China Conspiracy In Tibet :
చైనా కుట్ర పూరిత చర్యలు మరోసారి బయటపడ్డాయి. చైనా మెయిన్ ల్యాండ్ లో కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నా మైనారిటీలు ఉన్న టిబెట్, జిన్జియాంగ్ ప్రావిన్సుల్లో కట్టడి చర్యలు, నిబంధనలు గాలికి వదిలేశారు. దేశంలోని ప్రధాన నగరాల్లో వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అనేక నగరాల్లో లాక్ డౌన్ విధించింది. ఆయా రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని కూడా మూసివేసి కఠినమైన ఆంక్షలు పెట్టారు. టిబెట్, జిన్జియాంగ్ ప్రావిన్సుల్లో మాత్రం ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. టిబెట్లో ఆంక్షలు లేకపోవటంతో వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. కేవలం రెండు డోసులు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా ఆధారాలు చూపితే సరిపోతుందని పేర్కొనటంతో పర్యాటకులు వరదలా పోటెత్తారు.
ముఖ్యంగా టిబెట్ రాజధాని లాసా చైనా పర్యాటకులతో జనసంద్రంగా మారింది. బర్ఖోర్ పట్టణంలో చైనా పర్యాటకులను చూసి స్థానికులు హడలిపోతున్నారు. ఒక్కసారిగా వందల సంఖ్యలో వస్తున్నవారితో కరోనా వ్యాపించే ముప్పు పొంచి ఉందని టిబెటన్లు ఆందోళన చెందుతున్నారు. లాసా నగరంలోని ప్రఖ్యాత పొటాలా రాజప్రాసాదం సందర్శించేందుకు స్థానికులకు ఆంక్షలు పెట్టిన చైనా ప్రభుత్వం పర్యాటకులను మాత్రం అనుమతించింది.
టిబెట్లోని ఆమ్దో ప్రాంతంలోని క్వింగై ప్రావిన్సులో ఓ చైనా టూరిస్టుకు కరోనా పాజిటివ్ అని తేలటంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. టిబెట్లో వైద్య సదుపాయాలూ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాపిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేడియో ఫ్రీ ఆసియా ఇప్పటికే ప్రకటించింది.
Must read : పునరాలోచన చేయండి: లక్షీనారాయణ