ఎయిడెడ్‌ స్కూళ్లపై ప్రభుత్వ విధానాన్ని బలవంతంగా రుద్దడంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అందరికీ గట్టిగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఎయిడెడ్‌ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుందని, వారే నడపాలనుకుంటే నడుపుకోవచ్చని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదని, ఇది స్వచ్ఛందం అన్న విషయాన్ని కరాఖండిగా చెప్పాలన్నారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై అధికారులతో సీఎం సమగ్రంగా చర్చించారు.

అమ్మ ఒడి పథకానికి 75 శాతం హాజరు నిబంధనను 2022 నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పిల్లలను చదువులబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ఉద్దేశమని, అందుకే ఈ నిబంధన విధించాల్సి వచ్చిందని, ఈ స్ఫూర్తిని మనం కొనసాగించాలని అన్నారు.

సమీక్ష సందర్భంగా సిఎం చేసిన సూచనలు:

⦿ విద్యాకానుకను అమలు చేస్తున్నాం
⦿ వేల కోట్లరూపాయలు ఖర్చుచేసి తొలివిడతలో 15వేలకుపైగా స్కూళ్లు తీర్చిదిద్దాం
⦿ అమ్మ ఒడి స్ఫూర్తి కొనసాగాలి, పిల్లలంతా బడిబాట పట్టాలి
⦿ అమ్మ ఒడి పథకం ఉత్తర్వుల్లో 75శాతం హాజరు ఉంచాలన్న నిబంధన పెట్టాం
⦿ కోవిడ్‌ పరిస్థితులు కారణంగా ఈ నిబంధన అమలు చేయలేకపోయాం
⦿ అధికారంలోకి వచ్చిన వెంటనే 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించాం
⦿ అమ్మ ఒడి అమల్లోకి వచ్చిన 2–3 నెలలు తిరగకముందే కోవిడ్‌ ప్రారంభం అయ్యింది, స్కూళ్లు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది
⦿ తిరిగి 2020, నవంబరు, డిసెంబరుల్లో పాఠశాలలు తెరిచాం
⦿ జనవరి 2021లో మళ్లీ అమ్మ ఒడి ఇచ్చాం, మళ్లీ రెండో వేవ్‌ కోవిడ్‌ వచ్చింది
⦿ పరీక్షలే నిర్వహించలేని పరిస్థితులు వచ్చాయి
⦿ ఈ ఏడాది కూడా జూన్‌లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి ప్రారంభించాం
⦿ 75 శాతం హాజరు ఉండాలని ఇదివరకే మనం నిర్దేశించుకున్నాం
⦿ సాధారణంగా జూన్‌లో స్కూళ్లు ప్రారంభం అయితే ఏప్రిల్‌వరకూ కొనసాగుతాయి
⦿ వచ్చే విద్యాసంవత్సరంలో పిల్లల హాజరును పరిగణలోకి తీసుకోవాలి
⦿ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాలి
⦿ పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికి విద్యాకానుకను వారికి అందించాలి
⦿ విద్యాకానుకలో భాగంగా పిల్లలకు స్పోర్ట్స్‌ డ్రస్, రెగ్యులర్, స్పోర్ట్స్‌ కి ఉపయోగపడేలా ఉండే షూ ఇవ్వాలి

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ (దిశ స్పెషల్‌ ఆఫీసర్‌) కృతికా శుక్లా, ఎండిఎం అండ్‌ శానిటేషన్‌ డైరెక్టర్‌ బి ఎం దివాన్,  పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) బి ప్రతాప్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *