Saturday, January 18, 2025
HomeTrending Newsతూర్పు సరిహద్దుల్లో చైనా చొరబాట్లు

తూర్పు సరిహద్దుల్లో చైనా చొరబాట్లు

భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొరబడినట్టు తెలుస్తున్నది. అరుణాచల్‌ ప్రదేశ్‌ అంజా జిల్లాలోని కపాపు(kibitoo) ప్రాంతంలోకి చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) చొరబడినట్టు ఆనవాళ్లు ఉన్నాయని ఇటానగర్‌ కు చెందిన ఓ వార్తాసంస్థ  వెల్లడించింది. ఈ ప్రాంతం ఇండో-చైనా సరిహద్దుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మయన్మార్ సమీపంలోని ఇక్కడ చలిమంటలు వేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయి.

బండరాళ్లపై స్ప్రే పెయింట్‌లో చైనా- 2024 అని రాసి ఉంది. చైనాకు సంబంధించిన పలు ముద్రలను పెయింటింగులు వేశారు. చైనా ఆహార పదార్థాలు సైతం లభించాయి. వారం రోజుల క్రితం చైనా బలగాలు ఇక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఉండవచ్చని, ఇందుకు గుర్తుగా చైనా సైనికులు కావాలనే పెయింటింగ్‌లు వేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి చైనా చొరబడిందనే వార్తలపై కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. సరిహద్దు సరిగ్గా లేని ప్రాంతాల్లో పహారా కాస్తున్నప్పుడు ఒక దేశ భూభాగంలోకి మరో దేశ బలగాలు వెళ్తుంటాయని, అంతమాత్రాన భారత భూభాగాన్ని ఆక్రమించినట్టు కాదన్నారు. సరిహద్దు స్పష్టత లేని ప్రాంతాల్లో కేవలం కొన్ని పెయింటింగ్‌లు ఉన్నంత మాత్రాన ఆ ప్రాంతాన్ని ఆక్రమించినట్టు కాదన్నారు. చైనా మన భూభాగాన్ని తీసుకోలేదని, ఎలాంటి శాశ్వత నిర్మాణాన్ని అనుమతించబోమని  తేల్చి చెప్పారు.

లడ్డాఖ్ ప్రాంతంలో చైనాతో ఇప్పటికే వివాదాలు ఉండగా అరుణాచల్ ప్రదేశ్ లోకి రావటం… ఆ అంశాన్ని కేంద్రమంత్రి తేలిగ్గా కొట్టిపారేయటం వివాదాస్పదం అవుతోంది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రకటన అసంబద్దమని విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. భారత దేశ మీడియా అరుణాచల్ లో జరిగిన అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవటం విచారకరమని, ఈ వ్యవహారంపై కేంద్రం ముందుగా ప్రకటన చేసి ఉండాల్సిందని విపక్షాలు మండిపడుతున్నాయి.

భారత తూర్పు సరిహద్దుల్లో భూటాన్ – మయన్మార్ మధ్య అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది. గతంలో ఈశాన్య ఫ్రాంటియర్ ఏజెన్సీ, 1962 వివాదంలో ఈ ప్రాంతంలో చైనా ఆక్రమించింది. చైనా విషయంలో అప్రమత్తంగా లేకపోతే లడ్డాఖ్ లో జరిగిన ఘటనలే పునరావృతం అవుతాయని విశ్లేషణలు జరుగుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్