చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. మే మూడవ తేది నుంచి జరిగే చార్ ధాం యాత్రకు వచ్చే వారు కోవిడ్ టీకా సర్టిఫికేట్ చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే చార్ ధాం యాత్రకు వచ్చే భక్తులు అందరు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ వెబ్ సైట్ లో ఖచ్చితంగా పేర్లు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ సంధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Tourism deparment for chardhamyatra uttarakhand వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవటం ద్వారా అవసరమైన వారికి అత్యవసర సాయం చేసేందుకు వీలవుతుంది. మే జూన్ నెలల్లో అకాల వర్షాలకు గతంలో హిమాలయాల్లో కొండ చరియలు విరిగి పడటం, నదులు ఉప్పొంగి ప్రవహించటం తదితర ప్రకృతి విపత్తులు సంభవించాయి. ఈ నేపథ్యంలో యాత్రికులు ఖచ్చితంగా పేర్లు నమోదు చేసుకోవాలని ఉత్తరఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. చార్ ధామ్ యాత్ర ఏర్పాట్లపై డెహ్రాడున్ లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
ఎంతో పవిత్రంగా హిందువులు భావించే తీర్థయాత్రల్లో ఒకటి ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర. చార్ ధాం యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాలను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. గతంలో చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఆలయాల్లో సౌకర్యాలకు అనుగుణంగా భక్తులను అనుమతించే వారు ఈ దఫా భక్తుల సంఖ్యపై ఎలాంటి ఆంక్షలు లేవని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి ఎస్.ఎస్ సంధు పేర్కొన్నారు.