రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదవర్గాల సంక్షేమం కులగణన కార్యక్రమంతో ముడిపడి ఉందని, జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు దక్కేందుకు సిఎం జగన్ బాటలు వేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పేదవర్గాల మేలు చేసేందుకు కులగణన కీలకం కానుందని స్పష్టం అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కులగణనపై సీఎం ధైర్యంగా తీసుకున్న నిర్ణయం చూసి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఆశ్చర్యపోతున్నారని… ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా బీసీ వర్గానికి చెందిన వారే అయినా అక్కడ ఇది చేపట్టలేదని అన్నారు. 100 ఏళ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్న కులగణన ఒక్క బీసీలకే కాకుండా మిగతా కులాల వారికి కూడా మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
” కులగణన అనేది ఒక చరిత్రాత్మక కార్యక్రమం. రాష్ట్రంలో సీఎం జగన్ చేపట్టిన మహత్తర సంకల్పంగా దీన్ని చెప్పవచ్చు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఇది ఆదర్శమైన కార్యక్రమం. బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లోనూ కులాల లెక్కలు తీసేందుకు ఇప్పటివరకూ ఎవరూ సాహసం చేయలేని పరిస్థితిని చూశాం. ప్రధాని మోదీ సైతం బీసీ వర్గానికి చెందినా, ఆయన కూడా బీసీ లెక్కలు తీయించే ఆలోచన చేయలేదు. కానీ జగన్ ఒక గొప్ప ఆలోచన, సంకల్పంతో కులాల వారీగా లెక్కలు తీసి వారికి, విద్య, వైద్యంతో పాటు అన్ని రకాలుగా ఇంకా మెరుగైన సంక్షేమం అందించేందుకు శ్రీకారం చుట్టారు. కులగణన వల్ల రాష్ట్రంలోని పేదవర్గాలకు సంక్షేమ పథకాలు మరింతగా అందే అవకాశం ఉంది” అని వివరించారు.
కులగణన గిట్టని కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ నేతల మాయమాటల్ని, అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని కృష్ణయ్య అన్నారు. నిజానికి పార్లమెంట్‌లో ప్రతి బీసీ ఎంపీ కూడా కులగణనను కోరుకుంటున్నారని, బీహార్‌లో కులగణన జరిగిందని, ఏపీలో కూడా బీసీ కులగణనకు అందరూ మద్దతుగా నిలవాలని కోరారు.