Friday, September 20, 2024
HomeTrending NewsYSRCP: ముందు కుప్పంలో గెలువు: శ్రీకాంత్ రెడ్డి

YSRCP: ముందు కుప్పంలో గెలువు: శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని, తాము చెప్పిందే వినాలన్నట్లు ఆయన తీరు ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు.  రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీ ఇంబర్స్ మెంట్ లాంటి పథకాలపై ఆయన ఏనాడూ ఆలోచన చేయలేదని  ఆరోపించారు.  నాలుగేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం లక్షా 77 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిందని కేంద్ర పార్లమెంట్ సాక్షిగా చెబితే దాన్ని నమ్మబోమని అంటారని అన్నారు. తమ ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు డిబిటి ద్వారా ప్రజలకు సంక్షేమం అందించిందన్నారు. బాబు ఐదేళ్ళ కాలంలో చేసిన మూడు లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

హంద్రీనీవా ప్రాజెక్టు సామర్ధ్యం 1999లో ఎందుకు తగ్గించారో చెప్పాలని, ఆవులపల్లి రిజర్వాయర్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి ఎందుకు ఆపేయించారో, కందలేరు నుంచి చిత్తూరు జిల్లాకు తాగు నీరు ఇవ్వాలని ఇచ్చిన జీవో ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మందు రేట్లు తగ్గిస్తామని బాబు ప్రజలకు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  రెండు పార్టీల మేనిఫెస్టోపై చర్చిద్దామంటే పారిపోతున్నారని విమర్శించారు.

బాబు పూనకం వచ్చినవాడిలా ఊగిపోతున్నారని,  నలుగురు రౌడీలను వెంటేసుకుని.. సిగ్గు లేకుండా తాన సింహాన్ని, పులిని అని చెప్పుకుంటున్నారని నిప్పులు చెరిగారు. కొడుకు వయసున్న జగన్ ను ఎదుర్కోలేక, హుందాగా వ్యవహరించలేక పోతున్నారన్నారు.  జగన్ చేస్తున్న ఫలానా పని తప్పు కాబట్టి తాను వస్తే ఇంకా మంచి చేస్తానని చెప్పుకునే ధైర్యం బాబుకు లేదన్నారు. కనబడిన పార్టీనల్లా వెంటేసుకొని పొత్తులు పెట్టుకోవడం కాదని ఒంటరిగా బరిలోకి రావాలని సవాల్ చేస్తే స్పందించరని ధ్వజమెత్తారు.

పుంగనూరు, అంగళ్లు లో జరిగిన ఘర్షణలకు సంబంధించి కేసు నమోదు చేసి బాబును ఏ 1 గా చేయాలని, ఈ దాడిలో గాయపడిన పోలీసులకు, ప్రజలకు ఒక్కొక్కరికీ పది లక్షల రూపాయలు ఆయన పార్టీ ఆఫీసు నుంచే  ఇప్పించాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన వాహనాలను రికవరీ చేయించాలని అన్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడిస్తానని బాబు సవాల్ చేస్తున్నారని, ముందు బాబును కుప్పంలో ఓడిస్తే రాష్ట్రానికి పట్టిన శని పోతుందని వ్యాఖ్యానించారు. కుప్పంలో ఈసారి ఓటమి తథ్యమని, అది తెలిసే ఇలా చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్