దక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ భూకంపం సంభవించింది. గురువారం రాత్రి 11.03 గంటలకు సెంట్రల్‌ చిలీ తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6.3గా నమోదయింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని నేషనల్‌ సెంటర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. రాజధాని శాంటియాగో సమీపంలో భుప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా, దేశంలో ఈ నెల 23న కూడా భూమి కంపించింది. ఇక్విక్‌లో 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. సునామి హెచ్చరికలు జారీ చేశారు. 22న అర్ధరాత్రి సమయంలో అర్జెంటీనాలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. శాన్ ఆంటోనియో డి లాస్ కోబ్రెస్‌కు వాయువ్యంగా 84 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్‌జీఎస్‌ తెలిపింది.

ఇక 1960 మే 22న చిలీలో సంబవించిన భూకంపమే ఇప్పటివరకు అతిపెద్దది. చిలీలోని బయో-బయో ప్రాంతంలో 9.5 తీవ్రతతో సుమారు 10 నిముషాలు భూమి కంపించింది. దీని ప్రభావంతో సముద్రంలో 25 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడిన రాకాసి అలలు దక్షిణ చిలీ, హవాయి, జపాన్‌, ఫిలిప్పీన్స్‌, తూర్పు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తీరాలను తాకాయి. ఈ భూకంపం, సునామీ ధాటికి 1000 నుంచి 6 వేల మంది మరణించగా, దాదాపు 400 కోట్ల డాలర్ల ఆస్తినష్టం వాటిల్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *