Car-Cleaning-Covering:
కారు కలవాడు కాదోయ్ గొప్పోడు..కారు రోజూ కడిగేవొడే అసలైన గొప్పోడు..
నీ ఒంటికే కాదోయ్.. నీ కారుకి స్నానం అవసరమే..
అసలు కారు కడగనోడికి కారు నడిపే హక్కు లేదు..
ఈ నీతి వాక్యాలు, ప్రవచనాలు, ఉపోద్ఘాతం ఎందుకంటే..
రోజూ నా కారు నన్ను తిట్టే తిట్లు విన్నాక ఈ కారు కహానీ రాయాలనిపించింది..
అప్పుడెప్పుడో జీవితంలో మొదటిసారి brezza కారు కొన్నా.. ఊరెళ్ళడానికి, పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి, షాపింగ్ కి ఇలా ఎక్కడికిపడితే అక్కడికి విచ్చలవిడిగా, ప్రపంచంలో ఇంకెవరికీ కారు లేనట్టు నాకొక్కడికే కారున్నట్టు ఫీలైపోయి చక్కగా తిరగేస్తున్నా నాలుగేళ్ల నుంచి.. ఏ రిపేర్ లేకుండా నన్ను నా ఫ్యామిలీని మోస్తోంది నా బ్రిజా..
అంతా బాగానే ఉంది గానీ ఈ మధ్య నా కారు నన్ను బండబూతులు తిడుతోంది.. నువ్వు రోజుకి రెండు సార్లు స్నానం చేస్తావ్.. మరి నా సంగతి ఏంటి అని అడుగుతోంది.. దున్నపోతులా నాపైన కూర్చుని జల్సా చేస్తావు గానీ నన్ను మాత్రం కడగవా ? అని అడిగేది.. సరే దాని గోల భరించలేక సర్వీసింగ్ కి ఇచ్చేవాడిని.. సర్వీసింగ్ చేయించాక మళ్లీ దుమ్ము పడకుండా దానిమీద కవర్ కప్పే వాడిని.. కొద్దిరోజులకే కవర్ మీద దుమ్ము పోవడానికి వాషింగ్ మిషన్ లో వేసేవాడిని.. కవర్ తీయడం వేయడానికి బద్దకం వేసి వదిలేసేవాడిని.. కవర్ కప్పడం మర్చిపోతే అప్పుడు నా కారు నన్ను గుర్రుగా చూసేది..
నీ ఒంటిమీద రకరకాల బ్రాండ్ల డ్రస్సులు వేస్తావ్.. మరి నా ఒంటిమీద కవర్ కప్పడానికి మాత్రం ఒళ్ళు వొంగదా? అని అడిగేది..
కారు అద్దాల మీద మాత్రం దుమ్ముతో నిండిపోయి అసహ్యంగా ఉండేది.. దాన్ని కవర్ చేయడానికి నీళ్ళ పంపు ఆన్ చేసి వైఫర్స్ ఆన్ చేసేవాడిని.. మిగిలిన పార్ట్ గుడ్డతో తుడిచి కవర్ చేసేవాడిని.. ఇక సైడ్ అద్దాలు, వెనుక అద్దాలు, బ్యానెట్ మీద దుమ్ము అసహ్యంగా కనిపించేది.. అప్పుడప్పుడూ కారులో క్లాత్ తీసుకుని ఎడాపెడా తుడిచేవాడిని..
ఇలా కొద్దికొద్దిగా తుడిచే బదులు పక్కనే సర్వీసింగ్ సెంటర్ ఉంది కదా కడిగించ వచ్చు కదా అని అడిగేది బ్రీజా.. కారు కడగడానికి ఆరు వందలు ఎందుకు దండగ అనే వాడిని..
నీ కక్కుర్తి లో నా పొగ గొట్టం, నీ దరిద్రంలో నా బ్యానెట్టు, నీ పీనాసితనంలో నా గేర్ రాడ్డు అని కారు భాషలో తెగ తిట్టేది బ్రిజా.. సరే నీ తిట్లు ఎవరికి వినపడదు కదా.. అని సరిపెట్టు కునేవాడిని..
అయినా కారు మాత్రం నసుగుతూనే ఉండేది.. మన తెలివితేటలు, మన కక్కుర్తి ఎలా ఉందేదంటే.. కారు మీద దుమ్ము పోవడానికి వర్షం పడితే బావుండేది అనిపించేది.. నిజంగా వర్షం పడితే మన తెలివితేటల్ని వాడి కారుని వర్షంలో ఉంచేవాడిని..
అప్పుడు కూడా Brezza కోపంగా చూసేది.. ఆరొందలు మిగల్చడానికి ఇలా నన్ను వర్షంలో పడేస్తావా?? నీ ముఖం మీద నా రేడియేటర్ వాటర్ పోస్తా.. నీ ఒంటిమీద తీసేసిన ఇంజి నాయిల్ పొస్తా.. అని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టేది నా కారు.. ఈ దరిద్రుడు కొంపలో కి నన్నెందుకు పంపించావయా .. అని మారుతి సుజుకి కంపెనీ వాడిని అడ్డమైన బూతులు తిట్టేది Brezza..
వర్షాకాలం ఏదైనా ఊరు వెళ్ళి వచ్చాక నా కారుని చూడాలి.. అప్పటిదాకా బురదలో తెగ దొర్లిన పంది ???? లాగా కనిపించేది.. కాకపోతే పందిమాదిరి ఒళ్ళు విదిలించుకునే అవకాశం దానికి లేక అల్లాడి పోయేది..
నా కారు తిట్టే తిట్లు భరించలేక మా అబ్బాయి నేను కలిసి వీర లెవెల్లో బకెట్, క్లాత్ తీసుకుని కడగడానికి బయలుదేరే వాళ్ళం.. ఇందులోనూ ఒక స్వార్థం ఉంది.. ఆరొందలుమిగలడమే గాక బాడీకి మంచి ఎక్సర్ సైజు కూడా అవుతుంది కదా అని క్లాత్ నునీళ్లలో ముంచి తెగతోమేవొడిని.. మా అబ్బాయి అయితే కారు పైకెక్కి ఎక్కడపడితే అక్కడ ఇష్టమొచ్చినట్టు రుద్దే వోడు.. గడ్డితో గేదెను కడిగినట్టు నేను, తోం తోం తోం..అంటూ అంట్లు తోమినట్టు మా అబ్బాయి కారుని ఎడాపెడా రుద్దేస్తోంటే నా Brezza ఏమనాలో అర్ధంగాక దీనంగా చూసేది..
అసలు కార్లకి హక్కులుంటే మా ఇద్దరి మీదా.. అంతర్జాతీయ వాహన కోర్టులో కేసు వేసేది.. సరే ఇంతా కడిగాక ఎందుకో ఎక్కడ చూసినా మరకలే కనిపించేవి.. మీరు నామీద అణువణువూ దాడి చేసి రుద్దిన తర్వాత కంటే కడగక ముందే బాగున్నాను కదరా.. అసురుల్లారా అని గట్టిగా అరిచేది Brezza పాప..
కారు కడిగాక నా వొంట్లో ఎక్కడపడితే అక్కడ పట్టేసేది.. పోన్లే ఆరొందల మిగిల్చామన్న ఆనందం ముందు ఒళ్ళు నొప్పులు పెద్దగా కనిపించేవి కాదు.. ఒళ్ళు నొప్పులు తగ్గడానికి టాబ్లెట్ వేసుకునే వాడిని..
ఇలా కారుకి, నాకు పెద్ద యుద్దం నడుస్తున్న తరుణంలో మాకు ఒక ఆశాదీపం దొరికింది.. మా గేటెడ్ కమ్యూనిటీ లో అందరి కార్లు ఒక కుర్రాడు కడిగేవోడు..
ఒకరోజు నా దగ్గరకి వచ్చి మీ కారు రోజూ కడగనా అన్నాడు..
ఎంత అని అడిగా..
అందరూ ఐదొందల ఇస్తున్నారు సార్….
ఐదొందలా… అని అడుగుతుంటే వెనక నుంచి Brezza పాప్ తిట్లు వినపడుతున్నాయి..
ఒరేయ్.. ఒరేయ్ ఐదొందల కోసం అలోచిస్తావు ఏంట్రా?? పీనాసి ముఖమొడా.. నీ పిల్లలకి ఒకరోజు స్విగ్గీలో బిర్యాని ఆర్డర్ పెట్టినంత లేదు కదరా.. ఇచ్చెయ్.. ఇచ్చేసెయ్ అని తల బాదు కుంటోంది.. సరేనని ఈ గోల భరించలేక ఐదొంద లు ఇవ్వడానికి ఒప్పుకున్నా..
ఆ రోజునుంచి నా కారు మురిసిపోయేది.. తళతళా మెరిసిపోయేది.. రోజూ తడిగుడ్డతో చక్కగా తుడిసే వోడు.. నాలుగురోజులుకోసారి బాగా కడిగేవొడు.. అసలే కారు గోల్డ్ కలర్ కదా.. ధగ ధగామెరిసిపోతూ ఉండేది Brezza .. ఆరోజు నుంచి నన్ను తిట్టడం మానేసింది.. నేను కనపడగానే నవ్వుతూ విష్ చేసేది..
కాలం ఎప్పుడో ఒకేలా ఉండదు కదా.. ఎవరి దిష్టి తగిలిందో తెలీదు కానీ మళ్ళీ నాకారుకి మురికి కష్టాలు మొదలయ్యాయి.. ఒకరోజు నేను ఆఫీస్ లో యమా బిజీగా, చిరాకుగా, అసహ్యంగా ఉన్న సమయంలో కారు తుడిచే కుర్రాడు నాకు ఫోన్ కొడుతూనే ఉన్నాడు.. నేను ఫోన్ తీసే పరిస్తితి లేదు.. కట్ చేస్తూనే ఉన్నా.. అయినా కాల్ మళ్లీ మళ్లీ మోగుతూనే ఉంది.. ఆ సమయానికి సైలెంట్ లో పెట్టుకుంటే సరిపోతుంది కదా.. కానీ ఫోన్ లిఫ్ట్ చేసి ఒరేయ్ ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తావ్ అని అరిచా.. ఈనెల నా ఐదువంద లు ఇవ్వలేదు మీరు.. ఇప్పుడు ఇస్తారా అన్నాడు..
నేను ఆఫీస్ లో ఉన్నా .. అయినా సాయంత్రం వస్తా కదా అప్పుడు ఇస్తాలే అన్నా…
కానీ నేను ఊరెళ్తున్నా డబ్బులు కావాలి అన్నాడు.. నిజానికి అప్పుడు నేను ఫోన్ పే చేయొచ్చు లేదా.. ఇంట్లో మా ఆవిడ దగ్గర తీసుకోమని చెప్పొచ్చు.. కానీ ఈ రెండుఆ టైంలో నాకు తట్టలేదు..
ఆ కోపంలో అతన్ని ఈనెల నుంచి కారు కడగొద్దు.. ఇలా నన్ను విసిగించవద్దు.. అని ఫోన్ పెట్టేశా. ఒక గంట తర్వాత బుర్ర పని చేసి అతని ఎకౌంట్ కి ఫోన్ పే చేశా..
అయితే మరుసటి రోజు నుంచి కారు తుడవడం మానేశాడు.. అలా రెండు మూడు రోజులు చూస్తూనే ఉన్నా.. కానీ కారు కడగడం లేదు.. తుడవడం లేదు.. ఎందుకో అర్థం కాలేదు.. అప్పుడు గుర్తొచ్చింది నాకు అతన్ని ఇక కారు తుడవొద్దని విసుక్కున్న సంగతి.. అక్కడే అతని ఇగో hurt ???? అయింది..
కారు తుడిచినందుకు డబ్బులు అడిగితే నీ ఆస్తేదో రాసివ్వమన్నట్టు విసుక్కుంటావా? ఇప్పుడు నీ కారు నువ్వే కడుక్కో అన్నట్టుగా చూసేవాడు ..
బాబ్బాబు.. నీకు దండం పెడతాను..ఐదొందలు కాదు కావాలంటే ఆరొందలు తీసుకో …కారు మాత్రం కడగడం మానేయకు …అని అతన్ని బతిమాలాలని పించేది.. కానీ కానీ నా ఇగో అడ్డు వచ్చి అడగలేకపోయేవాడిని.. ఇలా నెల దాటింది.. ఇక నా కారు మళ్లీ మురికి మయం అయింది..
నిన్న వర్షం కురుస్తుంటే మళ్లీ గ్యారేజ్ లోంచి బయటకు తీసి వర్షంలో పెట్టా.. నేను కారు అలా వర్షంలో పెడుతుంటే కారు కడిగే కుర్రాడు చూసి నవ్వేడు.. నీకు దూల తీరిందిరోయ్… అన్నట్టుగా చూశాడు..
యధావిధిగా కారు అద్దాలు మురికి పట్టాయి.. బ్యానెట్ దుమ్ముతో నిండిపోయింది.. మళ్లీ పాత పద్ధతిలో నా Brezza తిట్ల దండకం అందుకుంది…
-అశోక్ వేములపల్లి