చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బొగ్గు కుంభ‌కోణానికి సంబంధించిన కేసులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ 14 చోట్ల ఇవాళ సోదాలు నిర్వ‌హిస్తోంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నేత‌ల ఇండ్లు, ఆఫీసుల్లోనూ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ట్రెజ‌ర‌ర్ ఇంట్లో కూడా సోదాలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజ‌ధాని రాయ్‌పూర్‌లో ఫిబ్ర‌వ‌రి 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ ప్లీన‌రీ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ దాడులు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం చ‌త్తీస్‌ఘ‌డ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సీఎంగా భూపేశ్ భ‌గ‌ల్ కొన‌సాగుతున్నారు.

ఎమ్మెల్యేలు, ఆఫీసు బేర‌ర్ల‌కు చెందిన ప్ర‌దేశాల్లోనే ఈడీ సోదాలు జ‌రుగుతున్నాయి. సీఎం భూపేశ్ భ‌గ‌ల్‌తో వారంద‌రికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బొగ్గు స్కామ్‌లో ల‌బ్దిపొందిన నేత‌ల ఇండ్ల‌ల్లోనే దాడులు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. స్కామ్ సొమ్మును పార్టీ ఫండ్‌గా మ‌లుపుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ నిధుల్ని ఖైరాఘ‌ర్ బైపోల్స్ స‌మ‌యంలో వాడిన‌ట్లు తెలుస్తోంది.

ఈడీ సోదాల్ని సీఎం భ‌గ‌ల్ ఖండించారు. భార‌త్ జోడో యాత్ర స‌క్సెస్‌తో బీజేపీ చిరాకుకు లోనైంద‌ని, అదానీ నిజాల్ని ఎక్స్‌పోజ్‌ చేయడం వ‌ల్ల కూడా ఆ పార్టీ ఇబ్బందిప‌డుతోంద‌ని, దృష్టి మ‌ళ్లించేందుకు ఈ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని, ఈ దేశానికి నిజం తెలుసు అని, పోరాడి గెలుస్తామ‌ని సీఎం భ‌గ‌ల్ ఓ ట్వీట్‌లో తెలిపారు.

ట్రెజ‌ర‌ర్ రామ్ గోపాల్ అగ‌ర్వాల్‌కు 52 కోట్లు ముడుపులు ముట్టిన‌ట్లు డాక్యుమెంట‌రీ ఆధారాలు ఉన్నాయ‌ని ఈడీ పేర్కొన్న‌ది. ఆరి డోంగ్రి మైనింగ్‌లో జ‌రిగిన అక్ర‌మాల‌కు సంబంధించిన కేసులో కూడా ఈడీ ద‌ర్యాప్తు చేస్తోంది. ట‌న్ను బొగ్గు స‌ర‌ఫరాపై అక్ర‌మంగా రూ.25 వ‌సూల్ చేసి.. 2021లో స‌గ‌టున సుమారు 500 కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు ఈడీ ఆరోపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *