Right Choice: చాగంటి కోటేశ్వరరావు గారి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, ఆయన చెప్పింది లక్షల మంది వింటున్నారు. ఆధునిక ప్రచార మాధ్యమాలు ఆయన వాణిని కోట్లమందికి వినిపింపజేస్తున్నాయి. తెలుగునాట ఆయనొక సెలబ్రిటీ. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, క్రీడాకారులకు ఉన్నట్లు ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందరిలాగే జీవనోపాధికి ఒక ఉద్యోగం చేస్తూ, గృహస్తుగా ఉంటూ, భర్తగా, తండ్రిగా, ఉండి ఉంటే నిజానికి ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు.
సనాతన ధర్మం మీద పట్టు, తనకు తెలిసిన ధర్మాన్ని పదిమందికీ చెప్పాలన్న ఆయన సంకల్పం అసాధారణం. ఆయన వ్యాఖ్యానాలలో విషయాలను విభేదించేవారు కూడా ఎక్కడైనా ఉండవచ్చు. అది వేరే సంగతి. అనూచానంగా వస్తున్న ఒక సంప్రదాయ ప్రవచన పద్ధతిలో చూసినప్పుడు ఆయన ఎలా భిన్నమో, ఎలా ప్రత్యేకమో తెలుస్తుంది.
రామాయణ, భారత, భాగవతాలతో పాటు ఇతర ఎన్నో పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, భుజంగాలు, స్తోత్రాలు, పుణ్యక్షేత్ర విశేషాలు, పుణ్య పురుషుల వృత్తాంతాలు ఆయన చెప్పగా విని అర్థం చేసుకున్నవారు, చేసుకుంటున్నవారు, చేసుకోవాల్సిన వారు కోట్లలో ఉన్నారు.
మనం చేసేది జనం చూడాలా, జనం మెచ్చేది మనం చేయాలా? అన్నది ‘పాతాళ భైరవి’లో భేతాళ మాంత్రికుడిగా ఎస్వీఆర్ తాత్వికమైన ప్రశ్న. జనం మెచ్చేలా చెప్పడం వేరు, జనానికి మంచి జరిగేలా కర్తవ్యబోధ చేయడం వేరు. వేదోనిత్యమధీయతాం… అని శంకరాచార్యుల వాక్కు ప్రమాణంగా చాగంటి తన ప్రవచన గంగను సంప్రోక్షిస్తూ ఉంటారు. కొన్ని శతాబ్దాలుగా తెలుగులో ప్రవచనకారులున్నారు. వారు చెప్పింది జనం విన్నారు. చాగంటి వారే పదే పదే ప్రస్తావించే విశాఖపట్టణం శ్రీ భాష్యం అప్పలాచార్యులు వంటి వారి వాగ్వైభవంలో మునకలు వేసి పునీతులైనవారెందరో ఉన్నారు. టివి పెట్టెలు ప్రతి ఇంట్లో దూరడానికి ముందు 1980ల దాకా, ఇంటర్నెట్ అంతర్జాల మార్జాలం నట్టింట్లోకి రాకముందు 1995ల దాకా, కంప్యూటర్, కెమెరా, ఇంటర్నెట్, టివి, రేడియో, గడియారం ఇలా సకల సాంకేతిక పరికరాల సమాహారంగా స్మార్ట్ ఫోన్ వచ్చిన 2000 సంవత్సరానికి ముందు వరకూ పరిస్థితి వేరు. ఒకప్పుడు ఊళ్లల్లో మంచికీ, చెడుకూ హరికథలు, పురాణ ప్రవచనాలు, నాటకాలు విధిగా ఉండేవి. టివి పెట్టె రాగానే అన్నీ ఆ పెట్టెలోకే దూరి పోయాయి.
నాటకాన్ని సినిమా మింగేసింది. సినిమాను ఇప్పుడు, నెట్ ఫ్లిక్స్ లు, అమెజాన్ లు మింగుతున్నాయి. హరికథలు, ప్రవచనాలను టివిలు మింగేశాయి. ఆ టివిలు సర్వకళలనూ మింగాయి. ఇంటర్నెట్ తో అనుసంధానమైన డిజిటల్ మీడియా మన ప్రాణాలనే మింగేస్తోంది. పదివేల ఎపిసోడ్లకు ముందు తొలి ఎపిసోడ్ లో కోడలిపై ఎత్తిన అత్త చేయి కోడలి చెంప మీద పడడానికి మరో పదివేల ఎపిసోడ్లయినా చెళ్ళు మంటుందనే గ్యారంటీ లేదు. ఈలోపు ఇంట్లో కోడలు, ఒళ్లో మునిమనవరాలు ఆడుకుంటూ ఉంటుంది. హాస్యమంటే జబర్దస్త్ ఒక్కటే. న్యూస్ ఛానళ్లలో చెప్పిందే చెబుతూ రాజకీయమే సర్వస్వమని తీర్మానించారు. సినిమాలంటే మొదటి ఆట ఒక్కటే పద్నాలుగు భువన భాండాల్లో ఆడి నాలుగు యుగాల రికార్డులను మూడు గంటల్లోనే తిరగరాస్తూ ఉంటాయి.
బొడ్డూడని పసికూనలు, 20,30 ఏళ్ళుగా ట్వింకిల్ ట్వింకిల్ అని ఏబిసిడిల్లో ఇంగ్లీష్ ఏడుపులు ఏడుస్తూనే పుడుతున్నారు. జానీతో పాటు జానీ వాళ్ల పాపాతో కలిసి ఈటింగ్ షుగర్ తో పసిపిల్లలు పెరుగుతున్నారు. తెలుగు మాట్లాడతాం కానీ తెలుగు రాయలేం. ఇక సంస్కృతం చదవడం, రాయడం, ప్రస్తావించడం మహాపరాధమైపోయింది.
ఉన్న దేవుళ్ళు చాలరన్నట్లు రోజుకో కొత్త దేవుడు పుడుతుంటాడు. కొత్త సిద్ధాంతం పుట్టుకొస్తుంది. కొత్త డ్రస్స్ కోడ్, కొత్త కొత్త ఆచారాలు. వైష్ణవులకు శైవం పడదు, శైవానికి నిలువునామం పడదు. హిందూ దైవాలను తిట్టడంలో, అవమానించడంలో, అనుమానించడంలో హిందువుల తరువాతే ఎవరైనా. ప్రపంచంలో ఇంక ఏ మతం వారు తమ మతాన్ని హిందూమతం వారిలాగా పీకి పాకం పెట్టుకోరు. ఎంతమంది హిందువులుంటే హైందవంలో అన్ని మతాలూ, అభిప్రాయాలు ఉన్నట్లు లెక్క. ఉత్తరాదికీ, దక్షిణాదికీ పూజల్లో తేడాలు. ఆ దక్షిణాదిలో మఠానికి, మఠానికి మధ్య అంతరాలు. ఏకమ్ సత విప్రా బహుధా వదంతి ఉపనిషత్ వాక్యం బహుధా వక్రీకరణకు గురైంది. ఒకరు తిరుపతికి వెళ్తారు కానీ, పక్కనే కాళహస్తికి వెళ్ళకూడదు.
ఒకరు శ్రీశైలానికి బతికుండగా అసలు వెళ్ళనేలేరు. వారికి విష్ణువు అవతారాలే అవతారాలు. కులానికి ఒక దేవుడు, ఆహార్యానికి ఒక దేవుడు దగ్గరవుతాడు.
మఠాలు, కులాలు, ద్వైతాద్వైతాలు, విశిష్టాద్వైతాలు, అర్థం తెలియని మంత్రాలు, పరమార్ధం, తెలుసుకోలేని ఆచారాలు, సినిమాల్లో వస్తే తప్ప ‘దేవ దేవంభజే’, ‘మరుగేలరా’ లాంటి సంకీర్తనలకు కూడా ప్రాచుర్యం లేని రోజులు – ఇలా అన్నీ కలగలిపి ఆధ్యాత్మికంగా ఒక దశలో శూన్యం ఏర్పడింది. వేదం, వేదాంత సారాలను పుక్కిట పట్టినవారు ఇప్పటికీ ఉన్నారు. అన్నీ మాధ్యమాల్లో సనాతన ధర్మాన్ని తప్పుపడుతూ, హైందవాన్ని నీచంగా చిత్రీకరించడం ఒక ఫ్యాషన్ అయిపోయిన వేళ తెలిసినవారు మౌనంగా ఉన్నారు. ఏమీ తెలియనివారు అంతా తెలిసినట్లుగా చెలరేగారు. దీంతో ఏది శాస్త్ర సమ్మతమో, ఏడు స్వకపోల కల్పితమో తేల్చుకోవడం సామాన్యులకు కష్టమైంది. ఇలాంటి ఎన్నెన్నో అయోమయాలు, అస్పష్టతలు, వైరుధ్యాలు, ద్వైదీభావాలు గూడుకట్టుకున్న వేళ చాగంటి కోటేశ్వరరావు వాణి ఒక సన్నటి నది పాయగా మొదలై ఇప్పుడు మహా నదిగా సాగుతోంది. పెద్దలు మల్లాది చంద్రశేఖర శాస్త్రి మొదలు సామవేదం షణ్ముఖ శర్మ, గరికపాటి నరసింహారావు, వద్దిపర్తి పద్మాకర్, బాచంపల్లి సంతోషకుమార శర్మ వరకూ ఎందరో ఆధ్వత్మిక ప్రవచనాలకు పూర్వవైభవం తీసుకువచ్చారు. నిత్యం రకరకాలుగా అందుబాటులో ఉన్న వివిధ మీడియా వేదికలు, భక్తి పత్రికలూ, భక్తి ఛానళ్ళు కూడా ఈ వాతావరణానికి మరింత దోహదం చేశాయి. ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి.
చెప్పే మాటకు, వారి నడవడికకు హస్తిమశకాంతరం తేడా ఉండడంతో చాలామంది మాటలు గాలిలో కలిసిపోతున్నాయి, చాగంటి ఏది నమ్ముతారో అదే చెబుతారు, అదే పాటిస్తారు. వ్యక్తిగత క్రమశిక్షణ, విలువల్లో వేలెత్తి చూపడానికి వీల్లేకుండా ప్రవచనాన్ని ధనార్జనకు కాకుండా ధర్మార్జనకు సోపానంగా మలచుకున్నారు. ఇంతకంటే ఈ విషయం ఎక్కువ చెప్పడం మర్యాద కాదు, అవసరమూ లేదు.
ఇక ఆయన జ్ఞాపకశక్తి గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఎంతో మిగిలే ఉంటుంది. సంస్కృతంలో వాల్మీకి రామాయణ శ్లోకాలు మొదలు ఆధునిక అబ్దుల్ కలాం కొటేషన్ల వరకూ ఒక పుస్తకం చూడకుండా, ఒక కాగితం మీద రాసుకుని రాకుండా కూచున్న చోట కూర్చున్నట్లు అనర్ఘళంగా మూడు గంటలపాటు వందల రిఫరెన్సులను ఉదహరించడం మాటలు కాదు. తపస్సుగా, తదేక ధ్యానంగా, అసిధారావ్రతంగా, ప్రతిపదార్థ వ్యాఖ్యాన సహితంగా చదివిన వారికి తప్ప అంత ధారణ సాధ్యం కాదు. చాలామంది అష్టావధానులకు కూడా మంచి ధారణ ఉంటుంది. కానీ ఒక కథలో నుండి ఒక కథలోకి వెళ్తూ సభికులను మళ్ళీ అలాగే ఒక్కో యుగంనుండి ప్రస్తుతంలోకి తీసుకురావడం చాగంటికే చెల్లిన విద్య. గుక్క తిప్పుకోకుండా ఆయన మాట్లాడుతుంటే మౌనంగా వింటున్న మన గొంతు బొంగురుపోతుంది. ఫుల్ స్టాప్ లు, కామాలు లేని అంతేసి సమాసాలు, వాక్యాలు ఊపిరి తీసుకోకుండా చెప్పడానికి సరస్వతీ దేవి ఆయనకు ఎంతగా ఊపిరిలూడుతుందో లేక వాగర్ధావివ అని వాక్కు అర్థాలైన శివపార్వతులే ఆయన మాటల్లో ప్రతిధ్వనిస్తున్నారేమో?
నిజానికి మనం తిరుమల వెళ్లి వస్తాం, శ్రీశైలం చూసి వస్తాం, తీరిక ఉంటే ఒక్కోచోట మూడు నాలుగు రోజులు ఉంటాం. ఒక్కసారి ఆయన తిరుమల, శ్రీశైలం ఆలయాల గురించి చెప్పిన క్షేత్ర మహిమ ఎపిసోడ్లు యూట్యూబ్ లో వినండి. మనవి పుల్లయ వేమారంలాగా – ఫొటోలు, వీడియోలు, సెల్ఫీల టూర్ గా మిగిలి ఉంటుంది. గుడి మెట్ల దగ్గరనుంచి అంగుళమంగుళం వివరించి ఆయన చెబుతుంటే శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం – లైవ్ టెలికాస్ట్ లా ఉంటుంది. మన కళ్ళు చూడలేని అన్నిటినీ ఆయన మన మనోనేత్రాలకు దర్శనం చేయిస్తారు. ఆయన చెబుతుంటే వినడమే క్షేత్ర దర్శన, పుణ్యతీర్థ స్నానం.
వాల్మీకిని ఆయన ఎప్పుడూ వాల్మీకి అనరు. వాల్మీకి మహర్షి అనకుండా చెప్పలేరు. శంకరాచార్యులను శంకరభగవత్పాదుల వారు అనకుండా ఆయన నోట మాట రాదు. వాల్మీకి, శంకరాచార్యులు, అన్నమయ్య, రామదాసు, పోతన, త్యాగయ్య, కంచి పరమాచార్య, రమణ మహర్షి గురించి ఆయన చెబితే వినాలి, వినడం తపస్సు, వినడం యజ్ఞం – వినడం వినయం- వినడం విజయమని ఎందుకన్నారో చాగంటిని వింటే తెలుస్తుంది.
అందుకే చాగంటి వాణి తెలతెలవారుతుండగా ప్రతి తెలుగు ఇంట్లో రేడియో శబ్దతరంగాలుగా, టివి తెరల దృశ్యాంతరంగాలుగా, యూట్యూబ్ ల డిజిటల్ వేదికలుగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆయన వల్ల సనాతన ధర్మ ప్రచారం, వ్యాప్తి, ప్రతిష్ట జరగడంతో పాటు తెలుగు భాష కూడా బతికి పట్టుబట్ట కట్టుకొని తలఎత్తుకొని తిరుగుతోంది.
ఆయన వాల్మీకి రామాయణంలో రాముడు అడవికి వెళుతున్న సన్నివేశం చెబితే మన కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. సుందరకాండలో పది నెలలుగా పలికేవారులేక ఉరి వేసుకోబోయిన సీతమ్మ గురించి చెబితే గుండె బరువెక్కుతుంది. గణపతి గురించి చెబితే మనకు బుద్ధి వస్తుంది. నరసింహ స్వామి గురించి చెబితే మనకు ధైర్యం వస్తుది. సుబ్రహ్మణ్యుడి గురించి చేబితే మనకు ఆరోగ్యం వస్తుంది. బాల కృష్ణుడిని తీసుకొచ్చి మన ఇంట్లో పిల్లాడిలా కూర్చోబెట్టి వెళతారు. యశోద దగ్గరికి మనలను తీసుకెళతారు. సాయంవేళ కైలాసంలో శివుడి నాట్యాన్ని, పార్వతి లాస్యాన్ని మనకు చూపిస్తారు. అల వైకుంఠ పురములో అని గజేంద్రుడు పాహి పాహి అంటే సిరికి చెప్పకుండా బయలుదేరే చక్రి వెనకాల మనల్నునించోబెడతారు. భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు మనల్ను ఏకకాలంలో తీసుకెళతారు. అన్ని పుణ్యనదుల్లో మనల్ను ఒకే సారి ముంచి పునీతులను చేస్తారు. మౌనవాఖ్యాప్రకటిత అన్నట్లు ఆ మాటలు వినడమే ఒక అదృష్టం, ఒక యోగం, ఒక పుణ్యం
(తిరుమల తిరుపతి దేవస్థానాల – టిటిడి ధర్మ ప్రచార పరిషత్ ప్రధాన సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నిమమించాలని నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి చైర్మన్ ప్రకటించిన నేపథ్యంలో…)