Wednesday, February 28, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅదిగో లేపాక్షి-10

అదిగో లేపాక్షి-10

History & Epics:  లేపాక్షి కథ స్కాంధ పురాణం దగ్గర మొదలవుతుంది. “లేపాక్ష్యామ్ పాపనాశనః” అని పురాణంలో ప్రస్తావించింది లేపాక్షిలోని పాపనాశేశ్వరస్వామి గురించే అన్నది ఆధ్యాత్మికవేత్తల వివరణ. అనాదిగా ఉన్న లేపాక్షి పాపనాశేశ్వరస్వామి పక్కన గుహలో అగస్త్యుడు తపస్సు చేశాడని చెబుతారు. పురాణంలో ఉన్న “లేపాక్షి” అంటే కంటికి అడ్డుగా ఉన్న చీకటి తెర తొలగితే…పాపనాశనం అవుతుందనే విస్తృత సాధారణ అర్థమే తప్ప- ఈ లేపాక్షికి సంబంధం లేకపోవచ్చు అని కొందరి వాదన. స్పష్టంగా ఒక పురాతన ప్రస్తావనలో లేపాక్షి గురించి ఉందని సంతోషించకుండా…పండిత చర్చతో ఆ పవిత్రతను పాడు చేసుకోవడం ఎందుకు? అన్నది స్థానికుల అభిప్రాయం.

అప్పటికే ఉన్న గుడిని 1530 ప్రాంతాల్లో పెనుగొండ కోశాధికారి విరుపణ్ణ పెద్దది చేశాడు అనడానికి లేపాక్షితో పాటు చుట్టుపక్కల అనేక శిలాశాసనాలు ఆధారం.

విజయనగర ప్రభువులు వైష్ణవాన్ని స్వీకరించినా…శైవానికి కూడా అంతే ప్రాధాన్యమిచ్చారు. హంపీ విరూపాక్షాలయం మొదలు దీనికి వేనవేల సాక్ష్యాలున్నాయి. పన్నెండు, పదమూడో శతాబ్దాల్లో కర్ణాటక, కొంత తమిళనాడులో వీర శైవానికి- వీర వైష్ణవానికి మధ్య పారిన రక్తపుటేరులను విజయనగర ప్రభువులు గమనించి…హిందువుల మధ్య పొరపొచ్చాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా లేపాక్షిలో శివ- కేశవుల గర్భగుడులు ఎదురెదుగా ఉంటాయి.

వీరభద్రుడు ఎదురుగా ఉన్నా…దుర్గమ్మ పక్కన ఉన్నా…అనాదిగా ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఉంది. రామలింగం, హనుమలింగం ఉన్నాయి. శివుడి చిత్రాల పక్కనే కృష్ణుడు ఉంటాడు. ఇదంతా భక్తిలో శివ-కేశవ సమదృష్టికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. కాకపోతే…నంది, నాగలింగం, శివపార్వతుల కల్యాణమండపం లాంటివాటి ప్రభావం వల్ల లేపాక్షి శివక్షేత్రమని ఎక్కువమంది అనుకుంటారు.

లేపాక్షి గర్భగుడి ఒకటి కాదు. అప్పటికే ఉన్న అనేక గర్భగుళ్లను ఒకే పైకప్పు కిందికి తెచ్చారు. దాని కొనసాగింపుగా గర్భగుడి గోడల మీద పురాణ శిలా కథనాలు; నాట్యమండపం పైకప్పు మీద పురాణ కథల వర్ణచిత్రాలు కనిపిస్తాయి.

భక్త శిరియాళుడి కథను గర్భగుడి బయట గోడమీద ఇప్పటి బొమ్మల కథలా ఒక వరుసలో అద్భుతంగా చెక్కారు. ఆడియో, వీడియో, టెక్స్ట్ ఏదీ లేకపోయినా వరుస బొమ్మలు చూస్తూ నడుస్తుంటే చాలు…కథ అంతా ఒక క్రమపద్ధతిలో అర్థమైపోతుంది. శివుడి పరీక్షలో భాగంగా తన తలను రోకటి పోటుకు ఆనందంగా అర్పించుకున్న శిరియాళుడు, కన్న కొడుకు ఉసురు తీస్తూ…మునిపంట బాధను భరిస్తూ…ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోతూ…రోకటిలో కొడుకును దంచబోతున్న తల్లిని…చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. నిజంగా మనుషులే ఉన్నా అంతటి ఉద్వేగాలను నటించి చూపలేరేమో! లేపాక్షి శిల్పులు మాత్రం అడుగు సైజులో రాతి మీద భక్తి పారవశ్యాన్ని, కన్న ప్రేమను, భక్తికి కట్టుబడ్డ దీక్షను, కన్నీళ్లను, లోకంలో సహజమైన బంధాల విలువలను, పారమార్థిక మార్గం గొప్పతనాన్ని అన్నిటినీ కలగలిపి ఆవిష్కరించారు.

ప్రఖ్యాత కిరాతార్జున యుద్ధం కథలో అతి సూక్ష్మ విషయాన్ని కూడా శిల్పి వదలకుండా పట్టుకున్నాడు. బాణం తగిలి పంది బోర్లా పడి ఉంది. పందికి ఒకవైపు శివుడు, మరోవైపు అర్జునుడు చేతుల్లో ధనుర్బాణాలు పట్టుకుని…నేను కొట్టాను అంటే…కాదు కాదు నేనే కొట్టాను అని వాదులాడుకుంటున్నారు.

ఒక పైకప్పు వర్ణచిత్రంలో ఒక రాజు ధర్మాపాలన కథ అత్యద్భుతంగా వరుస చిత్రాల్లో ఉంది. తమిళనాడు కంచికి సమీపంలో మనునీతి చోళుడి రాజ్యంలో ఒకప్పుడు ఇది నిజంగా జరిగిన కథ అని ప్రచారంలో ఉంది. రాజవీధిలో ఒక ఆవు-దూడ పక్క పక్కన వెళుతుంటాయి. రాజు కొడుకు యువరాజు కూర్చున్న రథం కన్ను మిన్ను కానని వేగంతో దూడ మీద వెళుతుంది. దూడ అక్కడికక్కడే చనిపోతుంది. దిక్కు తోచని ఆవు రాజు అంతః పురానికి వెళ్లి ధర్మ గంట మోగిస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా అత్యవసరంగా రాజును కలవాలంటే ఆ ధర్మ గంట మోగిస్తే చాలు. రాజు పనులన్నీ పక్కనపెట్టి వచ్చి ఆ ఆపద నుండి గట్టెక్కిస్తాడు. రాజా! నీ కొడుకు నా బిడ్డను అకారణంగా చంపేశాడు…న్యాయం చేయండి అని ఆవు రాజును ప్రార్థిస్తుంది. రాజు దిగివచ్చి ప్రమాదం జరిగిన చోటే న్యాయవిచారణ జరుపుతాడు. సాక్షులందరూ యువరాజుదే తప్పని చెబుతారు. వెంటనే రాజు యువరాజుకు శిక్షను ప్రకటించి…అక్కడికక్కడే అమలు చేస్తాడు. చనిపోయిన దూడను అదే రథం మీద ఎక్కించి…యువరాజును వీధిలో పడుకోబెట్టి...ఆ బండి వెనుక ఆ తల్లి ఆవు వస్తుండగా…యువరాజుమీద అదే వేగంతో బండి ఎక్కించి అలాగే చంపేయడం అన్నది రాజు విధించిన శిక్ష. అయితే రాజు కొడుకును శిక్షించడానికి ఉద్యోగులెవరూ ముందుకు రారు. దాంతో స్వయంగా రాజే కొడుకును శిక్షించడానికి రథం తోలుతాడు. అందరూ చూస్తుండగా యువరాజు రథం చక్రం కింద నలిగి చనిపోతాడు. ఆ సమయంలో ఆకాశంలో వృషభ వాహనం మీద శివ పార్వతులు ప్రత్యక్షమై…రాజా! నీ ధర్మపాలనకు మెచ్చాము…దూడను, నీ కొడుకును కూడా బతికిస్తున్నాము. వెయ్యేళ్లు ఇలాగే ధర్మపాలన సాగించు! అని పూలు చల్లి…నీ కీర్తి ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటుంది అని ఆశీర్వదించి…అదృశ్యమవుతారు.

ప్రఖ్యాత లేపాక్షి నాగలింగం – గణపతి విగ్రహాల మధ్య రాతిలో కూడా శిల్పులు పురాణ కథలను ఆవిష్కరించారు. కాళహస్తిలో భక్తి పారవశ్యంతో పరస్పరం పోటీ పడి కైవల్యం పొందిన  సాలీడు, తిన్నడు, పాము-ఏనుగులను అద్భుతంగా చెక్కారు. 

వెళ్లి…తీర్థప్రసాదం తీసుకుని ఒక్క సెకనులో వెనక్కు వచ్చే గుడి కాదు- లేపాక్షి. రాతిలో పూచిన పూల పరిమళాలను ఆఘ్రాణించాలి. పైకప్పులో ఆకాశంలో వికసించిన శతపత్రదళ కమలం అందాలను పట్టుకోవాలి. నెమలికి నాట్యం నేర్పే నాట్య మండపం స్తంభాలను తాకి చూడాలి. పురాణ ప్రవచనం చెప్పే శిలా కథనాలను వినాలి. ధర్మాన్ని నిలబెట్టడానికి కన్న కొడుకును నడి బజారులో శిక్షించబోయిన ధర్మపాలకుడి చిత్రాల ఔన్నత్యాన్ని, అక్కడ చిత్రించడం ద్వారా ఈ ఆలయ నిర్మాత మనకు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నాడో గ్రహించాలి. భక్తి కేంద్రంగా సకల కళలు ధర్మార్థకామమోక్షాల సిద్ధికి ఎలా దారి దీపాలవుతాయో తెలుసుకోవాలంటే లేపాక్షి శిల్పాలను, చిత్రాలను కనులారా చూడాలి. చెవులారా వినాలి. మనసారా తలచుకోవాలి.

రేపు- అదిగో లేపాక్షి-11
“లేపాక్షి కవిత్వాలు, కావ్యాలు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్