్డి మన సైనిక వీరుడు సంతోష్ బాబు ప్రాణాలు కోల్పోయింది.

(గాల్వన్ లోయ దాటగానే వచ్చేది చైనా కానే కాదు. అక్సాయ్ చిన్. అక్షరాలా భారత భూభాగమే. మనుషులు నివసించడానికి వీలుకాని ఈ ప్రాంతంలోకి కొద్ది కొద్దిగా చైనా చొచ్చుకుని వస్తూ ఉంటుంది. ఇక్కడ సరిహద్దు గీతల మీద దశాబ్దాలుగా ఎడతెగని పంచాయతీ నడుస్తోంది. ఆ చర్చ ఇక్కడ అనవసరం).

ఇక్కడి మరో సరిహద్దు టిబెట్ తో భారత్ కు ఏ గొడవా లేదు.

లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో అటు పాకిస్థాన్, ఇటు చైనా సరిహద్దులో అడుగడుగునా ఉన్నది మన మిలటరీ స్థావరాలే. గడ్డకట్టే చలిలో బంకర్లలో, తాత్కాలిక గుడారాల్లో ఉంటూ నిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్న వారి ధైర్య సాహసాలు; మంచు తుఫాన్లు, ఇసుక తుఫాన్ల మధ్య దారులే లేని మంచు కొండల్లో హెలిక్యాప్టర్లలో దిగుతూ…ప్రకృతితో కూడా యుద్ధం చేస్తూ…సరిహద్దు శత్రువుల నుండి దేశాన్ని రక్షిస్తున్న సైనికుల మైనస్ నలభై డిగ్రీల చలివేళల్లో ఒక పగలు- ఒక రాత్రి దినచర్య ఎలా ఉంటుందో దేశాన్ని ప్రేమించేవారినందరూ తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. నిలువెల్లా కంపించిపోతాము. మనం అనుభవించే స్వేచ్ఛ; మన సరిహద్దు భద్రత ఎంత విలువైనదో అప్పుడు అర్థమవుతుంది.

“విద్వేషం పాలించే దేశం ఉంటుందా?
విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా?
ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా?
అడిగావా భూగోళమా?
నువ్వు చూసావా ఓ కాలమా?

రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా?
ఆయువు పోస్తుందా ఆయుధమేధైనా?
రాకాసుల మూకల్లె మార్చద పిడివాదం?
రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం?
సాధించేదేముంది ఈ వ్యర్ధ విరోధం?
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం
రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం
నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం

రా ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం
అందరికి సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం?
మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం
గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం?
ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం?
నీకు తెలియనిదా నేస్తమా
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం?
చెంత చేరననే పంతమా?
ఖండాలుగ విడదీసే జండాలన్ని
తలవంచే తలపే అవుదాం ఆ తలపే మన గెలుపని అందాం”

లడాఖ్ సరిహద్దుల్లో సైన్యాన్ని, అడుగడుగునా కంచెలను చూస్తుంటే నాకెందుకో సిరివెన్నెల కంచె సినిమాలో రాసిన ఈ పాట పదే పదే గుర్తుకొచ్చింది.

అన్నట్లు-
పాక్ ఆక్రమిత కాశ్మీర్, చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్ లేకుండా భారత దేశ పటం గీయడం శిక్షార్హమైన నేరం. ఆ భూభాగాలు లేకుండా దేశ పటాన్ని సగటు భారతీయుడు కలలో కూడా ఉహించలేడు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్