Mnrega Scheme : నగర పేద ప్రజానీకానికి కూడా నరేగా(ఉపాధిహామీ చట్టం) అవసరమని టీఆర్ఎస్, చేవేళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై శుక్రవారం ఆయన లోక్‌సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని సంకల్పించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగానే పట్టణాల్లో కూడా ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని రూపొందించాలని సూచన చేశారు. పట్టణీకరణ రోజురోజుకు గణనీయంగా పెరుగుతన్న నేపథ్యంలో పట్టణాల్లో కూడా ఉపాధి హామీ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. సాధారణంగా ఉపాధి, మెరుగైన జీవన అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పట్టణాల వైపు తరలివస్తున్న నేపథ్యంలో పట్టణాల్లోని మౌలిక వసతులపైన ప్రత్యేక దృష్టి అవసరం అన్నారు. ఇది రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 31 శాతం జనాభా పట్టణాల్లో నివాసం ఉంటోందని నొక్కి చెప్పారు. 2030 నాటికి దేశంలోని 40 శాతానికి పైగా జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతుందన్నారు. తెలంగాణ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఇది 50 శాతాన్ని దాటే అవకాశం ఉన్నదని ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో పెద్ద ఎత్తున పట్టణాల్లోకి ప్రజలు తరలి వస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో పట్టణ పేదరికంపైన దేశంలోని అన్ని ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు.
పట్టణ పేదలకు అవసరమైన గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం ,విద్య, సామాజిక భద్రత ,జీవనోపాదుల వంటి అంశాల పైన ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పట్టణంలోని పేదలకు వివిధ అంశాల్లో సరైన అవకాశాలు కల్పించినప్పుడే వారు నాణ్యమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. అందుకే తాను ఈ శాసనాన్ని చేయాలని లోక్‌సభను అభ్యర్థిస్తున్నట్టు ఎంపీ రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. దీంతో పట్టణ పేదలకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : జడ్ కేటగిరీ భద్రతకు ఒవైసీ నిరాకరణ