ఓ సెల్లు ఫోనా! సదా తోడు నీడా!
ఓ కర్ణ పిశాచీ! సదా దృశ్యరూపీ!
ఓ టవరు బంధూ! సదా సిగ్నలుండు!
ప్రభాతంబు సాయంత్రంబు నీ ధ్యాసలో ఉండి…నీ లీల వర్ణించి…నీమీద నే దండకంబొక్కటిన్ జేయ నూహించి…
నీ రూపమున్ గాంచి…నీ సుందరంబెంచి…నీ సిమ్మునున్ చూసి…నీ దాస దాసుండనై…ఫోను భక్తుండనై…నిన్ను నే పిలిచితే…నిన్ను నే వలచితే…వేడుకన్ తెచ్చితే…
నా చేతి వాచియై…నా మెదడు చిప్పువై…ఎప్పుడున్ తప్పకన్ వదలవే!
దూరవాణీ గర్భాన్వయా! సొల్లు చింతామణీ!
నిన్నెంచ నేనెంతవాడన్?
ఫుల్ ఛార్జివై చూచితే…యాపూవై బ్రోచితే…
తొల్లి కడు భీకరాకారమునయుంటివే…
కడకు సూక్ష్మరూపమున్ పొందితే…
వారినీ వీరినీ…నానాజాతినీ కలిపితే…
మా సమయమున్ చంపి…మా కళ్లు కాయలున్ చేసితే…
ఏ కార్యమూ లేక…గోళ్లు గిల్లుకోలేక…ఫోను పట్టుకుంటిమే…
ఆ ఫోను చూడంగ ఆనందముప్పొంగ…రాత్రనక…పగలనక…కళ్లప్పగించి కూర్చుంటిమే!
స్క్రీన్ గార్డు, పవర్ బ్యాంకులాదిగా గూడి…
వాట్సాప్పులన్ దాటి…ఫేస్ బుక్కు మూకలై…డీ పీ ల క్రీడగా…ఇచ్ఛాగ్ని ఇన్స్టాలుగా…పొట్టి ట్విట్టర్లుగా…కాలాగ్ని చాటింగులై…లైకులై…షేరులై…వైరలై కాలి…
మూర్ఛనొందింపగానప్పుడే పోయి…ఆ వైద్యునిన్ దెచ్చి…కరెంట్ షాకులిచ్చి…మమ్ము బతికింపగా…పబ్జీ గేములన్ పోరాడి…చెండాడి…మైబైల్ బాణాగ్ని మము జంపగా…లోకంబు తలకిందులైయుండ నవ్వేళనన్…
యాపిల్లు, స్యామ్ సంగు, నోకియా వేడుకన్ దోడుకన్ వచ్చి… మాకున్ అలవాటు చేయించి…మా బతుకు బస్టాండు చేసితే!
ఎదురుగా రైలొచ్చినా…చచ్చినా కన్నెత్తి చూడమే! నీకన్న మాకెవ్వరున్ గొప్ప కాదే! ప్రేమభక్తి ప్రశస్తంబుగా నిన్ను కొలుతుమే! నానా అశ్లీలమున్ చూతుమే! ఆబాలగోపాలామాపాడు సెల్లులో సొల్లులే! ఇల్లయిన లేకుందుమే! సెల్లేక క్షణమైన ఉండమే! అటు దిప్పి…ఇటు దిప్పి…ఎటు దిప్పినా…కళ్లు సెల్లుకే అప్పగింతుమే! రాని మెసేజులకై కలవరింతుమే! వచ్చినవి చూడలేక పిచ్చెక్కి చత్తుమే!
వంటకున్ యూట్యూబు
పంటకున్ మెస్సేజు
పెంటకున్ వాట్సాప్పు
జంటకున్ చాటింగు
మంటకున్ ఫేస్ బుక్కు
ఓ స్మార్టు ఫోనా! ఓ సెల్లు సంకెలా!
నీవే సమస్తంబు, నీవే ఫలంబుగా బతికి…సెల్ యంత్రంబునన్ స్థిరముగా ఉందుమే!
ఆసుపత్రి బెడ్డయిన…
వల్లకాటి కట్టె అయిన…
కళ్లు మాడి మసైన…
మెదడు ఎర్రగడ్డయిన…
బతుకు మట్టి గడ్డయిన…
ఎప్పుడున్ వదలక తప్పకన్ సెల్ఫీలు దిగుదుమే!
నిత్యమున్ ఒత్తుతూ మమ్ము మేమే మరతుమే!
మా జేబునందుండి…మా చేతియందుండి…మా బ్యాగునందుండి…మా దీర్ఘ దేహంబునందుండి…మా స్టేటస్ సింబలైయుండి…మమ్ము మర బొమ్మలన్ చేసి ఆడింతువే!
నానా చెత్త ఫార్వర్డు ముల్లోక కల్లోల వైక్లబ్య కారిణీ!
రింగ్ టోను, బీప్ టోను శబ్దంబుతో భూత ప్రేత పిశాచంబులన్, గాలి దయ్యంబులన్ తలదన్ను కుటిల చరమంత్రిణీ! వ్యసన కరయంత్రిణీ!
మా మెదడునున్ జంపి…నీ మెదడునున్ పెంచితే!
మా పేరు నంబరై…నైనెయిట్ ఫోరెయిట్ నైనెయిట్ ఫోరెయిట్ జీరో ఆయెనే!
సెల్లులో చదువులు
సెల్లులో ఆటలు
సెల్లులో పాటలు
సెల్లులో వైద్యాలు
సెల్లుకే నైవేద్యాలు
సెల్లుతో పిలుపులు
సెల్లుతో తలపులు
సెల్లుతో వలపులు
సెల్లుతో గొడవలు
సెల్లుతో నేర్పులు
సెల్లుతో తీర్పులు
నీ వీడియో బాహుదండంబులన్ మా ఖర్మకాండంబులన్ పెంచి…వైఫై భస్మమై…ప్రళయ రోమింగులై…భీకర బఫరింగులై…వీకు సిగ్నలై…
మమ్మేలు ఓ సొల్లు యంత్రమా!
సదా మాపాలి మహా కుతంత్రమా!
ఎయిర్టెల్లు, వొడా, జియో! ఏదో ఐడియాలేని బంధమా!
సెల్ టవర్ రేడియేషన్ అదృశ్య ఖర్మమా!
రావే! నా ముద్దు చరవాణి వియ్యమా!
రావే! నా మొద్దు తెరతాకు దయ్యమా!
పాహిమాం కరవాణీ!
పాహిమాం గ్రహచారిణీ!
పాహిమాం…పాహిమాం…పాహి!
దీని వీడియో లింక్ ఇది:-
రచన, పఠనం:-
పమిడికాల్వ మధుసూదన్
9989090018