Chandrababu Alleged that ycp Committing Irregularities In Kuppam Elections :
ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలను కప్పిపుచ్చుకోడానికే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎన్నికల్లో చాలా తప్పుడు పనులు చేస్తున్నారని, ఇవి మానుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని, మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి కాదుకదా కనీసం పార్టీగా కూడా మనుగడ సాధించడం కష్టమని చంద్రబాబు వైసీపీని హెచ్చరించారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్యలతో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ యధేచ్ఛగా అక్రమాలకు పాలడుతున్నా పోలీసులు, ఎన్నికల సంఘం కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదని విమర్శించారు. అధికారుల్లో కొందరు వైఎస్సార్సీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, దొంగ ఓటర్లను స్వయంగా ప్రజలే పట్టుకొని మీడియా సాక్షిగా ఆధారాలు బైటపెడుతుంటే పోలీసులకు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. బైటి ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి ప్రజలను తరలించి దొంగ ఓట్లు వేయిస్తోందని ఆరోపిస్తూ వాటికి సంబంధించిన కొన్ని వీడియోలను చంద్రబాబు మీడియాకు ప్రదర్శించారు.
వైసీపీ అక్రమాలపై ప్రజలే తిరగబడడం మొదలుపెట్టారని, ఇంకా ఎక్కువ కాలం ఈ ఆటలు సాగవని… ఒక రాజకీయ పార్టీగా ఉండాల్సిన ఏ అర్హతా వైసీపీకి లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. కులమతాలకు, రాగద్వేషాలకు అతీతంగా…దేశ సమగ్రతను, వ్యవస్థలను కాపాడాల్సిన అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్ లు అవినీతి, రౌడీల కోసం పనిచేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు స్థానిక ఎన్నికలు, చట్టసభల ఎన్నికలు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులే నిర్వహించేవారని, కానీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని, రాజ్యంగపరంగా రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ఎన్నికల సంఘాలు ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ అప్పుడే ఎన్నికలు బాగా జరిగాయని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
Also Read : కుప్పం చంద్రబాబు అడ్డా: లోకేష్