Thursday, February 22, 2024
HomeTrending NewsMahabubnagar: హాట్రిక్ కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్

Mahabubnagar: హాట్రిక్ కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ లో ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నుంచి మిథున్ రెడ్డి తలపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,13,070 ఓటర్లు ఉండగా పురుష ఓటర్ల సంఖ్య 106907, మహిళా ఓటర్ల సంఖ్య – 106159గా ఉంది. గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్ల వైఖరి కీలకం.  మహబూబ్ నగర్ పట్టణం, గ్రామీణం, హన్వాడ మండలాలు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.

2014 ఎన్నికల్లో 3,139 ఓట్ల స్వల్ప మెజారిటీతో అప్పటి బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు. 2018లో పొత్తుల్లో భాగంగా టిడిపికి కేటాయించగా…ఆ పార్టీ అభ్యర్థి ఎం చంద్రశేఖర్ పై 57,775 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక సిఎం కెసిఆర్..శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి పదవి దక్కింది. అభివృద్ధి కార్యక్రమాలే అజెండాగా మంత్రి ప్రచారం నిర్వహిస్తున్నారు. పాలమూరు చరిత్రలో ఎవరు చేయలేని అభివృద్ధి తన హయంలో జరిగిందని ప్రజలకు వివరిస్తున్నారు.

మంత్రి పదవి చేపట్టాక శ్రీనివాస్ గౌడ్… నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎదగకుండా చేశారని, ఆయన సోదరుడు శ్రీకాంత్ అరాచకాలు పెరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని…ఇవన్నీ మంత్రి కనుసన్నల్లోనే జరిగాయని విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ కౌన్సిలర్లు మంత్రి వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. పైకి మంత్రి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటున్నా లోలోపల గుర్రుగా ఉన్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఎన్.రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. రాజేశ్వర్ రెడ్డి మరణంతో 2012 మార్చిలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. తొలుత బీఆర్ఎస్ లో ఉన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరి అక్కడి నుంచి కాంగ్రెస్ కు వచ్చి టికెట్ దక్కించుకున్నారు. 2014లో బిజెపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన యెన్నం తిరిగి కాంగ్రెస్ నుంచి రంగంలో ఉండటం కొంత ప్రతికూలంగా ఉందని సమాచారం. కాంగ్రెస్ క్యాడర్ తో ఎన్నంకు సయోధ్య లేదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

బిజెపి నుంచి ఏపి మిథున్ రెడ్డి బరిలో ఉన్నారు. మాజీ ఎంపి జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బరిలో ఉండటంతో కమలం శ్రేణులు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పట్టు ఉన్న జితేందర్ రెడ్డి.. కుమారుడి గెలుపు కోసం వ్యూహ రచన చేస్తున్నారు. మొదటిసారిగా పోటీ చేస్తున్న మిథున్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ చట్టం అమలుతో మైనారిటీ మహిళల ఓట్లు సైలెంట్ గా కమలంకు దక్కుతాయని బిజెపి నేతలు భరోసాతో ఉన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ నాటికి కాంగ్రెస్-బీఆర్ఎస్ ల మధ్య ఉన్న పోటీ క్రమంగా మారుతోందని అంటున్నారు. నియోజకవర్గంలో ముస్లీం ఓట్లు 55 వేల వరకు ఉన్నాయి. ముస్లిం ఓటర్లు ఈ దఫా కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా ఉన్నా… శ్రీనివాస్ రెడ్డి బిజెపికి చెందిన నేత అని ఆయనను సమర్థించేందుకు విముఖంగా ఉన్నారని తెలిసింది. పార్టీలు మారే శ్రీనివాస్ రెడ్డి గెలిచిన తర్వాత బిజెపికి వెళ్తాడని ముస్లిం వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలు ముస్లిం పెద్దలకు సర్దిచెపుతున్నారు. పోలింగ్ నాటికి ఏం జరుగుతుందో చూడాలి.

హైదరాబాద్ లో మాదిగ విశ్వ రూప సభ తర్వాత SC ఓటర్లు గణనీయంగా బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని కమలం నేతలు భరోసాతో ఉన్నారు. SC ఓట్లు 20 వేల వరకు ఉండగా మందకృష్ణ మాదిగ ప్రచారం కలిసివస్తుందనే విశ్లేషణ ఉంది. ఈ నెల 26వ తేదిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ పాలమూరు వస్తున్నారు. బిజెపి గెలుపునకు యోగి పర్యటన టానిక్ ల ఉపకరిస్తుందని, అదే సమయంలో ముస్లీంలు గెలిచే అభ్యర్థికి ఓటు వేసే దిశగా బీఆర్ఎస్ వైపు మొగ్గుచుపుతారని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరే నాటికి పాలమూరులో పోరు.. గులాబీ – కమలం మధ్యనే కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్