Sunday, February 23, 2025
HomeTrending Newsఅమరీందర్ సింగ్ కొత్త పార్టీ!

అమరీందర్ సింగ్ కొత్త పార్టీ!

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విషయాన్ని అయన సూత్రప్రాయంగా వెల్లడించారు. తనకు వేరే గత్యంతరం లేదని వ్యాఖ్యానించారు తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని, బిజేపిలో కూడా చేరబోనని అయన స్పష్టం చేశారు.  52 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ లో ఉన్నానని,  తన అభిప్రాయం ఏమిటో కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. పార్టీ పెద్దలు తన పట్ల అనుమానంతో, అపనమ్మకంతో వ్యవహరించారని, అవమానపరిచారని కెప్టెన్ ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్ లో కాంగ్రెసు బలహీన పడుతోందని, కాంగ్రెసు ను వీడుతున్నందున ఈ మాట చెప్పడంలేదని, వాస్తవాన్ని మాత్రమే చెబుతున్నానని, రాష్ట్రంలో ఆప్ కు ప్రజాదరణ పెరుగుతోందన్నమాట వాస్తవమని వెల్లడించారు.

సిధ్దు ఒంటెత్తు పోకడ మనిషి అని, ఒంటరి మనిషి. జట్టు నాయకుడు గా వ్యవహరించ లేరని మండిపడ్డారు. సిధ్దు సీరియస్ మనిషి కాదని, ఈ విషయాన్ని తానూ గతంలో పలుమార్లు మొత్తుకున్నా ఎవరూ వినలేదని వ్యాఖ్యానించారు. పిసిసి అధ్యక్షుడు గా ప్రతివారితోనూ సమన్వయంతో వ్యవహరించి, కలుపుకుని పోవాల్సి ఉంటుందని కానీ ఆ సత్తా ఆయనకు లేవని విమర్శించారు.  తాను మూడు సార్లు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నానని, పంజాబ్ కాంగ్రెస్ బాధ్యతలు నిర్వర్తించడం ఆషామాషీ కాదని అభిప్రాయపడ్డారు.

“సిధ్ధు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, అయన చిన్నపిల్లవాడి లాగా వ్యవహరిస్తారు, గత మే నెల, జూలై నెలల్లో పంజాబ్ లో రెండు సార్లు సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోతోంది. జూన్ లో పిసిసి అధ్యక్షుడు గా సిధ్దూ నియామకం అయ్యారు. జూలై నెలలో నిర్వహించిన సర్వే లో మరో 20 శాతం ప్రజాదరణను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది.  దాన్ని బట్టి, సిధ్దూ నియామకం పట్ల ప్రజలకు నమ్మకం లేదని సర్వేలో స్పష్టమైంది” అని అమరీందర్ పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ అధినేత పిల్లవాడిలాగా వ్యవహరించ కూడదని, డ్రామాలు చేయకూడదని, పెద్ద తరహాగా, సీరియస్ గా వ్యవహరించాలని అయన హితవు పలికారు. సీనియర్ల మాట కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వినడం లేదని దుయ్యబట్టారు.

“జి-23 గ్రూప్ మాట వినాలి, సీనియర్లు అనుభవంతో ఆలోచనలు చెప్తారు. వాటిని యువ నేతలు ఆచరించాలి. అమలు చేయాలి. అంతేగాని, సీనియర్లును పూర్తిగా పక్కకు పెట్టడం మంచిది కాదు. పార్టీ నాయకత్వం ఆలోచించాలి. ఇక వారి ఇష్టం” అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

“ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా ఉండబోతున్నాయి  “ఆప్”, అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలతో పాటు, కొత్త రాజకీయ శక్తి రాబోతుంది”  నా అనుభవంలో పంజాబ్ ప్రజలు ఎప్పుడూ ఒకే పక్షం వైపు ఓటేస్తారు, స్వార్థంతో నేనేమి ఆశించి చెప్పడం లేదు. వచ్చే ఏడాది నాకు 80 వ సంవత్సరం రాబోతుంది. నా రాష్ట్రం పంజాబ్ క్షేమంగా ఉండాలి. ప్రతిరోజూ పాకిస్థాన్ నుంచి  తీవ్రవాదులు పంజాబ్ గుండా దేశంలోకి చొరబడే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయి. 600 కిలోమీటర్ల మేరకు పాకిస్థాన్ తో పంజాబ్ సరిహద్దు ను పంచుకుంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు డ్రోన్ల ను కూడా ఉపయోగిస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం” అంటూ అమరీందర్ తన మనసులోని మాట బైట పెట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్