Sunday, September 29, 2024
Homeసినిమావిశ్రాంతి లేకుండా శ్రమ చేసేది సినీ కార్మికులే: చిరంజీవి

విశ్రాంతి లేకుండా శ్రమ చేసేది సినీ కార్మికులే: చిరంజీవి

Cine-May Day: కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, వందేమాతరం శ్రీనివాస్, దిల్ రాజు, అలీ, సి.కల్యాణ్, గద్దర్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ… సినీ కార్మికులందరూ చేసుకుంటున్న పండుగకు నన్ను ఆహ్వానించిన ఫెడరేషన్‌కు ధన్యవాదాలు. నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగటానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినీ పరిశ్రమలో ఎవరి దారి వారిదే అవడం వల్ల ఇంతకు ముందు ఇలాంటి మేడేను జరుపుకోలేదు. ఈ రోజు కోసం నేను అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నాను. నేనూ కార్మికుడినే. ఎవరికి ఏ కష్టమొచ్చినా వారి వెనకే ఉంటా. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం బాధ్యతగా భావించా.

రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు ఐక్యంగా ఉండాలి. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కావాలి. తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిశ్రమకు ఎంతో భరోసా ఇచ్చారు అని అన్నారు.  కార్మికులు ఉద్యమించి తెచ్చుకున్న పండుగ ఇది. 24గంటల్లో 8గంటలు శ్రామికులు పని చేస్తారు. కానీ సినిమా కార్మికులకు నిర్ణీత సమయం ఉండదు. అడవిలో ఉంటారు. చలిలో పని చేయాలి. పండగలు, పబ్బాలు అన్న తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాము. నాకింకా గుర్తుంది.. షూటింగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో నూతన ప్రసాద్‌కి తీవ్రగాయాలయ్యాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కూర్చీలో ఉండి క్లోజప్ షాట్స్‌లో నటించారు. వేరే ఇండస్ట్రీలో అయితే కోలుకునే వరకూ రేస్ట్ తీసుకుంటారు.

సినీ పరిశ్రమ కోసం ఎంతో మంది తమ కుటుంబాలను త్యాగం చేశారు. సినీ కళాకారులు కాదు… సినీ కళా కార్మికులు అని నటుడు రావుగోపాల్ రావు అనేవారని గుర్తు చేసుకున్నారు. అలాగే అల్లూ రామలింగయ్య గారి తల్లి చనిపోయిన తర్వాత షూటింగ్‌కి వెళ్లారు. గుండెల నిండా విషాదం పెట్టుకొని మనకు నవ్వులు పంచారాయన. ఇక నా విషయం తీసుకుంటే.. జగదేకవీరుడు అతిలోకసుందరి కోసం 103 జ్వరంతో బాధపడుతూ శ్రీదేవితో కలిసి డ్యాన్స్‌ చేశా. షూటింగ్‌ అనంతరం 15 రోజులు హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యాను. గాడ్‌ఫాదర్‌ సినిమా కోసం ముంబై, హైదరాబాద్‌ తిరగాల్సి వచ్చేది.

నేను డల్‌గా ఉన్నానని చెబితే షూటింగ్‌ ఆగిపోయేది. ఇక సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, వ్యాక్సినేషన్ ఇవ్వడం నా బాధ్యతగా భావించా. ఎప్పుడు ఏం సహాయం కావాల్సిన నేను ఎప్పుడూ అండగా ఉంటాను మీ చిరంజీవి ఎప్పుడూ కార్మికుడే’ అంటూ చెప్పుకొచ్చారు. గుడ్ల ధనలక్ష్మీ ట్రస్ట్ ద్వారా గుడ్ల ధనలక్ష్మీ 5 లక్షల రూపాయలు చెక్కును తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కి మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా అనిల్ వల్లభనేని, దొరై, సురేష్ లకు ఇవ్వడం జరిగింది.

Also Read : చిరును కలుసుకున్న మంత్రి రోజా

RELATED ARTICLES

Most Popular

న్యూస్