Mini Review: విలేజ్ వాతావరణం .. అక్కడ ఉండే కొన్ని పాత్రలు .. వాళ్ల స్వభావాలు .. మేనరిజాలు .. ప్రేమ .. దానికి వచ్చే అడ్డంకులు .. ఇలాంటి ఒక కంటెంట్ తో సినిమా వస్తుందనగానే అందరికీ గుర్తొచ్చేది జంధ్యాల. ఆయన తయారు చేసుకునే కథలు ఎంత సింపుల్ గా ఉంటాయో .. అంత నేచురల్ గాను ఉంటాయి. ఆయన కథలు తెరపై కాకుండా పిట్టగోడపై నుంచి పక్కింట్లోకి చూసినట్టుగా ఉంటుంది. అందువల్లనే ఇప్పటికీ అందరూ జంధ్యాల సినిమాలను గురించి మాట్లాడుకుంటున్నారు.
అలాంటి ఒక కంటెంట్ తో నిన్న థియేటర్లకు వచ్చిన సినిమానే ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. యశ్ రంగినేని నిర్మించిన ఈ సినిమాకి చందు ముద్దు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నేపథ్యం 1980లలో నడుస్తుందని దర్శకుడు చెప్పడం .. ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ తో హీరో – హీరోయిన్ ను చూపించడంతో ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. ఈ జంటను చూడగానే .. గతంలో జంధ్యాల దర్శకత్వంలో నరేశ్ – పూర్ణిమ, ప్రదీప్ – పూర్ణిమ చేసిన సినిమాలు కళ్లముందు మెదిలాయి.
అయితే థియేటర్ కి వెళ్లిన తరువాత ఆ స్థాయి ఫీలింగ్ కలగదు. గ్రామీణ నేపథ్యం .. అక్కడి వాతావరణం .. హీరో – హీరోయిన్స్ మధ్య లవ్ .. పాటలు .. కాస్ట్యూమ్స్ పరంగా కొన్ని సన్నివేశాలు మాత్రమే కనెక్ట్ అవుతాయి. సినిమాకు ప్రధానమైన బలంగా కామెడీని నిలబెట్టడానికి చేసిన ప్రయత్నంలో కొంతవరకూ సక్సెస్ అయ్యారు. కొన్ని పాత్రలను డిజైన్ చేసిన తీరు అంత సంతృప్తికరంగా అనిపించదు. సంగీతం .. ఫొటోగ్రఫీ సినిమాను నిలబెట్టడానికి తమవంతు ప్రయత్నం చేశాయి. సాగతీత సన్నివేశాలు ఉన్నప్పటికీ సర్దుకుపోతామంటే, ఆ కాలంనాటి విలేజ్ వాతావరణంలోకి వెళ్లి కొన్ని అనుభూతులు ఏరుకుని రావొచ్చు.