Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపండోరా బాగోతం

పండోరా బాగోతం

Pandora Papers row….
యూ టూ బ్రూటస్…

షేక్ స్పియర్ రాసిన ప్రసిద్ధ నాటకం “జూలియస్ సీజర్” లో ప్రసిద్ధ వాక్యాలివి.

తనను చంపడానికి కుట్ర పన్నిన అనేకమందిలో తన ప్రాణ స్నేహితుడు కూడా ఉండడం చూసి బాధతో చనిపోయేముందు “సీజర్” అన్న మాటలివి.

ఇది రాసి నాలుగు శతాబ్దాలు దాటిపోయినా ఇప్పటికీ నమ్మక ద్రోహానికి, మిత్ర ద్రోహానికి ‘పక్కనే ఉండి గోతులు తీసే వాడు’ అని పరోక్షంగా చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న మాట ఇది.

‘పండోరా’ పేపర్లలో సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఉందని వస్తున్న వార్త చూడగానే అనిపించిన మాట ఇది.

రాజకీయ నాయకులు, అక్రమ వ్యాపారస్తులు… పైకి సంఘసంస్కర్తలుగా చలామణి అయ్యి దేశ సంపదను దోచుకొని విదేశాలలో దాచుకొనే దొంగలు, స్మగ్లర్లు వంటి వారి పేర్ల సరసన ‘భారతరత్న’ సచిన్ టెండూల్కర్ పేరు చూస్తే  బాధే.

ఈ దేశం టెండూల్కర్ కు ఏమన్నా తక్కువ చేసిందా?
బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్నాడని నెత్తిన పెట్టుకొని చూడలేదా?
ఆర్ధికంగా ఎక్కడ ఉన్న టెండూల్కర్ ఎక్కడికి వచ్చాడు?
కేవలం క్రికెట్ లో అతని ప్రతిభకు దక్కిన గుర్తింపా అది?
దానికి తోడైన దేశ ప్రజల అభిమానం లేదా?
టెండూల్కర్ కంటే ప్రతిభావంతులు ఏ గుర్తింపుకూ నోచుకోకుండా పోలేదా?
అంత ప్రతిభ కనబరిచినా, వారు ‘భారతరత్న’ స్థాయికి ఎదిగారా?
కనీసం పార్లమెంట్ పెద్దల సభలో రాష్ట్రపతి డైరెక్ట్ గా నామినేట్  చేసిన  ‘మెంబర్’ అయినా కాగాలిగారా?

చాలా సంపాదించుకోవచ్చు..
ఒక ఆరేడు తరాలకో, లేదా పది తరాలకో కావలసినంత సంపాదించవచ్చు.
సంపాదించింది అంతా సక్రమమే అయితే..
ఆ సంపాదించింది ఇక్కడే దాచుకోవచ్చు..
లేదా ఏ విదేశంలోనో, దేశానికి కట్టాల్సిన పన్నులన్నీ కట్టి తీసుకెళ్ళి దాచుకోవచ్చు..
కాని రహస్యంగా దాచుకోవడం ఎందుకు?
అంటే ఇక్కడ ప్రభుత్వానికి తెలియకుండా అక్కడికి తరలించి దాచుకోవడం ఎందుకు?
అంటే అక్రమ సంపాదన అని అర్థం చేసుకోవాలా?

విజయ్ మాల్యా, నీరవ్ మోడీల్లా.. ఇక్కడ నేరం బయటపడగానే విదేశానికి పారిపోయి అక్కడ ఏళ్ల తరబడి ఖరీదైన విల్లాల్లో గడపడానికి, ఈ దేశానికి వారిని అప్పచెప్పకుండా అక్కడి కోర్టుల్లో పోరాడటానికా?

ఇక్కడ ప్రస్తుతం గౌరవంగా చలామణి అయ్యేవారు కూడా భవిష్యత్తులో తమకు అలాంటి అవసరం రావచ్చు అని అక్కడ దాస్తున్నారా?
అసలు సచిన్ టెండూల్కర్ కు అక్రమ సంపాదన ఎక్కడిది?
అంటే సక్రమంగా సంపాదించినదే ..
ఇక్కడ పన్నులు కట్టడానికి భయపడి అక్రమ సంపాదన కింద మార్చుకున్నారా?
లేదా మన పన్నుల వ్యవస్థలోనే లోపం ఉన్నదా?}
లేక కష్టపడి సంపాదించింది పన్నుగా ఎందుకు కట్టాలనే తత్వమా?
లేదా కష్టపడి సంపాదించింది దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని పన్ను రూపంలో కడితే…
అది మన నాయకమ్మణ్యులు ‘ఓట్ల కోసం’ పంచిపెట్టడం చూసి అసహ్యం పుట్టిందా?

కేబుల్ లీక్స్, వికీ లీక్స్, పారడైస్ పేపర్స్, రాడియా టేప్ లు, పండోరా పేపర్లు.. దేశ సంపదను దోచి విదేశాలలో దాచిన వారి పేర్లు బయటకు తెస్తూనే ఉన్నాయి.
ఇప్పటికి వరకు వాటిలో సత్యాసత్యాలను నిగ్గు తెల్చినవారు లేరు.
అయినా మన టెండూల్కర్ మీద ఇవి నీలి ఆరోపణలా?
మొన్న వినాయక చవితి రోజు వినాయక పూజ చేయకుండా చంద్రుడిని చూసాడా, కొంపదీసి?
మరి ఇవన్నీ ఉత్తిత్తి ఆరోపణలేనని మన టెండూల్కర్ ఇంకా ఎందుకు ఖండించలేదు?

యూ టూ టెండూల్కర్!

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

RELATED ARTICLES

Most Popular

న్యూస్