Friday, April 19, 2024
HomeTrending Newsవరద బాధిత ప్రాంతాల్లో ముగిసిన కేంద్ర బృందం పర్యటన

వరద బాధిత ప్రాంతాల్లో ముగిసిన కేంద్ర బృందం పర్యటన

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో గత రెండు రోజులుగా పర్యటించి హైదరాబాద్ కు నిన్న రాత్రి చేరుకున్న కేంద్ర ప్రభుత్వ బృంద అధికారులకు రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఈనెల 20 వ తేదీన హైదరాబాద్ కు చేరుకొని రెండు బృందాలుగా విడిపోయి వివిధ జిల్లాల్లో వేర్వేరుగా పర్యటించారు. ఈ రెండు బృందాలు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమావేశమైన అనంతరం ఒక బృందం నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించగా, మరో బృందం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి నష్టాలను అంచనా వేసాయి. జిల్లాల్లోని వివిధ గ్రామాలను ఈ బృందాలు స్వయంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించాయి. భారీ వర్షాలు వరదల వల్ల నీటిపారుదల వ్యవస్థకు జరిగిన నష్టం, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితి, వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించడం పట్ల కేంద్ర బృందానికి చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ కృతజ్ఞత తెలిపారు.
కాగా, భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ సంబంధిత జిల్లా పాలనా యంత్రాంగాలు ఎన్డీఆర్ఎఫ్ తదితర విభాగాల సమన్వయంతో కృషిచేసి మానవ నష్టం జరగకుండా అరికట్టడం పట్ల కేంద్రబృందం రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని అభినందించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ పరిస్థితులను స్వయంగా చూసి అంచనా వేయడంపట్ల కేంద్ర ప్రతినిధి బృందానికి సి,ఎస్, సోమేశ్ కుమార్ కృతజ్ఞత తెలిపారు.
రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ అధికారులలో కేంద్ర హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ సౌరవ్ రే, డిప్యూటీ సెక్రటరీ పి పార్తీబన్, డైరెక్టర్ కె. మనోహరన్, డైరెక్టర్ రమేష్ కుమార్, దీప్ శేఖర్, శివ కుమార్ కుష్వాహా, ఏ. కృష్ణ ప్రసాద్ తదితరులున్నారు..

Also Read : తెలంగాణలో వరద నష్టం 1400 కోట్లు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్