కరోనా క్రైసిస్ నేపథ్యంలో సినీపరిశ్రమ సమస్యలపైనా.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్టు రేట్ల సమస్యలపైనా చర్చించేందుకు ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. మంత్రి పేర్ని నాని నేరుగా చిరుకి ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే.. ఈ భేటీలో సీఎంకి విన్నవించాల్సిన అన్ని విషయాలపైనా కూలంకుషంగా చర్చించి వెళ్లాలన్న ఉద్దేశంతో ఇండస్ట్రీ మీటింగ్ హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగింది.
ఈ భేటీలో ఫిలిం చాంబర్ అధ్యక్షులు నారాయణ దాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్ . రామారావు , దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్, సి. కళ్యాణ్, ఎన్వి. ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ, భోగవల్లి బాబీ, యూవీ క్రియేషన్స్ విక్కీ – వంశీ ఇలా.. నిర్మాతల సంఘం.. పంపిణీ, ఎగ్జిబిషన్ రంగాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇటీవల ఏపీలో వచ్చిన జీవోలో ఉన్నవాటి పై చర్చించారు. సీఎంతో సమస్యల పరిష్కారానికి మార్గాలేమిటి? అన్నదాని పై చర్చించారు. అన్నిటికీ త్వరగా పరిష్కరించాలన్నది ప్రధాన డిమాండ్. చిన్న నిర్మాతల సమస్యలపైనా సీఎంతో భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో టిక్కెట్టు రేట్ల పై చర్చించారు. గ్రామ పంచాయితీ, నగర పంచాయితీ, కార్పొరేషన్ ఏరియాల్లో టిక్కెట్టు ధరల పై ఏం అడగాలి? చిన్న సినిమాల మనుగడకోసం ఐదో షో విషయమై సిఎంతో ప్రస్తావించాలని నిర్ణయించారు. ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై సానుకూల వాతావరణం వచ్చేలా అందరూ కలిసి చర్చించుకున్నారు.