Friday, March 29, 2024
HomeTrending Newsగ్రీజు రాయలేరు, మూడు కడతారా?: బాబు

గ్రీజు రాయలేరు, మూడు కడతారా?: బాబు

Government Failure-Babu:
అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు గ్రీజు రాయలేనివారు మూడు రాజధానులు కడతారా అని తెలుగుదేశం పార్టీ  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.  ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇటీవలి వరదలకు 62 మంది బలయ్యారని ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం మానవ తప్పిదమేనని… దీనిపై గతంలో తాను చెప్పిన విషయాన్నే కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్లో చెప్పారని బాబు వివరించారు. ఈ ప్రభుత్వానికి ఒళ్లంతా ఇగో అని, అందుకే చెప్పినా అర్ధం కాదని బాబు వ్యాఖ్యానించారు.  భారీ వర్షాలపై నవంబర్ 18నే వాతావరణ శాఖ అప్రమత్తం చేసిందని,  కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అందుకే ఈ విషయమై జ్యుడిషియల్ విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని బాబు డిమాండ్ చేశారు.

ఎగువ మండపల్లి, దిగువ మండపల్లి, పూలపుత్తూరు, గుండ్లూరు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోయాయని, మరో ­10-12  గ్రామాలు బాగా దెబ్బతిన్నయన్నారు. తాను ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రభుత్వం తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని ఆయా గ్రామాల ప్రజలు చెప్పారని బాబు వివరించారు. ఈ వరదలు వచ్చిన రోజున సిఎం జగన్ అసెంబ్లీ తనపై కామెంట్లు చేస్తూ పైశాచిక ఆనందం పొందారని బాబు తీవ్రంగా మండిపడ్డారు.

వరద బాధితులకు సరైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేకపోయారని, కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం కనీసం టెంట్లు కూడా వేయలేకపోయిందని, ఇళ్లు, పొలాలు పూర్తిగా ఇసుక మేటలు వేశాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి సమీపంలోని రాయల చెరువుకు రిపేర్లు వస్తే మామూలు వ్యక్తులను పెట్టి రిపేర్లు చేయించారని, అది గానీ తెగిపోయి ఉంటె దాదాపు 30 గ్రామాలు మునిగిపోయి ఉండేవని బాబు అన్నారు. తుమ్మలగుంట చెరువును క్రికెట్ స్టేడియంగా మార్చారని, దీనితో పద్మావతి వర్సిటీ నుంచి అటో నగర్ వరకూ వరద వచ్చిందని చెప్పారు. వరద ప్రాంతాల్లో సిఎం పర్యటనపై కూడా  చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బాధితులను బైటికి రానీయకుండా, తూ తూ మంత్రంగా జగన్ టూర్ సాగిందని, ఆంక్షలు విధించి పర్యటిస్తారా అని ప్రశ్నించారు. బాధితులు ఎవరూ ప్రశ్నించకుండా ముందుగానే పోలీసులతో బెదిరించారని బాబు వెల్లడించారు.

పెన్నానదిలో ఇసుక దందాలతోనే కరకట్టలు బలహీనంగా మారాయని,  ఇసుక దోపిడీపై తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని బాబు హెచ్చరించారు.

Also Read : భారతంలోనూ మధ్యవర్తిత్వం: జస్టిస్ రమణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్